'జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషనైపోయింది'
బెంగళూరు: ‘ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. నేను ఈ పవిత్ర వేదిక నుంచి అటువంటి వారికి ఒకటే చెప్పదలుచుకున్నా... జాతీయ సమగ్రత లేకపోతే రాజ్యాంగమే ఉండదు. ప్రజలు కూడా అటువంటి వారిని దూరంగా ఉంచాలి’ అని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. మంగళూరులో ఆదివారం జరిగిన తిరంగయాత్రలో పాల్గొన్న అనంతరం మంగళూరు వర్శిటీలో జరిగిన సభలో ప్రసంగించారు.
మునుపెన్నడూ లేనంతగా భారత దేశం రెండేళ్ల కాలంలో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుండడాన్ని ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాయన్నారు. ఇందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న విధానాలే కారణమన్నారు. దేశ భద్రత విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీ పడదన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాటుదారులను ఎదుర్కొనేందుకు గతంలోలాగా ఢిల్లీ నుంచి ఆదేశాలు అందే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు.
నిరసనల స్వాగతం...
తిరంగ యాత్రలో పాల్గొనడానికి మంగళూరు వచ్చిన అమిత్‌షాకు నిరసనల స్వాగతం లభించింది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు ఆయన రాకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లటి జెండాలు పట్టుకుని నగర వీధుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.