Solving problems
-
ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్ వీక్
సాక్షి, వనపర్తి: మా ఊర్లో విద్యుత్ సంభం ఒరిగింది.. వైర్లు వదులుగా అయ్యాయి.. స్థంభాలు దెబ్బతిని కూలిపోయేలా ఉన్నాయి... ఇలా గతంలో ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విద్యుత్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేవారు. అంతంతమాత్రంగానే స్పందన ఉండేది. ఎంతకూ గ్రామాలకు రాని విదుత్ శాఖ అధికారులు ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒరిగిన స్థంభాలను సరిచేస్తున్నారు. వదులుగా ఉన్న వైర్లను తీసి కొత్తవైర్లు బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. స్తంభాలు పాతుతున్నారు. కొత్తగా అవసరమైన చోట అడిగిందే తడువుగా తీసుకుని వచ్చేస్తున్నారు. చూస్తుండగానే ఒక్కో గ్రామంలో రెండుమూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు కొలిక్కివస్తున్నాయి. ఏళ్లుగా చీకట్లో ఉండే గడిపిన కాలనీలలో ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 22,284 సమస్యలు గుర్తింపు జిల్లాలోని 225 గ్రామ పంచాయతీల్లో విద్యుత్ శాఖకు సంబంధించి మొత్తం 22,284 సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన 24 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన సమస్యలలో అధికారులు 7,361 సమస్యలను పరిష్కరించారు. రోజువారీగా రిపోర్టులు తయారు చేసి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.8.50 కోట్ల నిధుల ను వనపర్తి జిల్లాకు కేటాయించారు. గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నారు. సరిపోకుంటే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలో థర్డ్‌వైర్.. జిల్లాలో థర్డ్‌వైర్ కొన్ని గ్రామాల్లో ఉంటే, మరికొన్ని గ్రామాల్లో లేవు. విద్యుత్ దీపాలను అమర్చేందుకు ఉపయోగించే ఈ థర్డ్వైర్ను ప్రతి జనావాస ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌శాఖ అ«ధికారులు కృషి చేస్తున్నారు. ఏళ్లనాటి సమస్యలు పరిష్కారం పవర్ వీక్ కార్యక్రమం వలన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి పవర్‌వీక్ కార్యక్రమం నిర్వహించాలి. చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్థంభాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వదులుగా.. ఉన్న వైర్లను బిగించారు. – శేఖర్ నాయుడు, రాయినిపల్లి, పానగల్ మండలం ప్రతి సమస్యను పరిష్కరిస్తాం పవర్‌వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో గుర్తించి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మరికొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. సుమారు 7,400 సమస్యలను పరిష్కరించాం. గ్రామాల్లో మాసిబ్బంది నిత్యం పని చేస్తూనే ఉన్నారు. – లీలావతి, ట్రాన్స్‌కో డీఈఈ -
ప్రేమించడమే నిజమైన జాతీయవాదం
అమేథీ/రాయ్‌బరేలీ: దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన జాతీయవాదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంకా గాంధీ తెలిపారు. కానీ దేశంపై గౌరవం, దేశ ప్రజలపై ప్రేమ బీజేపీలో తనకు ఏమాత్రం కన్పించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవినీతి, పేదరికం వంటి నిజమైన సమస్యలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల గొంతుకను, అభిప్రాయాలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(సోనియా గాంధీ), అమేథీ (రాహల్ గాంధీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాదానికి కొత్త నిర్వచనం.. ‘దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతా. కానీ బీజేపీ నేతలు చేస్తున్న పనుల్లో ఇది నాకెక్కడా కన్పించడం లేదు. జాతీయవాదం అంటే ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. నిజమైన దేశభక్తి అంటే ప్రజల బాధలను సావధానంగా వినడం. అంతేతప్ప దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం కాదు. మోదీ కావొచ్చు, మరే నేతయినా కావచ్చు.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్య.. ‘ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజలంతా ప్రేమించే భారత్‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.10,000–రూ.20,000 అప్పు తీర్చలేక ఏటా 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వారి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు పంపి మోసం చేయొచ్చని మోదీ భావిస్తున్నారు. ఇది నిజంగా రైతులను అవమానించడమే’ అని ప్రియాంక స్పష్టం చేశారు. నేను ఎవ్వరికీ భయపడను.. ‘నేను ఎవ్వరికీ భయపడను. పార్టీ ఆదేశాల మేరకే వారణాసి నుంచి నేను పోటీ చేయలేదు. యూపీలో పార్టీ పటిష్టత కోసమే ప్రచారం చేస్తున్నా. నా కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది వారి రాజకీయంలో భాగమే. స్కూలు టీచర్ లేక ప్రతిపక్ష నేత ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యంగా చేసుకుంటారు’ అని అన్నారు. పాములతో ప్రియాంక ఆటలు ప్రియాంక ప్రచారంలో భాగంగా కుచరియా గ్రామంలో పాములోళ్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పామును చేతిలోకి తీసుకుని ఆడించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ‘ఏం పర్లేదు’ అని జవాబిచ్చారు. అక్కడి పాములోళ్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన తల్లి సోనియాగాంధీ హయాంలో రాయ్‌బరేలీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, 15 ఏళ్లుగా సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా బీజేపీ అభ్యర్థి దినేశ్ప్రతాప్సింగ్తో పోటీ పడుతున్నారు. -
రాజ్యాధికారంతోనే సమస్యల పరిష్కారం
- ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య తార్నాక: బీసీ వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే సమస్యలు పరిష్కార మవుతాయని జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘రిజర్వేషన్స్ ఫర్ డెమోక్రసీ, ఫైట్ ఎగెనెస్ట్ ఫార్వార్డ్(పటేల్) కాస్టిజమ్’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశ్వర య్య ముఖ్య వక్తగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలను మూడు గ్రూపులుగా విభజించాలని గతంలోనే తాము కేంద్రానికి విన్నవించామన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 27 శాతం రిజర్వేషన్ సక్రమంగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల హక్కులు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వారికి ఉన్న సౌకర్యాలపై కళాజాతల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కాశీనాథ్, ఓబీసీ కులాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, బెల్లయ్య నాయక్, బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.