చెద పట్టిన నిప్పు | Solipeta Ramalinga Reddy Writes Article On Chandrababu Cheap Politics | Sakshi
Sakshi News home page

చెద పట్టిన నిప్పు

Published Sun, Dec 1 2019 1:32 AM | Last Updated on Sun, Dec 1 2019 1:32 AM

Solipeta Ramalinga Reddy Writes Article On Chandrababu Cheap Politics - Sakshi

అవకాశం దొరికినప్పుడల్లా తాను నిప్పులాంటి మనిషినని తరచు చెప్పుకునే చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుని చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సొంత అల్లుడు కదా అని కర్షక పరిషత్‌ బాధ్యతలు అప్పగించిననాటినుంచీ ఈ అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. అందుకు చంద్రబాబు వివిధ సందర్భాల్లో ప్రకటించిన ఆస్తులే సాక్ష్యంగా నిలుస్తాయి. ఏడాదికి రూ. 36,000 ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు ఆయన తొలిసారి చెప్పగా, ఆయన, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు 2019నాటికి రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి 2005లో ఈ ఆస్తుల వ్యవహారంపై విచారణ జరపాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసిన కేసు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. 

‘ధర్మనందనా! రాజు  అబద్ధం ఆడకూడదు.. ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ప్రయోజకమైన విష యాలు తప్ప స్వప్రయో జక ఆలోచనలు చేయ కూడదు. బంధుప్రీతి ఉండకూడదు. రాగ ద్వేష రహితంగా పాలన  సాగించటం రాజధర్మం’.  ధర్మరాజుకు మయుడు కట్టి ఇచ్చిన అందమైన రాజ భవనం మయసభ లోకి తొలిసారి పాదం మోపిన నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన మాటలివి. ధర్మరాజు ఆ మాటల్ని శ్రద్ధగా ఆలకించి, ‘మహర్షీ! నా య«థాశ క్తిని అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను’ అని చెప్తాడు. రాజసూయ యాగం ముందు నారదుడు ధర్మరాజుకు రాజధర్మం బోధించిన  సందర్భం ఇది. 

నాకు ఓటు హక్కు వచ్చే నాటికి ఎన్టీఆర్‌  తెలుగు దేశం పార్టీ పెట్టారు. ఓటేశాను. ఆయనలో రాజును చూస్తాను అనుకున్నా. కానీ రీలు చిత్రం, రియల్‌ చిత్తం ఎప్పటికీ ఒక్కటి కాదుగా..! ఎన్టీఆర్‌ బంధుప్రీతి, రాగద్వేషాలకు తలొగ్గారు. ఒక తరం రాజకీయ అవినీతికి బీజాలు వేశారు. 1988లో కర్షక పరిషత్‌ను ఏర్పాటు చేసి దాని పీఠం మీద సొంత అల్లుడు చంద్రబాబును కూర్చోబెట్టారు. అప్పటినుంచి అబద్దం, అధర్మం, అవినీతి, అన్యా యం, రాజ్యాంగబద్దం అయ్యాయి. రాజంటేనే అవినీతికి కంకణబద్ధుడు అనే పేరువచ్చింది. చంద్రబాబుకు తొలి పదవి కర్షక పరిషత్‌ చైర్మన్‌గా నియామకమే నిబంధనా విరుద్ధం. దీన్నే రైతు సంఘం నేత పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి హెకోర్టులో సవాల్‌ చేశారు. దీనికి జవాబుగా చంద్రబాబు స్వయంగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

దానిలో తన ఆస్తుల్ని వివరిస్తూ.. ‘నేను సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 మార్చి నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుం బానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది. 1986లో మేం విడిపోయాం. ఆ తరవాత నేను స్వయంగా  వ్యవసాయం చేయించాను. ఏడాదికి రూ. 36 వేలు ఆర్జించాను’ అని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఏమార్చటానికి  ప్రయత్నించారు. నిజానికి చంద్రబాబు 2.5 ఎకరాల ఆసామి. వ్యవసాయమే చేయడం రాదు. ఆయనెప్పుడూ వ్యవసాయం చేయలేదు. ఈ అఫిడవిట్‌ ఇచ్చిన ఆరేళ్లకు  అంటే 1992లో రూ.76 లక్షల భారీ పెట్టు బడితో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను పెట్టాడు. స్వయంగా వ్యవ సాయం చేస్తూ ఏడాదికి రూ.36వేలు ఆర్జిం చిన బాబు ఆరేళ్లలో రూ 76 లక్షలు ఎలా ఆర్జించార  న్నది బేతాళునికి కూడా అంతుచిక్కని  సమాధానం. 

1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన బాబు 1999లో నాటి స్పీకరు ఎదుట తన ఆస్తులు ప్రకటించారు. తమ కుటుంబానికి రూ.7.79 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు. 2004 నాటికి రూ.20 కోట్లకు, 2009 నాటికి రూ.60 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడ విట్‌లో పేర్కొన్నారు. 2019 నాటికి ఈ ఆస్తులు రూ. 1,034 కోట్లకు ఎగబాకాయి. ఇందులో బాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు. ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు రూ. 648.13 కోట్లు. లోకేశ్‌కు రూ.320.45 కోట్లు. ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.33.15 కోట్లు, కుమారుడు దేవాన్‌‡్ష మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. చాక్‌లెట్‌ చేతికి ఇస్తే కింద పడకుండ తినలేని పసి వయసులో దేవాన్ష్‌ రూ. 20 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో బాబుగా రికే తెలియాలి.  

చంద్రబాబు అక్రమ ఆస్తుల గుట్టు మొట్ట మొదట బయట పెట్టింది ఆయన అత్తగారు నంద మూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదా యానికి మించిన ఆస్తులు సంపాదించారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని 2005లో లక్ష్మీ పార్వతి తొలిసారి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరుగకుండా చంద్ర బాబు స్టే తెచ్చుకున్నారు. అది మొదలు మద్యం ముడుపుల కేసు, ఏలేరు కుంభకోణం, ఐఎంజీ భారత్‌ కేసు, హెరిటేజ్‌ ఫుడ్స్‌లో మోహన్‌బాబుతో వివాదం, ముఖ్యమంత్రిగా హెరిటేజ్‌ ఫుడ్స్‌కు రాయితీలు ఇచ్చిన కేసు, అవినీతి మీద పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వేసిన కేసు ఇలా మొత్తం 17 కేసుల్లో విచారణ జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చు కున్నారు. ఆ స్టేలను మెరుగుపరిచి తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటూ వచ్చాడు.

ఆర్థికబలం, అధికార బలంతో చంద్రబాబు వ్యవస్థలను ఏమార్చారు. ఇందుకు కోర్టులు కూడా మినహాయింపు కాదు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ఆర్‌ భార్య  విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పుడు  హైకోర్టు ధర్మాసనం చంద్రబాబు ఆస్తులపై సీబీఐ, ఈడీల ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మురళీమోహన్, సీఎం రమేష్‌ తదితరులు హైకోర్టు ఆదేశాలను నిలిపి వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచిం చింది.

తర్వాత ఆ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి స్టే ఉత్తర్వులతో ఆగిపోయింది. ఈ కేసు విచారణ పేరుతో ఎనిమిది బెంచ్‌లు మార్చ డంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా బెంచ్‌లు మార్చడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరి స్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది.ఈ కేసు సంగతి అలా ఉంచితే 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాతనైనా చంద్రబాబు అక్రమ ఆస్తులపై  లక్ష్మీపార్వతి పెట్టిన కేసు విచా రణకు ఏసీబీ కోర్టు సిద్ధం కావటం ఆహ్వానించదగిన పరిణామం. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుంది.

వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి,
సీనియర్‌ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్‌ 
మొబైల్‌ : 94403 80141
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement