సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని అన్ని పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండిస్తుండగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై అభిమానే దాడి చేశాడంటూ డీజీపీ కనీసం విచారణ కూడా చేయకుండా ముందే ప్రకటించడం, హత్యాయత్నాన్ని ఖండించి నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని ప్రకటించాల్సిన ముఖ్యమంత్రి ఇదంతా నాటకమంటూ మాట్లాడటంలోనే కుట్ర కోణం బట్టబయలవుతోందని పేర్కొంటున్నారు. అనుమానాలను నివృత్తి చేయకుండా అసలు జగన్‌పై హత్యాయత్నమే జరగలేదని, అదంతా నాటకమని, సర్కారును కూల్చేందుకు జరిగిన కుట్ర అని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిన జగన్‌ను నేతలు పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. హత్యాయత్నం వెనుక కుట్ర అంతా సర్కారు పెద్దలదేనని జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోందని ప్రజాస్వామ్యవాదులు విశ్లేషిస్తున్నారు. పలువురు అధికారులు సైతం సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అంటూ సంధిస్తున్న వాటిల్లో ముఖ్యమైనవి ఇవీ...
- అభిమాన నేతపై ఎవరైనా హత్యాయత్నం చేస్తారా? పోనీ సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ చెబుతున్నట్లుగా జగన్‌పై సానుభూతి పెంచేందుకే నిందితుడు శ్రీనివాస్ హత్యాయత్నం చేస్తే ఆ విషయాలు రాసిన లేఖను జేబులో ఎందుకు పెట్టుకుంటారు? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు కనీసం ఈ లాజిక్ కూడా తెలియదా?
- నిందితుడు శ్రీనివాస్ నిజంగానే జగన్ అభిమాని అయితే అతడికి టీడీపీ నేత హర్షవర్దన్ చౌదరి ఎయిర్‌పోర్టులో నిర్వహించే హోటల్‌లో ఉద్యోగం ఎందుకు ఇస్తారు? కేసులు నమోదైన శ్రీనివాస్‌కు టీడీపీ నేతలు పోలీసులతో ఎన్‌ఓసీ ఇప్పించి మరీ ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో ఉద్యోగం ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటి? నిందితుడికి ఉద్యోగం ఇచ్చిన టీడీపీ నాయకుడు హర్షవర్దన్ చౌదరిని ఎందుకు అరెస్టు చేయలేదు..?
- హత్యాయత్నాన్ని ఖండించడాన్ని కూడా తప్పుబట్టిన సీఎం దేశంలో చంద్రబాబు మినహా ఎవరైనా ఉన్నారా?
- 2003 అక్టోబరు 1న అలిపిరిలో నక్సలైట్ల దాడిలో చంద్రబాబు గాయపడినట్లు తెలియగానే దీనికి నిరసనగా అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుపతిలో ధర్నా చేసింది వాస్తవమా? కాదా? ఇలాంటి మానవీయత, హుందాతనం సీఎం చంద్రబాబు ఎందుకు ప్రదర్శించలేదు?
- గాయపడిన వ్యక్తిని కించపరచడం టీడీపీవారి నైజమా?
- ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్నింటినీ గవర్నర్ పేరుమీదే ఇవ్వడం వాస్తవం కాదా? మా డీజీపీతో మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఎలా ప్రశ్నిస్తారు? కలెక్టర్ల ముందు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా మాట్లాడటం తప్పు కాదా? ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కాదా?
- ఆలయాలపై దాడులు జరుపుతారని సీఎం ఎలా చెబుతారు (విజిలెన్స్ చెప్పకపోయినా) చంద్రబాబుకు ఏమైనా భవిష్యత్‌ను చెప్పే అతీంద్రియ శక్తి ఉందా? ఉంటే అలిపిరిలో తనపై జరిగే దాడి గురించి ఎందుకు తెలుసుకోలేదు?
- నిందితుడు శ్రీనివాస్ తొమ్మిది సిమ్‌కార్డులు మార్చినందున అందుకోసం వినియోగించిన ఐడీఫ్రూఫ్‌లు, కాల్ డేటా వివరాలను తక్షణమే సర్కారు బయట పెట్టగలదా?
- హత్యాయత్నం జరగ్గానే నిందితుడు శ్రీనివాస్ దళితుడు, జగన్ అభిమాని అని చెప్పిన డీజీపీ నిందితుడికి ఉద్యోగం ఇచ్చిన క్యాంటీన్ యజమాని కులాన్ని ఎందుకు చెప్పలేదు?
- గతంలోనే ఓ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌కు ఎన్‌వోసీ ఇప్పించిందెవరు? ఇలాంటి అసాంఘిక శక్తికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో టీడీపీ నాయకుడు ఉద్యోగం వెనుక ఉన్న కుట్రను డీజీపీ ఎందుకు ప్రస్తావించలేదు?
- విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించక ముందే జగన్‌పై సానుభూతి పెంచడానికే శ్రీనివాస్ దాడి చేశారని డీజీపీ ప్రకటిస్తే ఇక ‘సిట్’ దీనికి భిన్నంగా రిపోర్టు ఎలా ఇవ్వగలదు? ముఖ్యమంత్రి, డీజీపీ చెప్పిన దానికి భిన్నంగా వారి కింద పనిచేసే అధికారులు నివేదిక ఇస్తారని నమ్మే అమాయకులు ఎవరు?
- ‘ఆపరేషన్ గరుడ’లో శివాజీ చెప్పినట్లుగానే జరుగుతోందని సీఎం అంటున్నప్పుడు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోరు?
- ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళితే తప్పేమిటి? వేరే రాష్ట్రానికి వెళ్లారని జగన్‌ను తప్పుబట్టిన సీఎం ఆయన భార్య, కోడలు, మనవడిని మాత్రం హైదరాబాద్‌లో ఉంచి ప్రభుత్వ సొమ్ముతో భద్రత ఎందుకు కల్పిస్తున్నారు?
- పరిటాల రవి హత్య సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ, చంద్రబాబు డిమాండ్ చేయలేదా? దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కేంద్రానికి లేఖ రాయలేదా? ఇలా చేయడానికి చంద్రబాబుకు భయమెందుకు? హత్నాయత్నం వెనుక పాత్ర బయటపడుతుందని భయమా?
- తుని రైలు దగ్ధం ఘటనకు సంబంధించి ఇది రాయలసీమ రౌడీలు, పులివెందుల గూండాల పని అని ఆరోపణలు చేసిన సర్కారు పెద్దలు గోదావరి జిల్లాల కాపులనే ఎందుకు అరెస్టు చేయించారు?
సర్కారు పెద్దల కనుసన్నల్లోనే అంతా..
Published Sun, Oct 28 2018 5:50 AM | Last Updated on Sun, Oct 28 2018 1:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment