ఎర్రబారిన మొక్కజొన్న
- చిట్టాపూర్ రైతుల్లో అయోమయం
- ఎర్రబారిన 50 ఎకరాల పంట
- నష్టం అంచున 40 మంది రైతులు
- తెగులును గుర్తించే పనిలో వ్యవసాయాధికారులు
దుబ్బాక: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మొక్కజొన్న సేనుతో సహవాసం చేసే రైతన్నలకు కష్టమొచ్చింది. రైతన్నల ఆరుగాలం కష్టం బూడిద పాలైంది. మొక్కజొన్నకు మాయదారి రోగం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొలకలు విత్తడం నుంచి చేను చేతికొచ్చే సమయానికి ఒక్కొక్క మొక్క కర్ర రైతన్న కళ్లేదుటే ఎర్రబారుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇటు పెట్టిన పెట్టుబడి పోయే... అటు రెక్కల కష్టం బూడిద పాలు కాబట్టే... ఇది ప్రకృతి వైపరీత్యమో... మానవ తప్పిదమో తెలియక తికమక పడుతున్న తీరు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 40 మంది రైతుల్లో నెలకొంది.
వీరికి కన్నీరే మిగిలింది..
గ్రామానికి చెందిన రైతులు గొల్ల నారాయణ- 3 ఎకరాలు, దుంపేటి సిద్ధిరాములు- 1.20, పోతనక యాదగిరి- 2, దుంపేటి రేణుక-1.20, గొల్ల మల్లయ్య- ఎకరం, రెడ్డి కవిత- 1.20, కూస సూరవ్వ-2 ఎకరాలు, కమటం రవి-1.20, జిగిరి గుట్టయ్య-1.20, మొనగారి నర్సింగ్ రావు- ఎకరం, కమటం నర్సయ్య- 2 ఎకరాలు, మంతూరి యాదయ్య- ఎకరం, నగరం లక్ష్మి- ఎకరం, జిగిరి కనకవ్వ- ఎకరం, చాకలి పోశయ్య-1.20, సిద్ధిని ఎల్లయ్య-ఎకరం, మంతూరి రాందాస్- 2 ఎకరాలు, నవ్యాతు విఠల్- ఎకరం, గంగాళ్ల పర్శయ్య-ఎకరం, గొల్ల నాగరాజు-ఎకరం, తీగల లక్ష్మి నర్సయ్య-1.20, కూస బాలయ్య- 20 గుంటలు, కూస కొండయ్య-2.00, రెడ్డి రమేశ్-1.20, దుంపేటి ఎల్లం- ఎకరంతో పాటు మరో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాల మొక్కజొన్న ఎండు బారుతోంది.
యూరియా వేయగానే..
మొక్కజొన్న పంట వేసి 65 రోజులు కావస్తోంది. వేసిన మొక్కజొన్నకు కిసాన్, ఉజ్వల లాంటి యూరియాను వేశారు. యూరియా వేసిన రెండు మూడు రోజుల నుంచే మొక్క కాండం కింది భాగంలో ఉన్న ఆకులు ఎర్రబారుతున్నాయి. దీంతో లబోదిబోమంటూ వ్యవసాయాధికారులకు సదరు రైతులు తమకు జరిగిన నష్టాన్ని విన్నవించుకున్నారు.
చేసిన రెక్కల కష్టం మట్టిపాలయ్యిందని వాపోతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయాధికారులు వచ్చి యూరియా, ఎర్రబారిన మొక్కజొన్న కర్రలను సేకరించి పరీక్షల నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ ప్రయోగశాలకు తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతనే మొక్కజొన్నకు వచ్చిన రోగాన్ని నిర్ధారించగలమని అధికారులు తెలిపారు.
పరీక్షలకు పంపించాం
గ్రామంలో రైతులు వేసుకున్న మొక్కజొన్న పంటను పరిశీలించాం. తేమ లేనప్పుడు, మొక్కపై యూరియాను వేసినప్పుడే ఇలాంటి రోగం వస్తోంది. లేకుంటే కాండం తొలుచు పురుగు ఉన్నప్పుడు కూడా పంట ఎర్రబారుతుంటుంది. యూరియాలో 46 శాతం నత్రజని ఉండకపోయినా ఇలాంటి సమస్య వస్తుంది. కాండం తొలుచు పురుగును కార్భోఫిరాన్ గుళికలను పిచికారి చేసి నిరోధించవచ్చు. మొక్కజొన్నకు యూరియా వేసే ముందు తేమ సరిగ్గా ఉన్నదా లేదా సరి చూసుకోవాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. - ఏఓ మల్లేశం, దుబ్బాక
యూరియా వేయగానే ఎర్రబారింది
నాకున్న మూడెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. కిసాన్, ఉజ్వల యూరియా వేయడంతోనే రెండు, మూడు రోజుల్లో మొక్కజొన్న ఆకులు ఎండు బారుతున్నాయి. మూడెకరాలకు సుమారుగా రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కళ్లెదుటే మొక్కజొన్న కర్రలు ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో తెలియడం లేదు.- గొల్ల నారాయణ, రైతు, చిట్టాపూర్
ప్రభుత్వం ఆదుకోవాలి
వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాను. పంటకు యూరియా వేయగానే ఒక్కొక్క కర్ర ఎండు బారుతోంది. మొక్కజొన్న చేతికొచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. చేతికొచ్చిన పంటను చూస్తే ఏడుపొస్తుంది. - దుంపేటి సిద్ధిరాములు, రైతు, చిట్టాపూర్