కేంద్రం దాష్టీకం ఇంకానా? | Solipeta Rama Linga Reddy write article on Central Government | Sakshi
Sakshi News home page

కేంద్రం దాష్టీకం ఇంకానా?

Published Thu, Mar 29 2018 12:47 AM | Last Updated on Mon, Oct 22 2018 8:47 PM

Solipeta Rama Linga Reddy write article on Central Government - Sakshi

సందర్భం

ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎన్నో అంశాలు, విధానాలు ఇన్నాళ్లూ సువిశాల భారతావనిలో స్వైరవిహారం చేశాయి. అధికారాల వికేంద్రీకరణపై కేసీఆర్‌ భావన దేశంలోని పలురాష్టాలకు స్ఫూర్తినిస్తోంది.

భారత ప్రజలది వైవిధ్యభరిత జీవన విధానం. అనువంశి కంగా అబ్బిన అద్భుతమైన సామాజిక నైపుణ్యాలే భరత మాతకు మణిహారాలు... ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృతులు, ఆచారాలు, అవ సరాలు ఉంటాయి. ఈ దేశం బయటివారి దండయా త్రలు, అంతర్యుద్ధాలు,  శతాబ్దాల ఏలుబడిలో రాజులు, రాజ్యాలు, సామంత రాజులతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తమ తమ భాషలు, యాసలు,  సాహిత్య సౌర భాలతో సంపూర్ణం అయ్యాయి. 

ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృ తుల మధ్య  అంతరాలే కాకుండా, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య వైవిధ్యం ఉంటుంది. అనేక వైవిధ్యాలు, అంతకుమించిన వైరుధ్యాలు, అవస రాలు ఉన్న భారతావనిని గుడ్డెద్దు చేలో పడ్డట్టు  కేంద్రీ కరణ సిద్ధాంతంతో ఒకే పంథాలో పాలించాలనుకో వటం పౌరుల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. 70 ఏళ్ల ఏలుబడిలో జాతీయ పార్టీలు ఢిల్లీ అధికా రాలను  గుప్పిట్లో పెట్టుకున్నాయి.  మన పిల్లలు లక్షల్లో అమెరికాకు, బయటి దేశాలకు వలస పోతున్నారు. మౌలిక వసతులు, యువశక్తి  మన కంటే తక్కువగా ఉన్న అమెరికా శరవేగంగాæఅభివృద్ధి చెందటానికి కార ణం ఏమిటీ? అక్కడి రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఉంటుంది. 

ఎవరి జీడీపీ వాళ్లకు ఉంటుంది. అమెరికా తరహాలోనే మన దగ్గర కూడా ఢిల్లీ పీఠం నుంచి రాష్ట్రాలకు రాజకీయ అధికార  వికేంద్రీకరణ జరగాలి. అమెరికాను యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అన్నట్టు  భారతదేశాన్ని  యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తించాలనేదే కేసీఆర్‌ ఆలో చన. వికేంద్రీకరణ జరగాలంటే ఈ జాతీయ పార్టీలు చేయవు. వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు అఖండ మెజార్టీ సంపాదించి, వారిలోవారు సయోధ్య సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగాన్ని ఫెడరల్‌ సిస్టంలోకి మార్చాలి. రాష్ట్రాలకు తగినంత స్వాతంత్య్రాన్ని కల్పించాలి. పర స్పర పోటీలతో రాష్ట్రాలు తమతమ వనరులు పూర్తిగా ఉపయోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలి.

పాలనాపరమైన  కీలక అధికారాలన్నీ  ఢిల్లీ చేతిలో కేంద్రీకృతం కావటం వలన రాష్ట్రాల్లో అభివృద్ధి జరగటం లేదని ప్రధాని మోదీకి కూడా తెలుసు. 2014 ఎన్నికల్లో  మోదీ గుజరాత్‌ అభివృద్ధిని ఉదాహరణగా చూపిస్తూ  రాష్ట్రాలకు విస్తృతమైన అధికారాలు ఉండాలని చెప్తూ ఓట్లు అడిగారు. తీరా గద్దె మీద కూర్చున్న తరువాత రాష్ట్రాలకు అధికారాలను అందిస్తే తమ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందోననే భయంతో ప్రజలను మభ్యపెడుతు న్నారు. స్థానిక వనరుల వెలికితీత, వినియోగాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుంది. సైన్యం, దేశ రక్షణ, అంతర్జా తీయ వ్యవహారాలు, కరెన్సీ, జాతీయ రహదారులు తదితర జాతీయ విధానాలు కేంద్రం అధీనంలోనే ఉండాలి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, తాగు, సాగునీరు... తదితర అంశాలతో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసుకునే అధికారాన్ని పూర్తిస్థా యిలో రాష్ట్రాలకు అప్పగించాలి. 85 శాతం దళిత గిరిజనులు, ముస్లిం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న తెలం గాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని చెప్పటం ఎలా న్యాయం అవు తుంది? 

ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఎన్నో అంశాలు, విధానాలు ఇన్నాళ్లూ సువిశాల భారతావనిలో స్వైరవిహారం చేశాయి. ఇన్నాళ్లకు కేసీఆర్‌ ఫెడరల్‌ పేరుతో మౌలిక మార్పుకు ప్రయత్నాలను ప్రారంభిం చారు. దేశంలోని పలు రాష్ట్రాల అవసరాలు కూడా దీనికి ఆసరా కాబోతున్నాయి. ఏపీ పునర్‌ విభజన చట్టం మేరకు ఆ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ అధినేత పట్టుబడుతున్నారు. ఏకంగా మోదీ ప్రభు త్వంపై అవిశ్వాసం పెట్టారు. ప్యాకేజీ అంటూ పాట పాడిన ఆంధ్ర సీఎం బాబు కూడా వైఎస్‌ జగన్‌ని అను సరించాల్సి వస్తోంది. కావేరీ జలాల పంపిణీ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనందుకు తమిళనాడు కేంద్రం మీద మండిపడుతున్నది. కలకత్తా మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు నిధులు సహా, పశ్చిమ బెంగాల్‌కు ఇవ్వవలసిన చాలా నిధులను కేంద్రం విడుదల చేయ డం లేదని ఆ రాష్ట్ర నాయకత్వం ఆరోపణ.. ఇలా..  ఏ రాష్ట్రం  వ్యథలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. 

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పుడు తామే  ప్రత్యా మ్నాయమని ఎవరైతే ప్రజలను మెప్పించగలరో వారే విజేతలు. 1967 నుంచి 2014 వరకు వెలువడిన ఎన్ని కల ఫలితాలు ఈ అంశాన్నే చెప్తున్నాయి. అవకాశ వాద రాజకీయాలకంటే ప్రత్యామ్నాయ రాజకీయాలకే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. కొద్ది మంది వ్యక్తులైనా నిఖార్సైన ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యవంతం చేయగలిగితే  అవకాశవాద జాతీయ పార్టీ లను మట్టి కరిపించటం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో ఒంటి చేత్తో తెలంగాణ సాధించి, సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ సాధించిన ఘన విజయం ఒక తిరుగులేని ఉదా హరణ. పట్టుదల, నిరంతర శ్రమ, నిజాయితీతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తే అది గుజరాత్‌ అయినా, తెలంగాణ అయినా ప్రజలు తప్పక ఆదరిస్తారు.

- సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే 
మొబైల్‌ : 94403 80141

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement