
ప్రాజెక్టుపై చంద్రబాబు కుట్ర: సోలిపేట
మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమానికి ఆంధ్రా నుంచి రూ.2కోట్ల్లు
దుబ్బాక: మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు డబ్బు పంపించారని శాసనసభ అంచనా పద్దుల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం రూ. రెండు కోట్లు వెచ్చించారని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా ముంపు గ్రామాల్లో ఖర్చు చేశారన్నారు. దీనిపై పూర్తి ఆధారాలను తాను శాసనసభలో బయటపెడతానన్నారు.
ముంపు గ్రామాల ప్రజలు శాంతియుతంగా చేస్తున్న నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన దుబ్బాకలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అడ్డుకునేందుకు చంద్రబాబు అన్ని అస్త్ర్రాలు ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణలో తన కోవర్టు రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కుట్రలను అమలుపరుస్తున్నారన్నారు.
డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కబెట్టిన రేవంత్‌కు ఇంకా బుద్ధిరాలేదని రామలింగారెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునే బాధ్యతను బీజేపీ లాబీయింగ్‌తో నాగం జనార్దన్‌రెడ్డికి, మల్లన్న సాగర్‌ను అడ్డుకునే బాధ్యతను చంద్రబాబు రేవంత్‌రెడ్డికి అప్పగించారని ఆరోపించారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని రామలింగారెడ్డి స్పష్టం చేశారు.