జగన్‌పై దాడి..అంతా డ్రామా | Chandrababu Comments about Murder Attempt on YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌పై దాడి..అంతా డ్రామా

Published Fri, Oct 26 2018 4:15 AM | Last Updated on Fri, Oct 26 2018 4:15 AM

Chandrababu Comments about Murder Attempt on YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాగా అభివర్ణించారు. దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేయకుండా జగన్‌ వెంటనే హైదరాబాద్‌కు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు గురువారం రాత్రి ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి ఘటన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌పోర్టులో జరిగిందని, అక్కడి భద్రతను సీఐఎస్‌ఎఫ్‌ చూసుకుంటుందని చెప్పారు. సీఐఎస్‌ఎఫ్‌ సాయంత్రం 4.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌లోని ఇంటికెళ్లాక మళ్లీ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. జగన్‌ ఇంటికెళ్లిన తర్వాత వాళ్లంతా (బీజేపీ పెద్దలు) ఆయనతో మాట్లాడి తాము చాలా చేయాలనుకుంటే ఇంటికెళ్లావేమిటని అంటే అప్పుడు ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడని చెప్పారు. జరిగిన దాడిపై రిపోర్టు చేయడంలో ప్రతిపక్ష నేత విఫలమయ్యాడన్నారు.

చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి నేరుగా విశాఖలోని ప్రభుత్వాస్పత్రికి ఎందుకు వెళ్లలేదన్నారు. ఇది మెడికల్, క్రిమినల్‌ కేసు కదా! హైదరాబాద్‌కు ఎలా వెళ్లిపోతారని అన్నారు. అయినా ఒక మనిషి గాయంతో ఉంటే విమాన సిబ్బంది ఎలా పంపించారని ప్రశ్నించారు. డిగ్నిటీ ఉండే నాయకత్వం చేసే పనేనా ఇది అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నన్ను ఇబ్బందులు పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుంది. రాబోయే రోజుల్లో దీనిపై పెనాల్టీలు కూడా పడుతాయి. ఈ దాడి నెపంతో జగన్‌ కోర్టుకెళ్లకుండా మినహాయింపు తీసుకుని ఇష్టానుసారంగా తిరగాలని చూస్తున్నాడు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడిన నాటకమే. తిత్లీ తుపాన్‌పై ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కేటీఆర్‌ ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు సృష్టించాలని, అస్థిరత పరచాలనే చూశారు. వారి ఆటలు నా దగ్గర సాగవు. 

దాడి చేసింది జగన్‌ వీరాభిమాని 
జగన్‌పై దాడి చేసిన వ్యక్తి వైఎస్సార్‌సీపీ వీరాభిమాని అని, అతడి తల్లి, తండ్రి, సోదరుడు అంతా తాము ఆ పార్టీ వాళ్లమేనని చెబుతున్నారు. వాళ్ల ఇంట్లో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫొటోలున్నాయి. జగన్‌కు సానుభూతి రావడం కోసమే ఇదంతా చేసినట్లు నిందితుడు చెప్పాడు. కావాలని చేశారా? ఎవరైనా చేయించారా? అనేవి విచారణలో బయటకు వస్తాయి. దాడి ఘటన జరిగిన వెంటనే గవర్నర్‌ రాష్ట్ర డీజీపీకి ఫోన్‌ చేసి నివేదిక కోరడం ఏమిటి? కేసీఆర్, మంత్రి కేటీఆర్, పవన్‌, బీజేపీ ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ఈ దాడిని ఎలా ఖండిస్తారు? ఇది దారుణం. గవర్నర్‌ డీజీపీతో మాట్లాడడం తప్పు. నేరుగా అధికారులతో మాట్లాడే అధికారం గవర్నర్‌కు లేదు. ఢిల్లీ స్క్రిప్ట్‌ను ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదు.

గవర్నర్‌ అధికారికంగా ప్రభుత్వాన్ని అడగాలి. వీళ్లందరి కంటే ముఖ్యమంత్రిని అయిన నాకే అన్నీ తెలుసు. గవర్నర్‌ డీజీపీని ఎందుకు అడిగారు? ఆయన పరిధి ఏమిటి? ఏదైనా ఉంటే నన్ను అడగాలి. ఇది నా ప్రభుత్వం. గవర్నర్ల వ్యవస్థపై పోరాడినవాడిని. గవర్నర్ల వ్యవస్థపై ఇప్పుడు చర్చ జరగాలి. మీడియా అంతా కళ్లు మూసుకుని పనిచేస్తోంది. ఎన్నో అరాచకాలు జరుగుతుంటే వంత పాడుతారా? వైఎస్సార్‌సీపీ నాయకుడిపై వాళ్ల కార్యకర్త.. కేంద్రం పరిధిలోని ఎయిర్‌పోర్టులో దాడి చేశాడు.కానీ, నెపం టీడీపీపై నెడుతున్నారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని సీఐఎస్‌ఎఫ్‌ అంటోంది. మరి ఎవరికి సంబంధం ఉంటుంది? ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి జరుగుతుందని, దాన్ని సాకుగా చూపి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నారని సినీ నటుడు శివాజీ చెప్పాడు. ఇప్పుడది నిజమనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా జరిగిన ఘటనను పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? కనీసం విచారించమని అయినా చెప్పాలి కదా! 

శివాజీ ముందే చెబుతుంటే.. 
ఆపరేషన్‌ గరుడ పేరుతో ఇవన్నీ జరుగుతాయని శివాజీ ముందే చెబుతున్నప్పుడు అతడిని ఎందుకు విచారించలేదని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం అడగాలని ఎదురు ప్రశ్నించారు. విశాఖపట్నం నుంచి నవ్వుకుంటూ వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో దీనావస్థలో పడుకున్నాడని విమర్శించారు. సీబీఐ దర్యాప్తు వేయాలనుకుంటే వాళ్లే(కేంద్రం) వేసుకోవచ్చని, తనను అడగాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ల(వైఎస్సార్‌సీపీ) మనిషేనని చంద్రబాబు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement