జాతీయవాదమంటే దేశభక్తేనా?
జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తిం చడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయవాదమే.
యుద్ధం.. యుద్ధ తంత్రంపై సహజంగానే నాకు ఆసక్తి ఎక్కువ. నేను పుట్టి, పెరిగిన పల్లె నేపథ్యమో.. దేశభక్తి భావమో కారణం కావచ్చు. మృగశిర కార్తె కాలంలోనే పుట్టలోంచి ఊసిళ్లు బయటికొచ్చినట్టు.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఉగ్రవాదం, దేశభక్తి అంశాలు తెరమీదకు వస్తాయి. హిందూ జాతీయ వాదమే దేశభక్తి అని, శత్రు దేశంపై యుద్ధ వాతావరణంతోనే తరగని ఓటు బ్యాంకు సొంతం చేసుకోవచ్చని కాషాయం నేతలకు బాగా తెలుసు. లౌకిక్ భారత్ అనే మాట చెప్పకపోయినా హిందూ జాతీయ వాదమే దేశభక్తి అనే అంతర్గత వాతావరణాన్ని దేశంలో తీసుకొచ్చారు.
ఎక్కడైతే పాలకులు ప్రజా రక్షణను విస్మరిస్తారో.. అక్కడ ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దును అంగీకరించటంతో పాటు ఎలాంటి కాల్పులకు కవ్వింపులకు పాల్పడవద్దని ఒప్పందం చేసుకున్నారు. అయినా అడపా దడపా అక్కడ అల్లర్లు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అలాంటి వాతావరణమే ఉంది. అయినా కాశ్మీరీలు మన అంతర్భాగం. పక్కన పాకిస్తాన్ సైనికులతో పోరాడటానికి, భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీరీ తిరుగుబాటుదారులను నిలవరించడానికి మధ్య స్పష్టమైన రక్షణ నిబంధనలు ఉన్నాయి. కళ్లు మూసుకుపోయిన పాము తన పిల్లలనే కొరికి తిన్నట్టుగా, సొంత దేశం పౌరుడినే వాహన బాయ్‌నెట్‌కు కట్టుకొని మన సైన్యాధికారి రక్షణ కవచంగా వాడుకోవడం తీవ్రమైన యుద్ధ నేరం కింద పరిగణించాల్సింది పోయి ఎన్‌ఎల్ గొగోయ్ అనే సైనిక మేజర్‌కు అవార్డుతో సత్కరించడం కశ్మీరీలను కవ్విం చటమే.
దేశభక్తిని ఒలకబోసే బీజేపీ పాలనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 1999 మే–జూన్ మాసంలో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీ హయాంలోనే జరిగింది. మొదట దీన్ని కశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా చెప్పారు. భారత వాయుసేనలు వెళ్లి సమీప కొండల మీద పాకిస్తాన్ దళాలు మకాం వేశాయి అని చెప్పేవరకు పాలకులకు తెలి యదు. ఆ యుద్ధంలో మనం గెలిచాం అనిపించినా మన వైపు నుంచి 527 మంది సైనికులు మరణించగా, 1,363 మంది గాయపడ్డారు.
అదే ఏడాది డిసెంబర్ మాసంలో నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్ దేశంలోని కాందహార్ అనే ప్రాంతంలో దింపి కరుడు గట్టిన తీవ్రవాదులు మౌలానా మసూద్ అజాద్, ఒమర్ సయీద్ షేక్, హామ్మద్ జర్గర్‌లను స్వయంగా అప్పటి రక్షణ మంత్రి జశ్వంత్ సిన్హా ఉగ్రవాదులకు అప్పగించారు. ఈ ఏడాది కశ్మీర్ అల్లర్లు, రాజ్‌కోట్‌పై దాడి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు. భారతావనికి బలమైన గూఢచర్య వ్యవస్థ ఉంది. ఆర్‌ఏడబ్ల్యూ(రా) లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవి ఉగ్ర సమాచారాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదులు తండాలకు, తండాలుగా దేశ సరిహద్దుల్లో చొరబడుతుంటే ముందే పసిగట్టి చేసిన హెచ్చరికలను దాచిపెట్టి కాషాయపు దేశభక్తులు మౌనంగా ఉన్న ఫలితమే పై సంఘటనకు కారణం.
భారతీయ సమాజంలో కొద్దిమంది మిగతా ప్రజ లంతా ఏం తినాలో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఏది దేశభక్తో.. ఎంతవరకు మాట్లాడాలో నిర్ణయిస్తున్నారు. ఒపీనియన్ మేకర్స్ వాళ్లే, మిగిలిన సమాజం అంతా వాళ్లకు కోరస్ పాడాలి. ఎక్కడైనా ధిక్కార స్వరం వినిపిస్తే వాడు దేశానికి ద్రోహం చేశాడనే వాతావరణాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు. కాషాయం రంగు ఒంటి నిండా పులుముకున్న భజనపరులంతా ఏం చేసినా అది జాతీయవాదమేనట.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవు, గో మాంసం గురించి మాట్లాడిన ఓ ఎంఐఎం నాయకుడి మీద పోలీ సులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ ఇప్పించింది పక్కా కాషాయ కండువా కప్పుకున్న న్యాయవాది. ఇక్కడ అది వృత్తి ధర్మం అంటుండొచ్చు. కానీ ఈ అంశంలో వృత్తిని, వ్యక్తిని వేర్వేరుగా చూడటం సాధ్యమేనా?
జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తించడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయ వాదమే. సంపద సృష్టించే సామర్థ్యం ఉండి, దారిద్య్ర రేఖకు దిగువనే పేదరికంలో మగ్గిపోతున్న చేతివృత్తుల జాతులకు ఉపాధి కల్పించడం జాతీయవాదమే. తెలంగాణ ప్రాంత ఆచరణాత్మక ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్‌రూం, గొర్రెలు, చేపల చెరువుల పునరుద్ధరణ పథకాలు అమలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాద భావజాలం సెంటిమెంటుతో అమిత్‌షా తెలంగాణ గడ్డ మీదకు అడుగుపెట్టారు. రజాకార్ ప్రభావిత గ్రామాల్లో తిరిగి తన పాచిక విసిరే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం విభిన్నమైనది, విశిష్టత ఉన్న ప్రాంతం. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సకల మతాల సాంస్కృతిక కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. ఇది అమిత్‌షా లాంటి వాళ్ల కంటి సైగలకు, ఉడుత ఊపులకు కదిలే ప్రాంతం కాదు. ఇక్కడ కాషాయపు గెంతులు కుప్పిగంతులు కాక తప్పదు.
- సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త దుబ్బాక శాసన సభ్యులు,
శాసనసభ అంచనాలు–పద్దుల కమిటీ చైర్మన్
మొబైల్ : 94403 80141