chittapur
-
ముగిసిన రామలింగారెడ్డి అంత్యక్రియలు
సాక్షి, మెదక్: దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ యాత్ర ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, బాల్క సుమన్, పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి తదితరులు రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్ ఒక్కసారిగా మూగబోయింది. కన్నీళ్లతోనే ఆయనను ఆఖరుసారి చూసేందుకు అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి; సీఎం కేసీఆర్ సంతాపం) -
కంటతడి పెట్టుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంతరం రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (దుబ్బాక ఎమ్మెల్యే మృతి పట్ల కేసీఆర్ సంతాపం) బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన రామలింగారెడ్డి అంత్యక్రియలను మరికాసేపట్లో చిట్టాపూర్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననుండటంతో సిద్దిపేట పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 1982 నుంచి ఉదయం, వార్త పత్రికల్లో పని చేసిన జర్నలిస్టులు, TUWJ రాష్ట్ర ప్రతినిధులు విరహథ్ అలీ ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సందర్శించారు. తమ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉందంటూ వారి మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత) -
సివిల్స్ ఫస్ట్ ర్యాంక్‌తో సర్ప్రైజే ఇచ్చాడు
అమ్మకు తేడా తెలీదు. అమ్మ చూపులో చిన్నచూపుపెద్దచూపు ఉండదు. కలిమిలేమి, రాజుపేద, తన పర భేదాలు చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడమని చెప్తుంది! అమ్మ ప్రోత్సాహం అనుదీప్ జీవితంలో చాలా విలువైంది. అమ్మ ఇచ్చే సందేశం కూడా అంతే విలువైంది. అనుదీప్‌తో ఒక స్నేహితురాలిలామెలిగాను అంటున్నారు తల్లి జ్యోతి దురిశెట్టి. ‘‘బాగా గుర్తుంది ఆ రోజు. సివిల్స్ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు ఫోన్ చేశాడు. ‘అమ్మా.. ఈసారి వస్తుంది.. గ్యారెంటీ’ అన్నాడు. అన్నట్టుగానే తెచ్చుకున్నాడు. వాడికెలా ఉందోగానీ నాకైతే సంతోషమే సంతోషం. సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ అనుదీప్ అని రిజల్ట్స్ రాగానే ఫోన్లే ఫోన్లు. అనుదీప్ మదర్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నా. అమ్మగా నేనేం చేయాలో అది చేశాను తప్ప స్పెషల్‌గా ఏం పెంచలేదు. వాడే గోల్ సెట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు కష్టపడ్డాడు. ఈ రోజు మీ అందరి గ్రీటింగ్స్.. బ్లెస్సింగ్స్ అందుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు.. కుటుంబం మా సొంతూరు చిట్టాపూర్. ఇది జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండల్ కిందికొస్తది. కానీ మావారి (దిరిశెట్టి మనోహర్) ఉద్యోగం మెట్పల్లిలో కాబట్టి అక్కడే ఉంటాం. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్. మాకు అనుదీప్ కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు అభినయ్. మొన్ననే బీటెక్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటున్నాడు. ‘అన్నయ్యలాగే నేను కూడా సివిల్స్ రాస్తా’ అన్నాడు. వాడిష్టం. పిల్లల మీద మేమెప్పుడూ ప్రెషర్ పెట్టలేదు. ఫలానా వాళ్ల పిల్లలు డాక్టర్స్ అయ్యారు.. ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీర్స్ అయ్యారు.. మీరూ అలాగే చదవాలి.. అని వాళ్లనెప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఏం చదవాలన్నా.. ఏం కావాలన్నా వాళ్లిష్టమే. ఫ్యూచర్లో వాళ్లు ఏం కావాలో మేం డిసైడ్ చేయలేదు. చదువులో ఇంకే విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం అంతే. ఎప్పుడు చదువుకుంటావ్‌రా...? పిల్లలిద్దర్నీ మెట్పల్లిలోనే చదివించాం. అనుదీప్ మొదట్నించీ క్లాస్ ఫస్టే. అట్లాగని 24 గంటలూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే టైప్ కాదు. క్లాస్‌లో విన్నదే. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. హోమ్‌వర్క్స్ కూడా స్కూల్లోనే చేసేసుకునేవాడు. ఇంటికొచ్చి స్నాక్స్ తిని, పాలు తాగి అలసిపోయేంతగా ఆడుకునేవాడు. ఇంటికొచ్చాక నేను కూడా పిల్లల వెంట పడేదాన్ని కాను చదువుకోమని. ఆడుకోమనే చెప్పేదాన్ని. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మా పిల్లలు ఆటలతోనే షార్ప్ అయ్యారని అనుకుంటా. ఫిజికల్ యాక్టివిటీ కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది కదా. బహుశా అనుదీప్‌ను అంత షార్ప్ చేసింది వాడు ఆడిన ఆటలేనేమో. వాడికి ఫుట్‌బాల్ అంటే ఇష్టం. పోటీల్లో పాల్గొన్నాడు కూడా. మా ఇంటి పక్కన ఓ టీచర్ ఉండేది. ఆవిడ అనుదీప్‌ను చూసి ‘ఒరేయ్ ఎప్పుడు చూసినా ఆడుతూనే కనిపిస్తావ్... చదువులో మాత్రం ఫస్ట్ ర్యాంక్ తప్పవ్. ఎప్పుడు చదువుకుంటావ్‌రా నువ్వసలు?’ అని అంటుండేది. నిజమే.. ఆవిడ అన్నట్టుగా ఆటలతో అలసిపోయేవాడు చదువులో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ తప్పలేదు. టెన్త్‌లోనూ స్కూల్ టాప్. కార్పోరేట్ కాలేజ్‌వాళ్లు ఫ్రీగానే ఇంటర్లో సీట్ ఇచ్చారు. ఫస్టియర్‌లో చాలా బెరుగ్గానే ఉన్నాడు. ‘అమ్మా.. ఇక్కడ అందరూ చాలా ఫ్లుయెంట్ ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఫ్లుయెన్సీ లేదు. వాళ్ల లెవెల్‌కి రీచ్ అవుతానా?’ అని అనేవాడు. ‘ఏంకాదు నాన్నా... నలుగురితో మాట్లాడుతూ కలిసిపోతే భయం పోతుంది. భయంపోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈజీగా మాట్లాడేస్తావ్’ అని చెప్పేవాళ్లం. అన్నట్లుగానే త్వరగా ఆ ఫీలింగ్‌నీ ఓవర్‌కమ్ చేశాడు. ఎమ్సెట్లో స్టేట్ ఫార్టీఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఐఐటీకీ ప్రిపేర్ అయ్యాడు. చికెన్‌పాక్స్ రావడంతో ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు. ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటల్) బిట్స్ పిలానీలో చేశాడు. ఒరాకిల్‌లో జాబ్ వచ్చినప్పడు మాత్రం... అనుదీప్‌కి పుస్తకాలు చదవడం అలవాటు. నా క్వాలిఫికేషన్ ఇంటర్. కాని కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా నా చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నయసూరి నీతికథలు.. అన్నిటినీ రాత్రి పిల్లలకు చెప్పేదాన్ని. అట్లా బుక్‌రీడింగ్ మీద అనుదీప్‌కి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇవ్వాళ సివిల్స్ సక్సెస్‌కు అదీ ఒక రీజన్ అనుకుంటాన్నేను. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్‌లో జాబ్ వచ్చింది. అప్పుడు మాత్రం అనుకున్నాం.. వీడు ఉద్యోగంలో చేరకుండా సివిల్స్‌కి ప్రిపేర్ అయితే బాగుండు అని. అట్లా అనుకున్నామో లేదో తెల్లవారే ఫోన్ చేశాడు. ‘అమ్మా.. జాబ్‌లో చేరను. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’ అని. ‘నీ ఇష్టం నాన్నా...’ అన్నాం. ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఎటెంప్ట్‌లో రాలేదు. సెకండ్ ఎటెంప్ట్‌కి ఐఆర్ఎస్లో వచ్చింది. మేం హ్యాపీగానే ఉన్నాం. కాని వాడికే శాటిస్ఫాక్షన్ లేకుండింది. మళ్లీ ప్రిపేర్ అయ్యాడు. థర్డ్ ఎటెంప్ట్‌లో రాలేదు. పోనీలే నాన్నా.. వదిలెయ్ అన్నా వినలేదు. ‘లేదమ్మా.. నా గోల్ అది’ అంటూ మళ్లీ ఫోర్త్ టైమ్ రాశాడు. అప్పుడూ రాలేదు. అయినా ఊరుకోలేదు. అయిదోసారి.. ఇట్లా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మాకూ సర్ప్రైజే ఇచ్చాడు. సమస్యలు తెలుసు... వాళ్ల నాన్న ఇంజనీర్ కదా. మా ఇంటికెప్పుడూ రైతులు వçస్తుండేవారు పొలంలో కరెంట్ సమస్యలతోని. వాళ్లు వాళ్ల ప్రాబ్లమ్స్ మావారితో చెప్పుకుంటుంటే మావారు వాళ్లకు సలహాలిస్తుంటే అనుదీప్ వెళ్లి వాళ్ల నాన్న పక్కన కూర్చుని అన్నీ వినేవాడు. రైతులు వెళ్లిపోయాక తనకొచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకునేవాడు. అట్లా చిన్నప్పటినుంచే వాడికి రైతుల ప్రాబ్లమ్స్, ఊళ్లో పరిస్థితుల గురించి తెలుసు. అవన్నీ వాడికిప్పుడు హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నా. అనుదీప్ చాలా సెన్సిటివ్. పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆడవాళ్లంటే కూడా చాలా రెస్పెక్ట్. ఎవరినీ నొప్పించడు. అయినా వాడి నుంచి నేను కోరుకునేది ఒకటే. వాడి లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. ఎప్పుడు ఎక్కడ.. ఏ పొజిషన్లో ఉన్నా అందరినీ రెస్పెక్ట్ చేయాలి. ప్రాబ్లమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన వాళ్ల పట్ల భేదభావం చూపొద్దు. డబ్బున్నవాళ్లపట్ల, లేని వాళ్ల పట్ల ఎలాంటి తారతమ్యాలు చూపొద్దు అని. ఇదే మాట చెప్తాను వాడికెప్పుడూ. నా పిల్లల మీద నాకు చాలా నమ్మకం. తోటివాళ్లకు సహాయపడేలా ఉంటారని. తొలి జీతంతో కానుక అనుదీప్ ఫోర్త్‌టైమ్ సివిల్స్ రాశాక మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు. నాకు, వాళ్ల నాన్నకు ఢిల్లీకి టికెట్స్ బుక్ చేశాడు. ఫోన్లో ఆ విషయం చెప్పేవరకు మాకు తెలీదు. ‘అమ్మా.. నీ కోసమే ప్లాన్‌చేశా ఇది. నువ్వెప్పుడూ ఇల్లూ పని అంటూ కదలనే కదలవు. అందుకే ఈ సర్ప్రైజ్’ అని చెప్పాడు. ఆగ్రా తీసుకెళ్లాడు. తాజ్‌మహల్ చూపించాడు. నిజానికి దానికన్నా కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ వాడు ఐఏఎస్ కావడం. వాడి కలను నెరవేర్చుకోవడం. ఇందులో నేను వాడికి చేసిన హెల్ప్ ఏమీ లేదు. అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ఉన్నా. అన్నీ షేర్ చేసుకుంటాడు. అనుదీప్‌లో నాకు బాగా నచ్చేది ఈగో లేకపోవడం. వాడు మంచి పెయింటర్ కూడా. ఐఆర్ఎస్గా జాయిన్ అయ్యాక వచ్చిన ఫస్ట్ శాలరీతో నాకు పట్టుచీర కొన్నాడు. సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పుడు మేమెక్కడ కనపడినా అనుదీప్ వాళ్ల మదర్ కదా.. అని నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. మదర్‌గా ఇంతకన్నా ప్రైడ్ ఏముంటుంది నాకు? – సరస్వతి రమ -
మొక్కజొన్నకు మాయరోగం
చిట్టాపూర్ రైతుల్లో అయోమయం ఎర్రబారిన 50 ఎకరాల పంట నష్టం అంచున 40 మంది రైతులు తెగులును గుర్తించే పనిలో వ్యవసాయాధికారులు దుబ్బాక: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మొక్కజొన్న సేనుతో సహవాసం చేసే రైతన్నలకు కష్టమొచ్చింది. రైతన్నల ఆరుగాలం కష్టం బూడిద పాలైంది. మొక్కజొన్నకు మాయదారి రోగం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొలకలు విత్తడం నుంచి చేను చేతికొచ్చే సమయానికి ఒక్కొక్క మొక్క కర్ర రైతన్న కళ్లేదుటే ఎర్రబారుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇటు పెట్టిన పెట్టుబడి పోయే... అటు రెక్కల కష్టం బూడిద పాలు కాబట్టే... ఇది ప్రకృతి వైపరీత్యమో... మానవ తప్పిదమో తెలియక తికమక పడుతున్న తీరు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 40 మంది రైతుల్లో నెలకొంది. వీరికి కన్నీరే మిగిలింది.. గ్రామానికి చెందిన రైతులు గొల్ల నారాయణ- 3 ఎకరాలు, దుంపేటి సిద్ధిరాములు- 1.20, పోతనక యాదగిరి- 2, దుంపేటి రేణుక-1.20, గొల్ల మల్లయ్య- ఎకరం, రెడ్డి కవిత- 1.20, కూస సూరవ్వ-2 ఎకరాలు, కమటం రవి-1.20, జిగిరి గుట్టయ్య-1.20, మొనగారి నర్సింగ్ రావు- ఎకరం, కమటం నర్సయ్య- 2 ఎకరాలు, మంతూరి యాదయ్య- ఎకరం, నగరం లక్ష్మి- ఎకరం, జిగిరి కనకవ్వ- ఎకరం, చాకలి పోశయ్య-1.20, సిద్ధిని ఎల్లయ్య-ఎకరం, మంతూరి రాందాస్- 2 ఎకరాలు, నవ్యాతు విఠల్- ఎకరం, గంగాళ్ల పర్శయ్య-ఎకరం, గొల్ల నాగరాజు-ఎకరం, తీగల లక్ష్మి నర్సయ్య-1.20, కూస బాలయ్య- 20 గుంటలు, కూస కొండయ్య-2.00, రెడ్డి రమేశ్-1.20, దుంపేటి ఎల్లం- ఎకరంతో పాటు మరో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాల మొక్కజొన్న ఎండు బారుతోంది. యూరియా వేయగానే.. మొక్కజొన్న పంట వేసి 65 రోజులు కావస్తోంది. వేసిన మొక్కజొన్నకు కిసాన్, ఉజ్వల లాంటి యూరియాను వేశారు. యూరియా వేసిన రెండు మూడు రోజుల నుంచే మొక్క కాండం కింది భాగంలో ఉన్న ఆకులు ఎర్రబారుతున్నాయి. దీంతో లబోదిబోమంటూ వ్యవసాయాధికారులకు సదరు రైతులు తమకు జరిగిన నష్టాన్ని విన్నవించుకున్నారు. చేసిన రెక్కల కష్టం మట్టిపాలయ్యిందని వాపోతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయాధికారులు వచ్చి యూరియా, ఎర్రబారిన మొక్కజొన్న కర్రలను సేకరించి పరీక్షల నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ ప్రయోగశాలకు తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతనే మొక్కజొన్నకు వచ్చిన రోగాన్ని నిర్ధారించగలమని అధికారులు తెలిపారు. పరీక్షలకు పంపించాం గ్రామంలో రైతులు వేసుకున్న మొక్కజొన్న పంటను పరిశీలించాం. తేమ లేనప్పుడు, మొక్కపై యూరియాను వేసినప్పుడే ఇలాంటి రోగం వస్తోంది. లేకుంటే కాండం తొలుచు పురుగు ఉన్నప్పుడు కూడా పంట ఎర్రబారుతుంటుంది. యూరియాలో 46 శాతం నత్రజని ఉండకపోయినా ఇలాంటి సమస్య వస్తుంది. కాండం తొలుచు పురుగును కార్భోఫిరాన్ గుళికలను పిచికారి చేసి నిరోధించవచ్చు. మొక్కజొన్నకు యూరియా వేసే ముందు తేమ సరిగ్గా ఉన్నదా లేదా సరి చూసుకోవాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. - ఏఓ మల్లేశం, దుబ్బాక యూరియా వేయగానే ఎర్రబారింది నాకున్న మూడెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. కిసాన్, ఉజ్వల యూరియా వేయడంతోనే రెండు, మూడు రోజుల్లో మొక్కజొన్న ఆకులు ఎండు బారుతున్నాయి. మూడెకరాలకు సుమారుగా రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కళ్లెదుటే మొక్కజొన్న కర్రలు ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో తెలియడం లేదు.- గొల్ల నారాయణ, రైతు, చిట్టాపూర్ ప్రభుత్వం ఆదుకోవాలి వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాను. పంటకు యూరియా వేయగానే ఒక్కొక్క కర్ర ఎండు బారుతోంది. మొక్కజొన్న చేతికొచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. చేతికొచ్చిన పంటను చూస్తే ఏడుపొస్తుంది. - దుంపేటి సిద్ధిరాములు, రైతు, చిట్టాపూర్ -
రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు
నందిపేట, న్యూస్‌లైన్:నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ చౌరస్తా వద్ద ఎన్నికలలో భాగంగా చేపట్టిన తనిఖీలలో రూ.2 లక్షల నగ దు, 54 క్వాటరు సీసాల మద్యాన్ని గురువారం అధికారులు పట్టుకున్నారు. నందిపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షల నగదు లభించాయి. డబ్బులకు సంబంధించి ఆ వ్యక్తి సరైన ఆధారాలు చూ పించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌లోని రిటర్నింగ్ అధికారి జె.గజ్జెన్నకు అందజేశారు. అలాగే బస్సులో 39 రాయల్ లైఫ్, 15 ఆఫీసర్ చాయిస్ క్వాటరు సీసాలను అధికారులు పట్టుకున్నారు. మామిడిపల్లి వద్ద రూ 1.50 లక్షలు.. ఆర్మూర్ అర్బన్ : మండలంలోని మామిడిపల్లి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.50 లక్షల నగదును పోలీసులు గురువారం జప్తు చేశారు. ఆర్మూర్ ప్రాంతం ఎర్రజొన్న ధాన్యాన్ని లారీల్లో ఢిల్లీ తరలించడానికి ఉమేష్ పాటిల్ అనే వ్యక్తి ఆర్మూర్ వచ్చాడు. ఈ క్రమంలో రూ. 9 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి వాహనాల్లో డీజిల్ పోయించేందుకు అడ్వాన్సులుగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మిగిలిన రూ. 1.50 లక్షల నగదును మామిడిపల్లిలో తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. డబ్బుఆధారాలు లేకపోవడంతో జప్తు చేశారు. చిట్టాపూర్ శివారులో 3.90 లక్షలు.. బాల్కొండ: మండలంలోని చిట్టాపూర్ శివారులో జాతీ య రహదారి-44పై ఎన్నికల ఎస్ఎస్టీ టీం 39, ఫ్లైయిం గ్ టీం డీసీఎం వ్యానులో రూ. 3.90 లక్షల నగదును గురువారం పట్టుకున్నట్లు తహశీల్దార్ పండరినాథ్ తెలిపారు. దత్తాద్రి అనే వ్యక్తి డబ్బులు తీసుకుపోతుండగా ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్ఎస్టీ సమాద్, డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్, ఎంఆర్ఐ సుజాత తనీఖీల్లో పాల్గొన్నారు. లింగంపేటలో రూ. 11.16 లక్షలు.. లింగంపేట: లింగంపేట సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద గురువారం రాత్రి చేపట్టిన తనిఖీలలో రూ.11.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌స్వ్కాడ్ అధికారి అలెగ్జాండర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీటర్ తెలిపారు. పిట్లం నుంచి కామారెడ్డికి వెళ్తున్న వాణి నవశక్తి బీడీ కంపనీ సిబ్బంది డబ్బును తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బం దికి పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్‌చేసి ఆర్డీఓ కార్యాలయానికి తరలిస్తామని అలెగ్జాండర్ తెలిపారు. కామారెడ్డిలో రూ.2 లక్షలు... కామారెడ్డి : కామారెడ్డిలో సిరిసిల్లా రహదారిపై పట్టణ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి వద్ద నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ రూ. 2 లక్షల స్వాధీనం చేసుకున్నారు. కె.గణేశ్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షలు ఉండగా వాటికి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ నాగరాజ్ గౌడ్, ముఖేశ్ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోచారం చెక్‌పోస్టు వద్ద 60 వేలు.. నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం చెక్‌పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అంధోల్ మండలం చింతకుంటకు చెందిన అంబటి హన్మంత్‌రెడ్డి ఇండికా కారులో జోగిపేటకు వెళ్తుండగా పోచారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారులో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు ఆధారాలు చూపించక పోవడంతో అధికారులు సీజ్ చేశారు. యంచ సమీపంలో రూ. 20,35,210 స్వాధీనం నవీపేట : నవీపేట మండలంలోని యంచ గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జి దగ్గర గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా 20 లక్షల 35వేల 210 నగదును పట్టుకున్నారు. కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన పత్తి వ్యాపారులు నాందేడ్‌లో పత్తిని విక్రయించ గా వచ్చిన డబ్బులను తీసుకుని వేర్వేరు వాహనాలలో వస్తుండగా సరిహద్దు ప్రాంతంలో తనిఖీ బృందం ఈ నగదును స్వాధీనం చేసుకుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను తీసుకుని వస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటు ఓచర్లు చూపించారు.కానీ నియమని బంధన ల ప్రకారం ఆ నగదును తనిఖీ బృందం స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. నల్గొండ జిల్లా గుర్రంపూడకు చెందిన వ్యాపారి మల్లారెడ్డి వద్ద 2,91,000,మెదక్ జిల్లాలోని గజ్వేల్‌కు చెందిన ఆంజనేయులు దగ్గర 6,25,810,అదే జిల్లాలోని తొవ్వాటకు చెందిన బాల్ నర్సయ్య దగ్గర 2,90,000,కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు చెందిన మహేష్ దగ్గర 8,28,400 లభ్యమైనట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ తెలిపారు.తనిఖీలో నీటి పారుదల శాఖ ఏఈ రషీద్, డీటీ రమేష్,గిర్దావర్ శ్రీనివాస్,కానిస్టేబుల్ మహబూబ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.