
అమేథీ/రాయ్‌బరేలీ: దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన జాతీయవాదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తూర్పు యూపీ ఇన్‌చార్జ్ ప్రియాంకా గాంధీ తెలిపారు. కానీ దేశంపై గౌరవం, దేశ ప్రజలపై ప్రేమ బీజేపీలో తనకు ఏమాత్రం కన్పించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవినీతి, పేదరికం వంటి నిజమైన సమస్యలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల గొంతుకను, అభిప్రాయాలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(సోనియా గాంధీ), అమేథీ (రాహల్ గాంధీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
జాతీయవాదానికి కొత్త నిర్వచనం..
‘దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతా. కానీ బీజేపీ నేతలు చేస్తున్న పనుల్లో ఇది నాకెక్కడా కన్పించడం లేదు. జాతీయవాదం అంటే ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. నిజమైన దేశభక్తి అంటే ప్రజల బాధలను సావధానంగా వినడం. అంతేతప్ప దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం కాదు. మోదీ కావొచ్చు, మరే నేతయినా కావచ్చు.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్య..
‘ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజలంతా ప్రేమించే భారత్‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.10,000–రూ.20,000 అప్పు తీర్చలేక ఏటా 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వారి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు పంపి మోసం చేయొచ్చని మోదీ భావిస్తున్నారు. ఇది నిజంగా రైతులను అవమానించడమే’ అని ప్రియాంక స్పష్టం చేశారు.
నేను ఎవ్వరికీ భయపడను..
‘నేను ఎవ్వరికీ భయపడను. పార్టీ ఆదేశాల మేరకే వారణాసి నుంచి నేను పోటీ చేయలేదు. యూపీలో పార్టీ పటిష్టత కోసమే ప్రచారం చేస్తున్నా. నా కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది వారి రాజకీయంలో భాగమే. స్కూలు టీచర్ లేక ప్రతిపక్ష నేత ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యంగా చేసుకుంటారు’ అని అన్నారు.
పాములతో ప్రియాంక ఆటలు
ప్రియాంక ప్రచారంలో భాగంగా కుచరియా గ్రామంలో పాములోళ్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పామును చేతిలోకి తీసుకుని ఆడించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ‘ఏం పర్లేదు’ అని జవాబిచ్చారు. అక్కడి పాములోళ్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన తల్లి సోనియాగాంధీ హయాంలో రాయ్‌బరేలీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, 15 ఏళ్లుగా సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా బీజేపీ అభ్యర్థి దినేశ్‌ప్రతాప్‌సింగ్‌తో పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment