సాక్షి, మెదక్: దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ యాత్ర ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, బాల్క సుమన్, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్ ఒక్కసారిగా మూగబోయింది. కన్నీళ్లతోనే ఆయనను ఆఖరుసారి చూసేందుకు అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం)
Comments
Please login to add a commentAdd a comment