సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల సంక్షేమం కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో రూ.5,200 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. అందులోనూ అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీలు), బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే దిశలో ‘కేసీఆర్ ఆపద్బంధు’పేరుతో కార్యాచరణ రూపొందిస్తోంది.
ఎంబీసీల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం అంబు లెన్స్‌లు మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాల్లోని బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి వారికి అధునాతన పరికరాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చడం, కొన్ని బీసీ కులాలు సంచార పద్ధతిలో కొనసాగించే వృత్తులను సులభతరం చేసేందుకుగాను వాహనాలు సమకూర్చడం, మరికొన్ని కులాల వారికి వృత్తి పనిముట్లను పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27 నుంచి ఈ ఆపద్బంధు పథకాన్ని ప్రారంభించేందుకు బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ త్వరలో విధివిధానాలు ఖరారు చేయనుంది.
80 శాతానికి పైగా సబ్సిడీతో అంబులెన్సులు
ఆపద్బంధు పథకం కింద రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన ఎజెండాగా కార్యాచరణ సిద్ధమవుతోంది. బీసీ సంక్షేమ శాఖ వెల్లడించిన ప్రకారం.... రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎంబీసీ యువకులకు అంబులెన్సులు అందజేయనున్నారు. ఐదారుగురు యువకులతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి, ఆ గ్రూపును లబ్ధిదారులుగా ఎంపిక చేసి అంబులెన్సులు ఇస్తారు. వీటిలో మినీ ఐసీయూతో పాటు వెంటిలేటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో అంబులెన్సు (యూనిట్) ధర రూ.26 లక్షలు ఉంటుంది. ఇందులో లబ్ధిదారులైన గ్రూపు సభ్యులు 10–15 శాతం మార్జిన్ మనీ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఎంత శాతం చెల్లించాలన్నది ఇంకా ఖరారు కాకపోయినా యూనిట్ ధరలో 85 శాతానికి పైగా ప్రభుత్వమే సబ్సిడీ కింద భరించనుంది. రోడ్ సేఫ్టీ అథారిటీతో పాటు ప్రైవేటు సంస్థలతో ఈ ఆంబులెన్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకుని వారికి ఖచ్చితమైన, శాశ్వత ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
మహిళా సంఘాలకు నిఫ్ట్‌లో తర్ఫీదు
మరోవైపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న బీసీ మహిళలకు అత్యాధునిక పద్ధతుల్లో కుట్టు శిక్షణ కూడా ఆపద్బంధు ద్వారా ఇప్పించనున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా ఈ శిక్షణను ఇప్పించి అందులో ఉత్తీర్ణులైన సభ్యులకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ లాంటి ఆధునిక సామాగ్రిని అందించనున్నారు. ముందుగా పట్టణ ప్రాంతాల్లోని సభ్యులకు ఈ అవకాశం కల్పించాలని, ఆ తర్వాత మండల స్థాయి వరకు వెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ యోచిస్తోంది. మారుతున్న ఫ్యాషన్ పోకడల నేపథ్యంలో ఇలాంటి శిక్షణ బీసీ మహిళలకు ఉపకరిస్తుందని, వారికి ఆర్థిక సాధికారత చేకూరుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం తొలి విడతలో 50 వేల మంది బీసీ మహిళా సభ్యులను ఎంపిక చేయనున్నారు.
పూసలమ్ముకునేందుకు ప్రత్యేక వాహనం
ఇక బీసీ కులవృత్తులకు ఆసరాగా నిలిచే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బంధు విధివిధానాలు రూపొందిస్తోంది. సంచార వృత్తితో జీవనం సాగించే పూసల కులస్తుల కోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. వీరి వృత్తికి అనుగుణంగా ఉండే విధంగా ప్రత్యేక వాహనాలు (మోపెడ్‌లు) తయారు చేయించి ఇవ్వాలని నిర్ణయించారు. వీరితో పాటు రజక, నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, మేదర, విశ్వ బ్రాహ్మణ, సగర, వడ్డెర కులస్తులకు ప్రతి కులానికి కనీసం 5వేల మందికి చొప్పున వారి వారి వృత్తి పనిముట్లను అందజేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధికి నిదర్శనం: మంత్రి గంగుల
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ప్రత్యేక ఆలోచనలున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ‘సాక్షి’తో చెప్పారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు అమల్లో ఉన్నాయని, ఇప్పుడు ఆపద్బంధు పథకం అమలు చేయడం ద్వారా బీసీలపై తనకున్న చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోందని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని చెప్పిన గంగుల.. ఆపద్బంధు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment