‘గరుడ పురాణం’ పాత సినిమానే! | Solipeta Ramalinga Reddy Write Article On Operation Garuda | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 1:29 AM | Last Updated on Fri, Nov 2 2018 1:29 AM

Solipeta Ramalinga Reddy Write Article On Operation Garuda - Sakshi

తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచనలకు ఒడిగట్టారు. జగన్‌ మో హన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని కూడా తన క్షుద్ర రాజకీయ కుట్రలోకి లాగారు. ఇదంతా తెలం గాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకమేనట, కేసీఆర్, కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు సృష్టించాలని, అస్థిర పరచాలని చూశారని అంటూ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కావాలనుకుంటే కొట్లాడి తెచ్చుకునే వాళ్లం. ఇచ్చిన మాటకోసం తల నరుక్కునే మనుషులు మా నేతలు. చంద్రబాబు తరహాలో కుట్రలు చేయటం మాకు చేతకాదు. 

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే  అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లిస్తున్న ‘గరుడ పురాణం’  పాత రోజుల్లోని ‘అంతిమ తీర్పు’ సినిమా  కథ తరహాలో సాగుతోంది. కథానాయకుడే ఒక్కొక్కరిని చంపేస్తూ .. చంపేసిన తీరు తన పత్రికలో కథనంగా రాయటం సినీ ఇతివృత్తం. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్‌ గరుడ’ సాగుతోంది. సినిమా నటుడు శివాజీని తెరపై చూపిస్తూ  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కనుసన్నల్లో   శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసికట్టుగా రూపొందించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ని మించిన హత్యా రాజకీయ చిత్రమిది. ఆయన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఆం్ర«ధా జనం విసిగిపోయారు. అక్రమాలు, అబ ద్ధపు మాటలతోనే గడిపారు.

ఈ  వైఫల్యాలను కప్పిపుచ్చుతూ మళ్లీ జనంలోకి వెళ్లాలి.  దొంగ మాట లతో... మాయల ఫకీరు వేషాలతో జనాన్ని తన వైపు తిప్పుకోవాలి.  ఆ ప్రయత్నంలోంచి  పుట్టిందే  ‘ఆపరేషన్‌ గరుడ’. ఇదో ఫ్రీ ప్లాన్డ్‌ స్కెచ్‌. విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లోనే ఈ పథకానికి బీజాలు పడ్డాయి. గత ఏడాది జనవరిలో  హోదా కోసం అక్కడి యువత  విశాఖ ఆర్కే బీచ్‌లో మౌన దీక్ష చేపట్టింది.  పోలీ సులు 144 సెక్షన్‌ పెట్టి మద్దతుదారులు ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీ, చంద్రబాబు మీద ఐదు ప్రశ్నలు సందిస్తున్నానంటూ జనం దృష్టిని ఆకర్షించారు.

దీనికి ఓ వర్గం మీడియా విçస్తృత ప్రచారం కల్పించింది.  ఏడు నెలల కిందట నుంచి చంద్రబాబు మార్కు రాజకీయ దృశ్య రూపకం తెర మీదకు వచ్చింది. ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని, ముఖ్య రాజకీయ పార్టీ నేతపై ప్రాణాపాయంలేని దాడి చేస్తారని.. అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని దాని పేరే ‘ఆపరేషన్‌ గరుడ’ అంటూ నటుడు శివాజీ జోస్యం చెప్పారు. దీనికి స్వయంగా చంద్రబాబే ఓ వర్గం మీడియాలో పెయిడ్‌ ఆర్టికల్స్‌లాగా విస్తృత ప్రచారం కల్పించి జనంలోకి  వదిలారు.  

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ మీడియా ముందుకు రావటం,  దాడి చేసిన వ్యక్తి కులాన్ని ప్రస్తావిస్తూ,  ఆ వ్యక్తి జగన్‌ అభిమానేనని, ప్రచారం కోసమే అతను హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ప్రకటించటం కట్టు కథలు చెప్పినట్టే అనిపించింది.  అతడి జేబులో 8 పేజీల లేఖ ఉందని (తరువాత ఇది 11 పేజీలకు పెరిగింది) ముందస్తుగానే ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధం.  ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరిగినప్పుడు దర్యాప్తు జరుపకుండానే ఒక ఉన్నతస్థాయి అధికారి చెప్పటం విడ్డూరం. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు హత్య, జగన్‌పై హత్యాయత్నం రెండూ పోలీసు వైఫల్యాలే. నేరాలను పసిగట్టి, సమాచారం అందించే పోలీసు ఇంటెలిజెన్సీ వ్యవస్థను చంద్రబాబు సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అక్కడి సిబ్బందిని  తెలంగాణకు పంపించి తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు అనుకూలమైన నియోజకవర్గాలు ఏవో తేల్చాలని ఆదేశించారు.

అధికారులు అంతా తెలంగాణ ఎన్నికల సర్వే  బిజీలో ఉండటంతోనే  ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ పట్టుతప్పింది. వీటన్నిటికి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మానం, అభిమానం లేవు. నీతి నియమాలు లేవు. ఎన్ని అడ్డదార్లు తొక్కైనా అధికారంలో ఉండాలనేది ఆయన ఫిలాసíఫీ. పిల్లనిచ్చిన పాపానికి సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. అధికారం కోసం త్రాచుపాములా సొంత వాళ్లను తినటానికి కూడా వెనుకాడని తత్వం ఆయనది. ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచన చేసే నీచ మనస్తత్వం ఆయనది. తెలంగాణలో  శాసన సభ్యులను కొనుగోలు చేసి  మా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేసి చట్టానికి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. 

తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి బలిదానాలకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్‌  రాజధాని అమరావతికి పునాది రాళ్లు వేసిన రోజునే  ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ అక్కడికి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా దీవిం చారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మాటిచ్చారు. మాట కోసం తల నరుక్కుంటాడు కానీ చంద్రబాబు తరహా కుట్రలు చేసే మనిషి చంద్రశేఖర రావు కాదు. 

వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక  తాజా మాజీ ఎమ్మెల్యే ‘ 94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement