dubbaka mla
-
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హకీంపేట దగ్గర పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. రఘునందన్ రావుతో ఫోన్లో మాట్లాడిన ఈటల రాజేందర్.. అక్రమ నిర్భందాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చదవండి: కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా.. బండి మనసులో ఏముంది? -
దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?
2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్‌కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ఉప ఎన్నికతో మారిన రాజకీయ చిత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉన్న రాష్ట్ర రాజకీయాలు కారు వర్సెస్ కమలంగా రూపాంతరం చెందాయి. 2020లో చివర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపుతో కారు పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకునే అవకాశం లభించింది. అంతకుముందు రెండు సార్లు ఓటమి చెందిన రఘునందనరావు స్వల్ప మెజారిటీతోనే అయినా సంచలన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు చెరకు ముత్యం రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాల చేతిలోనే దుబ్బాక నియోజకవర్గం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ప్రత్యేక రాష్ట్ర పార్టీగా ఉనికిలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది. చెరకు ముత్యం రెడ్డి ప్లేస్‌లో 2004లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009లో మళ్ళీ చెరకు ముత్యం రెడ్డి గెలిచినా..ఆ తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీ తరపున సోలిపేట గెలిచారు. 2020లో సోలిపేట అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఉపఎన్నిక జరిగి దుబ్బాక రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చింది. జైత్రయాత్రలకు బ్రేక్ చెరకు, సోలిపేట కుటుంబాల జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. కాంగ్రెస్, కారు పార్టీలను పక్కకు నెట్టి ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో..మూడు ప్రధాన పార్టీల నేతలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు... రామలింగారెడ్డి సతీమణి పై స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. అందువల్ల చే జారిపోయిన సీటును తిరిగి గులాబీ పార్టీ ఖాతాలో వేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుండి బరిలో దింపాలని గులాబీ పార్టీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభాకరరెడ్డి కూడా దుబ్బాక సొంత నియోజకవర్గం కావడంతో..ఎంపీగా కంటే..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. జనంతోనే జనం వెంటే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నియోజకవర్గంలోనే క్యాంప్ వేసి పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమవుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నప్పటికీ ఉదయం లేవగానే దుబ్బాకలో కనిపిస్తున్నారు. వారానికి 5 రోజులపాటు ఆయన నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల మధ్యే ఉంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు నియోజకవర్గంలోనే తిరుగుతూ..తమ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి తరుచు డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రోటోకాల్ గొడవ ఎవరికి న్యాయం చేస్తుందో చూడాలి. తండ్రి సీటుపై తనయుడి ఆశ దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సీటుపై ఆశ పడుతున్నట్టు సమాచారం. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బై ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు అమలుకాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సరైన ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పడం.. రైతులకు రెండు ఎడ్లు, నాగలి ఇస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు. మరి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రచారాయుధంతో ప్రజల ముందుకు వస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి మరో నేత డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆఖ లో మాత్రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే దుబ్బాక టికెట్ ఓకే అయినట్లు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే వారంలో ఐదు రోజులపాటు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పుకొంటున్నారు. గులాబీ పార్టీలో మరో నేత బీసీ సామాజిక వర్గంకు చెందిన చిందెం రాజకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గిన మాటల మాంత్రికుడు కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగుతున్న తమ జైత్ర యాత్రకు బ్రేక్ వేసిన రఘునందన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి మళ్ళీ సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్రిముఖ పోటీలో దుబ్బాకలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
చార్మినార్‌లో గెలిచి చూపిస్తా: రఘునందన్‌రావు
నల్లగొండ టూటౌన్: సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్.. 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను చార్మినార్‌లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు. తండ్రి కేసీఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరేచోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్‌రావు మాట్లాడారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది: జేపీ నడ్డా -
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
దుబ్బాకటౌన్: కేంద్ర మానవ వనరులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి దుబ్బాకటౌన్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగవద్దని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, ముంపు బాధితుల సమస్య తదితర విషయాలపై సంబంధిత అధికారులతో శనివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం, కాలువల నిర్మాణంతో నష్టపోతున్న బాధితులకు అందించిన సాయంపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా పరిహారం అందించాలన్నారు. పరిహారం పంపిణీలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఉండాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు అధికారులు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా..!
-
మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు
సాక్షి, తిరుమల: దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికలో విజయం సాధించాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుంది. నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. పార్టీ సమిష్ట కృషికి నిదర్శనం నా గెలుపు. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై నన్ను గెలిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించాను అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. కాగా రఘునందర్రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: (టీఆర్ఎస్ కంచుకోటలో కమలదళం పాగా) (దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం) -
ముగిసిన రామలింగారెడ్డి అంత్యక్రియలు
సాక్షి, మెదక్: దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ యాత్ర ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, బాల్క సుమన్, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్ ఒక్కసారిగా మూగబోయింది. కన్నీళ్లతోనే ఆయనను ఆఖరుసారి చూసేందుకు అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం) -
'పేద ప్రజలకు మేం వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకాల పేరిట కాంగ్రెస్ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట సొంత లాభం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద పట్టుబడ్డ డబ్బులు కూడా ఇందిరమ్మ ఇళ్లవేనంటూ ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని.. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రామలింగారెడ్డి అన్నారు. -
‘ఆసరా’ అందలేదని దిగులు వద్దు
దుబ్బాక: ఆసరా పథకం జాబితాలో తమ పేరు లేవనే బాధ వద్దని, అర్హులైన వారందరికీ పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్, పద్మనాభునిపల్లి గ్రామాల్లోని ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పింఛన్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యమైనా రెండు నెలల పింఛన్ కలిపి వృద్దులు, వితంతువులకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ. 3 వేలను అందజేస్తున్నామన్నారు. జాబితాలో తమ పేర్లు లేవని దిగులు చెందవద్దని, అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పింఛన్ రాని లబ్ధిదారులు సంబంధిత అధికారులను కలిసి తమ దరఖాస్తులను సమర్పించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ప్రతి పక్షాల నోళ్లు మూయించే విధంగా ఆసరా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. పేద ప్రజలకు పెద్ద కొడుకుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి పక్షాల అసత్య ఆరోపణలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రతి పక్షాలు విమర్శంచకుండా ఉండడానికే ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, తిమ్మాపూర్ సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి, పద్మనాభునిపల్లి సర్పంచ్ ము క్కపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ పస్తం లక్ష్మి నరహరి తదితరులు పాల్గొన్నారు.