ఆసరా పథకం జాబితాలో తమ పేరు లేవనే బాధ వద్దని, అర్హులైన వారందరికీ పింఛన్లను ప్రభుత్వం..
దుబ్బాక: ఆసరా పథకం జాబితాలో తమ పేరు లేవనే బాధ వద్దని, అర్హులైన వారందరికీ పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లోని ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పింఛన్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యమైనా రెండు నెలల పింఛన్ కలిపి వృద్దులు, వితంతువులకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ. 3 వేలను అందజేస్తున్నామన్నారు.
జాబితాలో తమ పేర్లు లేవని దిగులు చెందవద్దని, అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పింఛన్ రాని లబ్ధిదారులు సంబంధిత అధికారులను కలిసి తమ దరఖాస్తులను సమర్పించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ప్రతి పక్షాల నోళ్లు మూయించే విధంగా ఆసరా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.
పేద ప్రజలకు పెద్ద కొడుకుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి పక్షాల అసత్య ఆరోపణలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి పక్షాలు విమర్శంచకుండా ఉండడానికే ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, తిమ్మాపూర్ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి, పద్మనాభునిపల్లి సర్పంచ్ ము క్కపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ పస్తం లక్ష్మి నరహరి తదితరులు పాల్గొన్నారు.