పండుటాకులకు ఊతకర్ర
⇒సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ‘సాక్షి’ జనపథం
⇒ ఇబ్బందులను ఏకరువు పెట్టిన అనాజ్‌పూర్ గ్రామస్తులు
⇒అర్హత ఉండి కూడా పింఛన్ లిస్టులో పేరు లేదని బాధపడిన వృద్ధులు
⇒అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు 8 మంది పేర్లు చేర్పించిన సోలిపేట
⇒వారం రోజుల్లో మరో 10 మందికి కూడా పింఛన్ ఇప్పిస్తానని హామీ
⇒అర్హుల గుర్తింపునకు ఇది ఆరంభం మాత్రమే: రామలింగారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గాజు కళ్లు... ముడుతలు పడిన ఒళ్లు.. 60 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు సోలిపేట రామలింగారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో పింఛన్లు అందని పండుటాకులతో రాస్తారోకో చేయించి పాలకులను రోడ్డు మీదకు ఈడ్చిన ఆయన, ఇపుడు అధికారంలో ఉన్నా, అవ్వాతాతలవైపే మొగ్గు చూపారు. వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ‘సాక్షి’, సాక్షిటీవీ నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పండుటాకులకు వచ్చేందంతా పండుగ రోజులేనని తెలిపారు. ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన అక్కా చెళ్లెళ్లకు, అంగవైకల్యం ఉన్న అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ అవుతారని భరోసా ఇచ్చారు. అవ్వా తాతలకు అన్యాయం జరిగితే రోడ్డెక్కటానికి వెనుకాడిది లేదన్నారు.
పింఛన్‌జాబితాలో పేర్లు నమోదు
మంగళవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని మారుమూల పల్లె అనాజ్‌పూర్‌లో ‘సాక్షి’, సాక్షి టీవీ ఆధ్వర్యంలో ‘జనపథం’ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, జెడ్పీటీసీ సర్వుగారి వీరమణి ఎంపీడీఓ మచ్చేందర్, గ్రామ కార్యదర్శి రవి, గ్రామ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సుమారు 450 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతన్నలు, నేతన్నలు పాల్గొని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆసరా పథకంలో తమ పేర్లు ఉన్నాయో... తొలిగించారో... తెలియక ఆందోళన పడుతున్న వాళ్లకు ఈ వేదిక అనుమానాలన్నీ నివృత్తి చేసింది. అసరా లేక అల్లాడుతున్న పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన 8 మంది వృద్ధుల పేర్లను, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అప్పటికప్పుడు స్థానిక ఎంపీడీఓ మచ్ఛేంద్రతో మాట్లాడి వారికి తొలి లిస్టులోనే నమోదు చేయించారు. నేటి నుంచి అమలు చేస్తున్న అసరా పథకంలో వాళ్లు రూ.1000 అందుకోనున్నారు.
గతంలో కంటే ఎక్కువే
గ్రామంలో మొత్తం 483 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరి పింఛన్ ఉంటే వారిలో ఒకరి పేరును ప్రభుత్వం తొలగించింది. ఏడున్నర ఎకరాలకు పైగా మెట్టభూమి ఉన్న వారిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం 349 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. వీళ్లలో 221 మంది వృద్ధులు, 99 మంది వితంతువులు, 29 మంది వికలాంగులు అర్హులుగా గుర్తించారు. అధికారుల ఇచ్చిన నివేదికల ప్రకారం గత పింఛన్లతో పోలిస్తే... కొత్త ప్రభుత్వం తొలి జాబితాలోనే 5 మందికి ఎక్కువగానే పింఛన్లు ఇచ్చిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఈలెక్కన గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఎక్కువ పింఛన్లు ఇస్తోందని, ఒక్క అనాజ్‌పూర్ గ్రామంలో మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పింఛన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
అన్నీ కన్నీటిగాథలే...
‘అయ్యా...నిరుడు నా భర్త టక్కరై పోయిండు. ముగ్గురు పిల్లల తల్లిని, ముగ్గురికి ముగ్గురూ సిన్నపిల్లలే..ఎట్టా బతను సారూ’.. అంటూ మడిగె లక్ష్మి అనే మహిళ కన్నీళ్లు పెట్టింది. రామలింగారెడ్డి ఈమె పేరు వితంతవుల జాబితాలో ఉందా? లేదా? చూసి చెప్పాలని అధికారులను కోరారు. మడిగె లక్ష్మి పేరు అర్హుల జాబితాలో ఉందని వారు చెప్పడంతో లక్ష్మికి కొంత ఊరట లభించింది. పిల్లలను ఏదైనా సంక్షేమ హాస్టల్లో చేర్పించేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక సోమని లక్ష్మిది మరో బాధ... భర్త మహారాష్ట్రకు వలసపోయి అక్కడే చనిపోయాడు. మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే అక్కడి మరణ ధ్రువీకరణ పత్రం ఇక్కడ చెల్లదంటే అధికారులు మెలికలు పెట్టారు.
ఈ విషయాన్ని లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన అక్కడే ఉన్న అధికారుతో మాట్లాడారు. అప్పటికే ఆమె వింతంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో ఎంపీడీఓతో మాట్లాడి అర్హుల జాబితాలో సోమని లక్ష్మి పేరు చేర్చారు. అంతేకాకుండా దౌల్తాబాద్ తహశీల్దార్‌తో అప్పటికప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడి దళితులకు ఇచ్చే మూడు ఎకరాల భూమి కూడాఇవ్వాలని సూచించారు. దీంతో లక్ష్మి వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మరో యువతి జయమ్మ భర్త గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఏం చెప్పిందంటే ‘ నాభర్తకు టక్కరై అగస్తంగ పోయిండు.
ఆపతిబంధు పథకం కింద కాయితం పెట్టుకుంటే...ఎమ్మారో సారు నా కాయితం నాకు తిప్పి పంపిండు. భర్తలేని పింఛను కూడా కాయితం పెట్టుకున్న గాని వచ్చిందో.. రాలేదో తెల్వదు’ అని చెప్పింది. గ్రామ కార్యద ర్శి రవి జాబితాను పరిశీలించి అర్హత జాబితాలో ఆమె పేరు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ఆపద్భందు పథకం కోసం ప్రయత్నం చేస్తానని సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. ఇలా సోమని రామసోమె... కర్రూరి నర్సయ్య.. ఆరే పోచమ్మ... మంజుల... ఎంకవ్వ.. రామవ్వ దాదాపు 450 మంది అనుమానాలను ఆందోళనలకు పరిష్కారం చేపే విధంగా జన పథం సాగింది.