అక్రమ రవాణాపైనా రాజకీయ దురుద్దేశాలేనా? | Solipeta Ramalinga Reddy Article On Human Trafficking | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 1:56 AM | Last Updated on Wed, Sep 19 2018 1:56 AM

Solipeta Ramalinga Reddy Article On Human Trafficking - Sakshi

జగ్గారెడ్డి అరెస్టు (పాత చిత్రం)

అవి 2006 మార్చి మాసం చివరి రోజులు... అప్పట్లో దుబ్బాక  దొమ్మాట నియోజక వర్గం కింద ఉండేది. నేను తొలి సారి దొమ్మాట నుంచే గెలిచాను. పొద్దంతా నియోజకవర్గంలో తిరిగి మా ఇంటి ముందు మామిడి చెట్టు కింద కూలబడ్డా. కార్యకర్తలుంటే వాళ్లతో మాట్లా డుతున్నా. అప్పుడే ఓ మిత్రుడు ఓ అపరిచిత వ్యక్తితో కలిసి వచ్చాడు. అప్పట్లో అతను మా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఓ జాతీయ పార్టీలోకి వెళ్లిపోయాడు. ఆయనను మధుసూదన్‌  రావుగా పరిచయం చేశాడు. నిజామాబాద్‌ జిల్లా అని ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌‘ బ్రోకర్‌ అని చెప్పాడు. సాదా సీదా లేబర్‌ను కాకుండా హైక్లాస్‌ మనుషులను అమెరికా పంపిస్తుంటాడని, గుజరాత్, మహారాష్ట్రల్లో మంచి పేరున్న వ్యక్తిగా చెప్పారు. మా ప్రజలు  నా గురించి ఏమ నుకుంటున్నారు అని ఉత్సాహం కొద్ది అడిగాను. ‘నువ్వు అవినీతిపరునివి అనుకుంటున్నారు’ అని చెప్పారు. ‘ఓర్నీ... నేను ఎమ్మెల్యేను అయ్యాక నియోజకవర్గానికి ఒక రూపాయి అభివృద్ధి పనులు కూడా రాలేదు కదా! అప్పుడే ఎక్కడ అవినీతికి పాల్పడబోయిన’ అన్నాను.

మధుసూదన్‌రావు వ్యాపారానికి నా సహాయం కావాలన్నారు. ప్రశ్నార్థకంగా చూశాను. ‘గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి ఇంగ్లండ్, అమెరికా వెళ్లిపోయిన కొందరు వ్యక్తులు అక్కడి వ్యాపారాల్లో బాగా స్థిరపడిపో యారు. ఇండియాలోని తమ భార్యాపిల్లలను అక్కడికి రప్పించుకుంటున్నారు’’ అని చెప్పారు. వాళ్ల వీసాలకు నా సిఫారసు కావాలన్నారు. ‘ఎమ్మెల్యేలకు ఇటువంటి అధి కారం కూడా ఉందా?’ అని అడిగాను. గుజరాతీలను నా బంధువుల పేరు మీద నా సిఫారసు లెటర్‌తో వీసా ఇప్పించి అమెరికా పంపించాలని కోరారు. జర్నలిస్టుగా మనుషుల అక్రమ రవాణా కేసుల గురించి నేను చది వాను. ‘ఇంతకు ముందు నన్ను మీరు అవినీతిపరుడు అన్నారు.. ఇంతకు మించిన అవినీతి ఇంకేమీ ఉండదు. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను’ తెగేసి చెప్పాను.

మరో ఆరు నెలలకు అనుకుంటా... ఇంకో మిత్రుడు ఎర్రమంజిల్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు విందుకు ఆహ్వా నించారు. అప్పటి సహచర ఎమ్మెల్యే సోయం బాపురావు నాకు కాల్‌ చేసి విందుకు కలిసి వెళ్దాం అన్నారు. ఇద్దరం కలిసే వెళ్లాం. మేం వెళ్లేటప్పటికే అక్కడ కాసిపేట లింగయ్య, మరి కొంతమంది రాజకీయ మిత్రులు ఉన్నారు. భోజనానికి కూర్చున్నాం. ఓ వ్యక్తి నాకు వడ్డిస్తూ ‘ఈ ఎమ్మెల్యే గారు పేదరికంలో ఉన్నట్టున్నారుగా’ అని అన్నాడు. ‘నేను ఎట్టుంటే నీకేంది.. నువ్వు వడ్డించేదో వడ్డించు’ అని కాస్త కటువుగానే అన్నాను.. నన్ను ఆహ్వా నించిన వ్యక్తి కల్పించుకుంటూ.. ‘అన్నా.. ఇతను రషీద్, మనుషులను విదేశాలకు పంపుతారు’ అని పరిచయం చేశారు. పాస్‌పోర్టు కోసం నన్ను సహాయం చేయమని అడిగారు. నన్ను ఒప్పించటానికి జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమ యంలో ఆయన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌ సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన వారిని అమెరికా పంపినట్లు చెప్పారు. నకిలీ డాక్యుమెం ట్లతో వీసాలు పొందిన ముగ్గురినీ జగ్గారెడ్డి తన వెంట అమెరికాకు తీసుకెళ్లారని, వారిని అక్కడ ఉంచి తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారని నన్ను ఒప్పించేందుకు ప్రయ త్నం చేశారు. ఇలా సహకరించినందుకు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ వస్తాయని చెప్పారు.

నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన వ్యక్తిని. నా బ్యాక్‌ గ్రౌండ్‌ జర్న లిజమే. ఏమీ లేకుండానే కేసీఆర్‌ నన్ను పిలిచి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఇచ్చి గెలిపించారు. నేను డబ్బుకోసం ఆశపడి తప్పుడు పనిచేస్తే... భవిష్యత్తులో నాలాంటి దిగువ కుటుంబాల నుంచి వచ్చే యువతను ఎవరూ నమ్మరు. నేను ఆ పని చేయలేను అని చెప్పేసి వచ్చేశాను. అదేరోజు హరీశ్‌రావుకు ఫోన్‌ చేసి జరిగిన సంగతి చెప్పాను. ఇందులో మన ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కున్నా రని చెప్పాను. ఒక మీడియా సంస్థను కలిస్తే వాళ్లు వరు సగా రెండు కథనాలు ప్రచురించారు. ఈలోగా హరీశ్‌ రావు పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ దృష్టికి తీసు కువెళ్లారు. ఆ తరువాత అసలు తతంగం అంతా బయటికి వచ్చింది.

ఇప్పుడు ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌’లో జగ్గారెడ్డి  నిండా ఇరుక్కుపోయారు. ఆయన కుటుంబం పేరుతో అమెరి కాకు వెళ్లిన గుజరాతీయులు 14 ఏళ్లయినా తిరిగి రాక పోవటంతో ‘అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు’ అనుమా నించి హైదరాబాద్‌ సిటీ నార్త్‌ జోన్‌ పోలీసులకు సమా చారం ఇచ్చారు. జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలించారు. అందులో కొడుకు, కూతురు, భార్యపేర్లు ఉన్నా ఫొటోలు మాత్రం వేరేవారివిగా ఉన్న ట్లుగా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ చేశారు. ఇదీ వాస్తవంగా జరిగింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ ఉంది? రాజకీయ దురుద్దేశం ఏముంది? ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. కాంగ్రెస్‌ పార్టీ సాంప్రదాయక ఆరో పణలు పక్కన పెట్టి వాస్తవిక దృక్పథంలో ప్రజల్లోకి రావాలి. అప్పుడే జనం మనలను విశ్వసిస్తారు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తారు.

వ్యాసకర్త సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసనసభ్యులు 94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement