రాజ్యాధికారంతోనే సమస్యల పరిష్కారం
- ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య
తార్నాక: బీసీ వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే సమస్యలు పరిష్కార మవుతాయని జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘రిజర్వేషన్స్ ఫర్ డెమోక్రసీ, ఫైట్ ఎగెనెస్ట్ ఫార్వార్డ్(పటేల్) కాస్టిజమ్’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశ్వర య్య ముఖ్య వక్తగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలను మూడు గ్రూపులుగా విభజించాలని గతంలోనే తాము కేంద్రానికి విన్నవించామన్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న 27 శాతం రిజర్వేషన్ సక్రమంగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల హక్కులు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వారికి ఉన్న సౌకర్యాలపై కళాజాతల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కాశీనాథ్, ఓబీసీ కులాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, బెల్లయ్య నాయక్, బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.