solipeta ramalinga Reddy
-
రసవత్తరం: వ్యతిరేకతపై విపక్షాల ఆశలు
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచారం చేస్తోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. ఏ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాత్రం అన్నీ తానై మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు, రామలింగారెడ్డి మృతితో వచ్చే సానుభూతి అనుకూలించి అత్యధికంగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సాక్షి, సిద్దిపేట : సంక్షేమ పథకాల్లో దుబ్బాక నియోకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగ్, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటి వరకు 78,187 మంది రైతులకు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, 5,599 మందికి కల్యాణ లక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయి. వీరందరూ ప్రభుత్వంపై విధేయతతో ఉండటంతో వారి ఓట్లు తమకే పడుతాయని టీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో దింపడంతో సానుభూతి కూడా తోడవుతందని చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో 1,97,468 మంది ఓటర్లు ఉండగా గత ఎన్నికల్లో 89,299 టీఆర్ఎస్ పార్టీకి రాగా సమీప అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,779 ఓట్లు మాత్రమే వచ్చి 62,520 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి మెజార్టీ లక్ష దాటుతుందని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు) వ్యతిరేక పవనాలపై విపక్షాల ఆశలు ఉప ఎన్నికలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల ఓటర్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంలో 26 కిలోమీటర్ల చుట్టుకొలతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో తొగుట మండలంలోని వేముఘాట్, తురుక బంజరుపల్లి, పల్లెపాడు, దస్తగిరి నగర్, పల్లెపాడు తండ, ఏటిగడ్డ కిష్టాపూర్, తిరుమలగిరి, తండ, లక్ష్మాపూర్,రాంపూర్, వడ్డెర కాలనీ, బి–బంజరు పల్లి మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు, ఆరు మధిర గ్రామాలతోపాటు తుక్కాపూర్, తోగుట గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 10వేల ఓటర్లు ఉంటారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. వారందరూ తమకే ఓటు వేస్తారు అంటే తమకే వేస్తారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. (రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?) ఇలా రైతులకు రావల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధిత వివరాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ మొత్తం ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత, 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు భృతి లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని విపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలా దుబ్బాక ఎన్నికలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడువకుండా ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోటీలో 23 మంది దుబ్బాకటౌన్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్క్రూట్నీలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక శాసన సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావు పార్టీకి ఝలక్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు అధికార పార్టీలో చేరారు. సుమారు రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొంత మంది ముఖ్య నేతలు సైతం టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహించనున్నారు.(చదవండి: మీ లింగన్న లాగే అందుబాటులో ఉంటా: సుజాత) ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దుబ్బాక బీజేపీలోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రఘునందన్‌రావుకు టికెట్ కేటాయించడం పట్ల తోట కమలాకర్‌రెడ్డి విమర్శలు చేయగా, పార్టీ ఆయనను బహిష్కరించింది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సందడి ఊపందుకుంది. షెడ్యూల్ వివరాలు నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
దుబ్బాక బీజేపీలో ముసలం
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందర్‌రావును ఖరారు చేయడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది. (దుబ్బాక... మనకు కీలకం ) ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే రఘునందన్‌రావుకే టికెట్ దక్కింది. గతంలో ఆయన దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తెరమీదకు వచ్చింది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) నవంబర్ 3న ఉప ఎన్నిక దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు. నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. (కాంగ్రెస్ గూటికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి) పోటీకి దూరంగా సీపీఐ ఉప ఎన్నికకు సీపీఐ పోటీకి దూరంగా ఉండనుంది. పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాల్లో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయన్నారు. రెండ్రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. షెడ్యూల్ వివరాలు.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు
సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక దశ-దిశను మార్చిన గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రామలింగారెడ్డి సతీమణి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. (దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం రామలింగారెడ్డి సతీమణిని కలిసి మాతో పాటు ప్రచారానికి తీసుకెళ్లడానికి వచ్చాం' అని తెలిపారు. సోలీపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకొని దుబ్బాకను మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలీపేట సుజాత మాట్లాడుతూ..కేసీఆర్ తనకు కన్నతండ్రి లాంటివారన్నారు. తన భర్త చనిపోతే కేసీఆర్ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. పార్టీ టికెట్ కేటాయించినందుకు కెసిఆర్ , మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. (దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) -
రేపు దుబ్బాకలో ‘పారగమ్యత’ పుస్తకావిష్కరణ
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో 20వ తేదీన ‘పారగమ్యత’ పుస్తకాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీయూడబ్లుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో రాసిన వ్యాసాలను ‘పారగమ్యత’ అనే పేరుతో పుస్తకంగా అచ్చువేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం దుబ్బాక పట్టణంలోని నీలకంఠ పంక్షన్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంట చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, వడితల సతీష్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సెన్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో పాటు పలు ప్రముఖ దినపత్రికల ఎడిటర్లు, పత్రికా ప్రతినిధులు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా కో ఆర్డినేటర్ వర్ధెల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ సీఎం పీఆర్వో రమేశ్ హజారితో పాటు పలువురు మేధావులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు, మేధావులు, ఉద్యమకారులు, సాహితి అభిమానులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముందుగా మెదక్ జిల్లా చేగుంటలో అనుకున్నారని కొన్ని కారణాల వల్ల ఈ వేదికను దుబ్బాకకు మార్చినట్లు తెలిపారు. -
రామలింగారెడ్డి భార్యకే దుబ్బాక టికెట్?
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. టికెట్ కేటాయింపునకు సంబంధించి పార్టీ అధిష్టానం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ను సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంతో పాటు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆశిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ నాయకులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడు సతీష్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య సుజాత కోరుతున్నా, పార్టీ నాయకులు మాత్రం సుజాత అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ సోకడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు కోలుకుని సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. క్వారంటైన్ సమయంలో ఫోన్ ద్వారా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను సమన్వయం చేసిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. -
సోలిపేట సతీమణి అభ్యర్థిత్వం ఖరారు!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలవనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ దళ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దీనిని సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాత పేరు ఏకగ్రీవం కావడంతో దుబ్బాక, సిద్ధిపేటలో సోలిపేట కుటుంబ అనుచర వర్గం సంబరాలు చేసుకుంటోంది. (చదవండి: దుబ్బాకపై టీఆర్ఎస్ కన్ను) మరోవైపు.. టికెట్ ఆశించి భంగపడి. అసంతృప్తితో ఉన్న చెరకు ముత్యరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కుటుంబానికి బాసటగా ఉంటానని, రాజకీయంగా ఆదుకుంటామని కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సందర్భంలోనే, ఆయన అకాల మృతి నేపథ్యంలో సోలిపేట కుటుంబానికి కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇరువురు నేతల తనయులు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించగా.. చివరికి సోలిపేట సతీమణి సుజాతకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.(చదవండి: ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!) -
జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన) దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు. -
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా
సాక్షి, సిద్దిపేట: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో రామలింగారెడ్డి భార్య, కుమారుడు, ఇద్దరు పిల్లలకు పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు పాజిటివ్ సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సోలిపేట సేవలు మరువలేనివి: మంత్రి హరీశ్
దుబ్బాకటౌన్: సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు చేసిన సేవలు మరువలేనివని.. సీఎం కేసీఆర్ మెచ్చిన గొప్ప ఎమ్మెల్యే రామలింగన్న అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపసభకు ఆయన హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి కుటుంబీకులకు మంత్రి హరీశ్‌రావు ఆత్మీయ భరోసానిచ్చారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన లింగన్న.. శాసనసభ్యుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విప్లవకారుడిగా, జర్నలిస్టుగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా రాష్ట్రానికి రామలింగారెడ్డి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చేందుకు అందరం కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు..
దుబ్బాకటౌన్ : సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా.. తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నాయకుడిగా దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి గ్రామంలో పోలీస్‌పటేల్. రామలింగారెడ్డి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవారు. టెన్త్ అయ్యాక చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ దోస్తులతో తిరుగుతుండడంతో తండ్రి రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆయనను దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు. 1981లో ఇంటర్లో చేరిన ఆయన.. ప్రగతిశీల విప్లవభావాలతో పీడీఎస్‌యూలో చేరారు. అదే సమయంలో దుబ్బాక జూనియర్ కళాశాలలో రాడికల్ విద్యార్థి సంఘం పురుడుపోసుకోవడంతో అందులో రామలింగారెడ్డి చేరి ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా గెలిచారు. అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయి విప్లవకారుడిగా మార్చింది. ఆర్ఎస్యూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆర్ఎస్యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్ని ఉద్యమంలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. పోలీసు నిర్బంధం పెరగడంతో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత కుటుంబసభ్యుల ఒత్తిడితో బయటకు వచ్చారు. 1985లో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట్లో ఆంధ్రజ్యోతిలో, ఆ తరువాత ‘ఉదయం’లో దుబ్బాక విలేకరిగా పనిచేశారు. అనంతరం ‘వార్త’పత్రిక తరఫున దుబ్బాక, జహీరాబాద్, సిద్దిపేటలో పనిచేశారు. జర్నలిస్టుగా పలు సంచలన కథనాలతో పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే.. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎగశాయి. ఆయనపై పెట్టి న కేసులో సరైన ఆధారాల్లేవంటూ కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుగా ఉన్న సమయంలో కూడా పీపుల్స్‌వార్ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించడంతో చాలాకాలం ఆయనపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. కేసీఆర్ వెన్నంటి ఉంటూ.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డిది కీలకపాత్ర. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఈ క్రమంలో కేసీఆర్ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్ఎస్ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్ కే సులు నమోదయ్యాయి. రామలింగారెడ్డి జీవితకాలమంతా కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యమాలు, పేదలకు సేవచేయడంలో గడిచిపోయింది. పేరు: సోలిపేట రామలింగారెడ్డి తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2 భార్య: సుజాత సంతానం: సతీష్‌రెడ్డి, ఉదయశ్రీ జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక) -
దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత
సాక్షి, సిద్దిపేట : అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కాలిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 2.15 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్దసంఖ్యలో అభిమానులు చిట్టాపూర్ తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కాలిపై కురుపుతో ఆస్పత్రిలో చేరి.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలంగా కుడికాలుపై కురుపుతో బాధపడుతున్నారు. అది కాస్తా పెద్దదవడంతో జూలై 22న చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు కాలికి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇన్ఫెక్షన్ అయి.. శరీరమంతా వ్యాపించింది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు, మెదడుకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో రామలింగారెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. సోలిపేట ఆరోగ్య విషయమై డాక్టర్లతో సంప్రదించారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అప్పటికే మూత్రపిండాలు, కాలేయం పనిచేయకపోవడంతో పది రోజులు మృత్యువుతో పోరాడిన సోలిపేట బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో గురువారం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఉదయాన్నే చిట్టాపూర్‌కు తరలించారు. సొంతింటి వద్ద పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై అంత్యక్రియల ఏర్పాట్లను చూశారు. స్వయంగా పాడె మోసి రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సోలిపేట భౌతికకాయాన్ని ఉంచి చిట్టాపూర్‌లోని కూడవెల్లి వాగు ఒడ్డున ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ కుమారుడు సతీష్ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. కంటతడి పెట్టిన కేసీఆర్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి వార్త వినగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో సోలిపేట చికిత్స పొం దుతుండగానే పలుమార్లు ఆరోగ్య పరిస్థితి పై సీఎం ఆరాతీశారు. సోలిపేట మరణ వార్త తెలియగానే ప్రగతి భవన్ నుంచి హుటాహుటిన చిట్టాపూర్ చేరుకున్నారు. రామలింగారెడ్డి పార్థివదేహంపై పూలమాల ఉంచి నివా ళి అర్పించారు. కన్నీటి పర్యంతమవుతూ.. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటా నని ధైర్యం చెప్పారు. ఉద్యమకాలం నుంచి సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపు అక్కడే విషణ్ణవదనంతో కూర్చుండిపోయా రు. రామలింగారెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొం దిన తీరును, ఆయన మరణానికి కారణాల ను మంత్రి హరీశ్‌రావును అడిగి తెలుసుకు న్నారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని హరీశ్‌రావుకు చెప్పి వెళ్లిపోయారు. ప్రముఖుల నివాళి.. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చిట్టాపూర్‌కు చేరుకున్నారు. సోలిపేట పార్థివదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతిరాథోడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగు రామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరై నివాళులర్పించారు. తీరని లోటు.. గవర్నర్, సీఎం సహా పలువురి నివాళి దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా సోలిపేట అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ అన్నారు. సోలి పేట మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దిగ్భ్రాంతి రామలింగారెడ్డి మృతి పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్ర మార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన సేవలు మరువలేనివి: బండి సంజయ్ సోలిపేట అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా సిద్దిపేటకు తీరని లోటని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
ముగిసిన రామలింగారెడ్డి అంత్యక్రియలు
సాక్షి, మెదక్: దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ యాత్ర ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, బాల్క సుమన్, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్ ఒక్కసారిగా మూగబోయింది. కన్నీళ్లతోనే ఆయనను ఆఖరుసారి చూసేందుకు అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం) -
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
-
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంతరం రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి పట్ల కేసీఆర్ సంతాపం) బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన రామలింగారెడ్డి అంత్యక్రియలను మరికాసేపట్లో చిట్టాపూర్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననుండటంతో సిద్దిపేట పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 1982 నుంచి ఉదయం, వార్త పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు, TUWJ రాష్ట్ర ప్రతినిధులు విరహథ్ అలీ ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సందర్శించారు. తమ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉందంటూ వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత) -
దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. సోలిపేట రామలింగరెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు’ అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు. ‘దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరు. వారు జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు’ అంటూ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. ‘దుబ్బాక శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్న..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడు’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు,ఎమ్మెల్యే, శాసనసభ అంచనాలు,పద్దుల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.వారు ప్రజా జీవితంలో చేసిన సేవలు మరువ లేనివి.సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడు. జర్నలిస్టుగా,ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించారు.రామలింగారెడ్డి లేరనేది ప్రజలకు తీరని లోటు.వారి మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సానుభూతి ప్రకటించారు. -
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. ఆయన మరణ వార్త జిల్లా, నియోజకవర్గ ప్రజలను విచారంలో ముంచింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మృతిపట్ల టీఆర్ఎస్ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి. రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు రామ లింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్ నాయకుడిగా రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్ ఉద్యమంలోనూ పాల్గొని కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతదేహాన్ని ఆయన స్వస్థలం చిట్టాపూర్‌కు తరలించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆత్మీయులు, రాజకీయ నాయకులు, అభిమానులు.. చిట్టాపూర్‌కు చేరుకుంటున్నారు. రామలింగారెడ్డి అకాల మరణంతో చిట్టాపూర్ శోక సంద్రంగా మారింది. -
ఆస్పత్రిలో దుబ్బాక ఎమ్మెల్యే
దుబ్బాకటౌన్: అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని బుధవారం మంత్రి టి.హరీశ్‌రావు పరామర్శించారు. రామలింగారెడ్డికి కిడ్నీ సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం మూడు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కాగా, రామలింగారెడ్డి ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడిందని ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి వర్గాలతో ఫోన్లో ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని అడిగినట్లు సమాచారం. మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే మంత్రి కేటీఆర్ సైతం ఆస్పత్రి వర్గాలతో మాట్లాడినట్లు తెలిసింది. -
జీవించే హక్కు వీరికి లేదా?
సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది. ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి. పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు. ప్రపంచాన్ని కోవిడ్–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్డౌన్ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్ అభ్యర్థన పట్ల అభ్యం తరం చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. 25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేశారు. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు. రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
కరోనాపై మన యుద్ధం గెరిల్లా పంథాలోనే
‘తెప్పలుగ చెరువు నిండినప్పుడు ఊరి గొప్పలు పదివేలు గదరా సుమతీ..! ఊరి పటేండ్ల మూతి మీసం మిడిసి పడుతది. గౌడ్లోళ్లు కాటమయ్య పండుగ చేస్తరు . బైండ్లోళ్ళ కథలుంటయ్.. చిందోళ్ళ పాటలు ఉంటాయ్. పీర్లు దుంకులాడుతాయి.. సబ్బండ జాతులు దూలాడుతాయి’ అని సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి ముందుమాటలో చెప్పారు. ఆ కూర్పులో నా బాల్యం ఉంది. కట్టకింది పంట పొలాన్ని చూస్తూ కట్ట మీద నిలబడి మీసం మెలేసిన మా నాయిన జ్ఞాపకాల దొంతర ఉంది. బెస్తోళ్ళ వలకు చిక్కిన తొలి కొర్రమట్ట బాపు పటేల్ గిరి మెప్పు కింద పులుసు అయిన యాది ఉంది. ప్రకృతి గమనంలో బాపు కాలం చేశారు. ఆయనతో పాటే చెరువూ ఎండి పోయింది. వాగులు, వంకలు, వర్రెలు జ్ఞాపకాలు అయ్యాయి. ఇక ఆ విషాదం ఓ గతం. చెదిరిపోయిన జ్ఞాపకం. కృష్ణా, గోదావరి నదులు నడకలు నేర్చి తెలంగాణ బీడు భూముల మీద నడయాడుతున్నాయి. అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్ పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా పూర్తయి చెరువులను నింపుతున్నాయి. బీడు భూములను మాగాణీగా మారుస్తున్నాయి. తెలంగాణ వైతాళికుడు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఒకవైపు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోవైపు గ్రామ దేవతలై గ్రామాలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లె ఇప్పుడు పేద తల్లి కాదు. కరువు, కల్లోలాల నుంచి బయటపడిన అన్నపూర్ణ. కరోనా విష పురుగులు ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ పల్లె తల్లి కలవరపడుతోంది. కన్న బిడ్డలను రమ్మంటోంది. కడుపులో పెట్టుకొని సాకుతానని భరోసాను ఇస్తోంది. కానీ మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవి ష్యత్తు కోసం, యావత్ మానవ జాతి మనుగడ కోసం కనిపించని శత్రువుపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఈ మహమ్మారితో యుద్ధం అంటే స్వీయ గృహనిర్బంధమే. అమ్మ రమ్మని పిలిచినా వెళ్లకుండా మనలను మనం నియంత్రించుకోవలసిన సమయం ఇది. కాలం అనుకూలంగా లేని ఈ సమయంలో గెరిల్లా పంథానే మన ముందున్న మార్గం. కలసిరాని ఈ కాలంలో రెండడుగులు వెనక్కి వేసి మన సమయం వచ్చేంతవరకు పరిసరాలను గమనిస్తూ ఉండటం ఎంతో ముఖ్యం. మనం ఇప్పుడు పల్లెకి పోతే పచ్చగా ఉన్న పల్లె కూడా కరోనా రాకాసి కోరలకు చిక్కి వల్ల కాడై పోతుంది. ఈ విపత్తును ఆపటానికి సీఎం బరువెక్కిన హృదయంతో ఇరవై ఒక్క రోజులు కర్ఫ్యూ పెట్టారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉందాం. ఇది తాత్కాలికమే. ఇదిలా ఉంటే.. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ సీజ న్లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లం పల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. రెండు బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోశారు. మిడ్‌మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న 681 చెరువులు నింపారు. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలు. ఈ యాసంగిలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ‘పిట్ట వాలిన చెట్టు’ పుస్తకానికి అవసరమైన సమాచారం కోసం రచయిత వెంకన్నతో కలిసి పాలమూరు జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి పారిన కాల్వలను, పచ్చబడిన పంట పొలాలు, బాగుపడిన బతుకులను కళ్ళ నిండా చూశాను. పుస్తకావిష్కరణ కోసం వెంకన్న సొంత ఊరు కర్విరాల కొత్తగూడెం వెళ్ళినప్పుడు సూర్యాపేట జిల్లాలో మత్తడి దుంకుతున్న చెరువులను, అలుగుళ్ళ ఎదురెక్కుతున్న చేపజాతులను చూశాను. ఎక్కడి కాళేశ్వరం... ఎక్కడున్న కర్విరాల కొత్తగూడెం. ఆ ప్రజలు కల్లో కూడా ఊహించని పరిణామం. తుంగతుర్తి దాటిన తరువాత కర్విరాల పల్లె పొలిమేర నుంచి జలజల జారిపోతున్న పిల్ల కాల్వల్ల నీళ్ళు చూస్తుంటే...! నా నియోజకవర్గం దుబ్బాక మదిలో మెది లింది. జవగళ్ళ భూములున్నా.. నీళ్ళు లేక బిక్కటిల్లిన నేల నాది. మల్లన్న సాగర్ తో బతుకు చిత్రం మారబోతదని భూములు త్యాగం చేశారు. ఆ కల ఈడేరబోతోంది. కాళేశ్వరం నీళ్ళు దుంకులాడుకుంటు వస్తున్నాయి. అనంతగిరి– అన్నపూర్ణమ్మ నిండింది. ఇక అక్కడి నుంచి రంగనాయక్ సాగర్ కు నీళ్ళు ఉరుకులాడుతున్నయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపులు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌ను నింపేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరుతాయి. కనీసంగా 240 కిలోమీటర్ల దూరం గోదావరి తరలి రానుంది. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నిండుతాయి. ఈ మహా క్రతువుల్లో సీఎం మహా సంకల్పం అనిర్వచనీయమైనది, మంత్రి హరీశ్ రావు పట్టుదల గొప్పది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శ్రమను అభినందించకుండా ఉండలేము. మల్లన్న సాగర్ నిండితే దుబ్బాక ప్రాంతంలో వ్యవసాయం మాత్రమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. నేల స్వభావం, పంట దిగుబడులపై అధ్యయనం చేసి సంబంధిత పంట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నేను ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాను. దానికి ఆయన స్పందిస్తూ స్పష్టమైన హామీ ఇవ్వటం నా నియోజకవర్గం ప్రజల అదృష్టం. భవిష్యత్తు కోసం పల్లె అన్ని విధాలుగా రూపుదిద్దుకుంటుంది. 21 రోజులు మాత్రమే కాదు 6 నెలల విపత్తు వచ్చినా మూడు పూటల బువ్వ పెట్టి ఆశ్రయం ఇచ్చే దిశగా పల్లె ఎదుగుతోంది. అయితే దాన్ని అనుభవించేందుకు భవిష్యత్తులో మనం ఉండాలి. మనం ఈ కష్టకాలం నిబ్బరంతో ఎదుర్కొందాం. ఉన్న ఊర్లో వైపు ఆలోచన చేయకుండా ఈ 21 రోజులు ఎక్కడికక్కడ స్వీయ నిర్బంధంలో ఉందాం. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94413 80141 -
కమతంపై పోలీసు పెత్తనం
అది 20వ శతాబ్దం... 1941 జూన్ 17, సూర్యాపేట – జనగామ రోడ్డు. మాసిన షేర్వానీ, చిరిగిన అడ్డ పంచ నడుముకు చుట్టి ఓ బక్కపలచని ఫకీరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కండలు తిరిగిన గూండా ఒకడు కొడవలితో ఫకీరు మెడ మీద వేటు వేశాడు. ఇంకోడు కత్తితో పొడిచాడు. చనిపోయిన ఆ ఫకీరు షేక్ బందగి అయితే... చంపిన వారు విస్నూర్ దేశముఖ్ గూండాలు. షేక్ బందగికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని విస్నూరు దేశముఖ్ బంటు దౌర్జన్యంగా మలుపు కున్నాడు. బందగీ అడ్డం తిరుగుతాడు. తగాదా తుదకు కోర్టుకెక్కింది. కార్వాయి నడిచి నడిచి బందగి వైపే ఫైసలా అయింది. బక్క రైతుకు భూమి దక్కటాన్ని జీర్ణించుకోలేని దేశముఖ్ బందగీని హత్య చేయించాడు. పారిన ఫకీరు నెత్తురు తెలంగాణ సాయుధ పోరాటానికి , ఇక్కడి భూ పోరాటాలకు జీవధార అయింది. 21వ శతాబ్దం.. 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ జననేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అడగకుండానే కమ్యూనిస్టులను మించిన ఎజెండాను రూపొందించి అమలు చేశారు. 70 ఏళ్లుగా లొసుగులతో సాగిన భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఎవరి హద్దులు వాళ్లకు చూపించి బీద, బిక్కీ, బడుగు, బక్క రైతుల భూములకు ఎవరికి వారివి పక్కాగా పట్టా చేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.55 కోట్ల వ్యవసాయ భూమి ఉండగా వివాదరహితంగా ఉన్న 2.38 కోట్ల ఎకరాల భూమికి పక్కాగా పాసుబుక్కులు తయారు చేసి ఇచ్చారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరణ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కాళేశ్వరం, సీతారామ సాగర్ ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ కృష్ణా, గోదావరి జలాలను కాలువలకు మళ్లించి చెరువులను నింపారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలకు చేయూతనిచ్చి సాగును గాడిలో పెట్టేందుకు ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేశారు. దీంతో చిగురించిన చెట్టు మీదికి పిట్టలు వచ్చి వాలినట్లుగా వలసపోయిన జనాలు తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. కొత్త ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కమతం మీదికి సాగుకు వచ్చిన సన్న, చిన్నకారు రైతులకు అక్కడక్కడ మళ్లీ బందగీ అనుభవాలే ఎదురవుతున్నాయి. బడా పెట్టుబడిదారుల వైపు నిలబడిన పోలీసులు, లేని సమస్యలను ఉత్పన్నం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. వందలాది ఎకరాలను కొనుగోలు చేసి భూముల చుట్టూ పెన్సింగ్ వేసి ఏక ఖండిక కమతాలుగా మార్చుకున్న పెట్టుబడిదారులు మధ్యలో ఉన్న వలస కూలీలకు చెందిన ఎకరం, అర ఎకరం భూములను అక్రమంగా కలిపేసుకున్నారు. సొంత భూములలో సాగు చేసుకునేందుకు తిరిగి వచ్చిన వలస కూలీలు లబోదిబోమంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి పట్టా దారి హక్కు పుస్తకాలు సంపాదించుకుని వస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని గెట్టుకు అడ్డంగా, కబ్జాదారులకు అండగ నిలబడుతున్నారు. కబ్జా మీద ఎవరు ఉంటే వారిదే భూమి అనే చట్టవిరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారు. పట్టాదారుల మీద ఆక్రమణ కేసులు బనాయిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటుగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ సమస్యలు విపరీతంగా ఉత్పన్నమవుతున్నాయి. బాధితుల అభ్యర్థన మేరకు నా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే ‘రెవెన్యూ రికార్డులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూమి ఎవరి అధీనములో ఉందో వారే హక్కుదారులు. భూమి మీదికి వెళ్ళినవారు ఆక్రమణదారులు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెడతాం’ అన్నారు. డీజీపీ ఆదేశాలమేరకే నడుచుకుంటున్నామని మరో సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానంతో అవాక్కయ్యాను. పట్టా రైతుకు అన్యాయం జరుగొద్దనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే గతంలోలాగే మళ్లీ ప్రజల్లో అశాంతి రగిలే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్, మొబైల్ 9440380141 -
చెద పట్టిన నిప్పు
అవకాశం దొరికినప్పుడల్లా తాను నిప్పులాంటి మనిషినని తరచు చెప్పుకునే చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుని చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సొంత అల్లుడు కదా అని కర్షక పరిషత్ బాధ్యతలు అప్పగించిననాటినుంచీ ఈ అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. అందుకు చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రకటించిన ఆస్తులే సాక్ష్యంగా నిలుస్తాయి. ఏడాదికి రూ. 36,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఆయన తొలిసారి చెప్పగా, ఆయన, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు 2019నాటికి రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి 2005లో ఈ ఆస్తుల వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసిన కేసు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ‘ధర్మనందనా! రాజు అబద్ధం ఆడకూడదు.. ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ప్రయోజకమైన విష యాలు తప్ప స్వప్రయో జక ఆలోచనలు చేయ కూడదు. బంధుప్రీతి ఉండకూడదు. రాగ ద్వేష రహితంగా పాలన సాగించటం రాజధర్మం’. ధర్మరాజుకు మయుడు కట్టి ఇచ్చిన అందమైన రాజ భవనం మయసభ లోకి తొలిసారి పాదం మోపిన నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన మాటలివి. ధర్మరాజు ఆ మాటల్ని శ్రద్ధగా ఆలకించి, ‘మహర్షీ! నా య«థాశ క్తిని అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను’ అని చెప్తాడు. రాజసూయ యాగం ముందు నారదుడు ధర్మరాజుకు రాజధర్మం బోధించిన సందర్భం ఇది. నాకు ఓటు హక్కు వచ్చే నాటికి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారు. ఓటేశాను. ఆయనలో రాజును చూస్తాను అనుకున్నా. కానీ రీలు చిత్రం, రియల్ చిత్తం ఎప్పటికీ ఒక్కటి కాదుగా..! ఎన్టీఆర్ బంధుప్రీతి, రాగద్వేషాలకు తలొగ్గారు. ఒక తరం రాజకీయ అవినీతికి బీజాలు వేశారు. 1988లో కర్షక పరిషత్‌ను ఏర్పాటు చేసి దాని పీఠం మీద సొంత అల్లుడు చంద్రబాబును కూర్చోబెట్టారు. అప్పటినుంచి అబద్దం, అధర్మం, అవినీతి, అన్యా యం, రాజ్యాంగబద్దం అయ్యాయి. రాజంటేనే అవినీతికి కంకణబద్ధుడు అనే పేరువచ్చింది. చంద్రబాబుకు తొలి పదవి కర్షక పరిషత్ చైర్మన్‌గా నియామకమే నిబంధనా విరుద్ధం. దీన్నే రైతు సంఘం నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి హెకోర్టులో సవాల్ చేశారు. దీనికి జవాబుగా చంద్రబాబు స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో తన ఆస్తుల్ని వివరిస్తూ.. ‘నేను సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 మార్చి నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుం బానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాం. ఆ తరవాత నేను స్వయంగా వ్యవసాయం చేయించాను. ఏడాదికి రూ. 36 వేలు ఆర్జించాను’ అని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఏమార్చటానికి ప్రయత్నించారు. నిజానికి చంద్రబాబు 2.5 ఎకరాల ఆసామి. వ్యవసాయమే చేయడం రాదు. ఆయనెప్పుడూ వ్యవసాయం చేయలేదు. ఈ అఫిడవిట్ ఇచ్చిన ఆరేళ్లకు అంటే 1992లో రూ.76 లక్షల భారీ పెట్టు బడితో హెరిటేజ్ ఫుడ్స్‌ను పెట్టాడు. స్వయంగా వ్యవ సాయం చేస్తూ ఏడాదికి రూ.36వేలు ఆర్జిం చిన బాబు ఆరేళ్లలో రూ 76 లక్షలు ఎలా ఆర్జించార న్నది బేతాళునికి కూడా అంతుచిక్కని సమాధానం. 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన బాబు 1999లో నాటి స్పీకరు ఎదుట తన ఆస్తులు ప్రకటించారు. తమ కుటుంబానికి రూ.7.79 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు. 2004 నాటికి రూ.20 కోట్లకు, 2009 నాటికి రూ.60 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడ విట్‌లో పేర్కొన్నారు. 2019 నాటికి ఈ ఆస్తులు రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఇందులో బాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు. ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు రూ. 648.13 కోట్లు. లోకేశ్‌కు రూ.320.45 కోట్లు. ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.33.15 కోట్లు, కుమారుడు దేవాన్‡్ష మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. చాక్లెట్ చేతికి ఇస్తే కింద పడకుండ తినలేని పసి వయసులో దేవాన్ష్ రూ. 20 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో బాబుగా రికే తెలియాలి. చంద్రబాబు అక్రమ ఆస్తుల గుట్టు మొట్ట మొదట బయట పెట్టింది ఆయన అత్తగారు నంద మూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదా యానికి మించిన ఆస్తులు సంపాదించారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని 2005లో లక్ష్మీ పార్వతి తొలిసారి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరుగకుండా చంద్ర బాబు స్టే తెచ్చుకున్నారు. అది మొదలు మద్యం ముడుపుల కేసు, ఏలేరు కుంభకోణం, ఐఎంజీ భారత్ కేసు, హెరిటేజ్ ఫుడ్స్‌లో మోహన్‌బాబుతో వివాదం, ముఖ్యమంత్రిగా హెరిటేజ్ ఫుడ్స్‌కు రాయితీలు ఇచ్చిన కేసు, అవినీతి మీద పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వేసిన కేసు ఇలా మొత్తం 17 కేసుల్లో విచారణ జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చు కున్నారు. ఆ స్టేలను మెరుగుపరిచి తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్థికబలం, అధికార బలంతో చంద్రబాబు వ్యవస్థలను ఏమార్చారు. ఇందుకు కోర్టులు కూడా మినహాయింపు కాదు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భార్య విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పుడు హైకోర్టు ధర్మాసనం చంద్రబాబు ఆస్తులపై సీబీఐ, ఈడీల ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మురళీమోహన్, సీఎం రమేష్ తదితరులు హైకోర్టు ఆదేశాలను నిలిపి వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచిం చింది. తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి స్టే ఉత్తర్వులతో ఆగిపోయింది. ఈ కేసు విచారణ పేరుతో ఎనిమిది బెంచ్‌లు మార్చ డంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా బెంచ్‌లు మార్చడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరి స్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది.ఈ కేసు సంగతి అలా ఉంచితే 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాతనైనా చంద్రబాబు అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి పెట్టిన కేసు విచా రణకు ఏసీబీ కోర్టు సిద్ధం కావటం ఆహ్వానించదగిన పరిణామం. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుంది. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్ మొబైల్ : 94403 80141