సివిల్స్‌ ఫస్ట్‌ ర్యాంక్‌తో సర్‌ప్రైజే ఇచ్చాడు | special story to civils topper anudeep | Sakshi
Sakshi News home page

అమ్మదీప్‌

Published Tue, May 8 2018 12:01 AM | Last Updated on Tue, May 8 2018 9:25 AM

special story to civils topper anudeep - Sakshi

సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన కొడుకు అనుదీప్‌తో తల్లి జ్యోతి దురిశెట్టి

అమ్మకు తేడా తెలీదు. అమ్మ చూపులో చిన్నచూపుపెద్దచూపు ఉండదు. కలిమిలేమి, రాజుపేద, తన పర భేదాలు చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడమని చెప్తుంది! అమ్మ ప్రోత్సాహం 
అనుదీప్‌ జీవితంలో చాలా విలువైంది. అమ్మ ఇచ్చే సందేశం కూడా అంతే విలువైంది. అనుదీప్‌తో ఒక స్నేహితురాలిలామెలిగాను అంటున్నారు తల్లి జ్యోతి దురిశెట్టి.

‘‘బాగా గుర్తుంది ఆ రోజు. సివిల్స్‌ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు ఫోన్‌ చేశాడు. ‘అమ్మా.. ఈసారి వస్తుంది.. గ్యారెంటీ’ అన్నాడు. అన్నట్టుగానే తెచ్చుకున్నాడు. వాడికెలా ఉందోగానీ నాకైతే సంతోషమే సంతోషం. సివిల్స్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ అనుదీప్‌ అని రిజల్ట్స్‌ రాగానే ఫోన్లే ఫోన్లు. అనుదీప్‌ మదర్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నా. అమ్మగా నేనేం చేయాలో అది చేశాను తప్ప స్పెషల్‌గా ఏం పెంచలేదు. వాడే గోల్‌ సెట్‌ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు కష్టపడ్డాడు. ఈ రోజు మీ అందరి గ్రీటింగ్స్‌.. బ్లెస్సింగ్స్‌ అందుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. 

మా ఊరు.. కుటుంబం
మా సొంతూరు చిట్టాపూర్‌. ఇది జగిత్యాల జిల్లా, మల్లాపూర్‌ మండల్‌ కిందికొస్తది. కానీ మావారి (దిరిశెట్టి మనోహర్‌) ఉద్యోగం మెట్‌పల్లిలో కాబట్టి అక్కడే ఉంటాం. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌. మాకు అనుదీప్‌ కాకుండా ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు అభినయ్‌. మొన్ననే బీటెక్‌ అయిపోయింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటున్నాడు. ‘అన్నయ్యలాగే నేను కూడా సివిల్స్‌ రాస్తా’ అన్నాడు. వాడిష్టం. పిల్లల మీద మేమెప్పుడూ ప్రెషర్‌ పెట్టలేదు. ఫలానా వాళ్ల పిల్లలు డాక్టర్స్‌ అయ్యారు.. ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీర్స్‌ అయ్యారు.. మీరూ అలాగే చదవాలి.. అని వాళ్లనెప్పుడూ ఫోర్స్‌ చేయలేదు. ఏం చదవాలన్నా.. ఏం కావాలన్నా వాళ్లిష్టమే. ఫ్యూచర్‌లో వాళ్లు ఏం కావాలో మేం డిసైడ్‌ చేయలేదు. చదువులో ఇంకే విషయాల్లో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం అంతే. 

ఎప్పుడు చదువుకుంటావ్‌రా...?
పిల్లలిద్దర్నీ మెట్‌పల్లిలోనే చదివించాం. అనుదీప్‌ మొదట్నించీ క్లాస్‌ ఫస్టే. అట్లాగని 24 గంటలూ పుస్తకాలు పట్టుకుని కూర్చునే టైప్‌ కాదు. క్లాస్‌లో విన్నదే. గ్రాస్పింగ్‌ పవర్‌ ఎక్కువ. హోమ్‌వర్క్స్‌ కూడా స్కూల్లోనే చేసేసుకునేవాడు. ఇంటికొచ్చి స్నాక్స్‌ తిని, పాలు తాగి అలసిపోయేంతగా ఆడుకునేవాడు. ఇంటికొచ్చాక నేను కూడా పిల్లల వెంట పడేదాన్ని కాను చదువుకోమని. ఆడుకోమనే చెప్పేదాన్ని. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీ  ఉండాలి. మా పిల్లలు ఆటలతోనే షార్ప్‌ అయ్యారని అనుకుంటా. ఫిజికల్‌ యాక్టివిటీ కాన్‌సన్‌ట్రేషన్‌ను పెంచుతుంది కదా. బహుశా అనుదీప్‌ను అంత షార్ప్‌ చేసింది వాడు ఆడిన ఆటలేనేమో. వాడికి ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. పోటీల్లో పాల్గొన్నాడు కూడా. మా ఇంటి పక్కన ఓ టీచర్‌ ఉండేది.

ఆవిడ అనుదీప్‌ను చూసి ‘ఒరేయ్‌ ఎప్పుడు చూసినా ఆడుతూనే కనిపిస్తావ్‌... చదువులో మాత్రం ఫస్ట్‌ ర్యాంక్‌ తప్పవ్‌. ఎప్పుడు చదువుకుంటావ్‌రా నువ్వసలు?’ అని అంటుండేది. నిజమే.. ఆవిడ అన్నట్టుగా ఆటలతో అలసిపోయేవాడు చదువులో మాత్రం ఫస్ట్‌ ఎప్పుడూ తప్పలేదు. టెన్త్‌లోనూ స్కూల్‌ టాప్‌. కార్పోరేట్‌ కాలేజ్‌వాళ్లు ఫ్రీగానే ఇంటర్‌లో సీట్‌ ఇచ్చారు.  ఫస్టియర్‌లో చాలా బెరుగ్గానే ఉన్నాడు. ‘అమ్మా.. ఇక్కడ అందరూ చాలా ఫ్లుయెంట్‌ ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. నాకేమో అంత ఫ్లుయెన్సీ లేదు. వాళ్ల లెవెల్‌కి రీచ్‌ అవుతానా?’ అని అనేవాడు. ‘ఏంకాదు నాన్నా... నలుగురితో మాట్లాడుతూ కలిసిపోతే  భయం పోతుంది. భయంపోతే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. ఈజీగా మాట్లాడేస్తావ్‌’ అని చెప్పేవాళ్లం. అన్నట్లుగానే త్వరగా ఆ ఫీలింగ్‌నీ ఓవర్‌కమ్‌ చేశాడు. ఎమ్‌సెట్‌లో స్టేట్‌ ఫార్టీఫిఫ్త్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాడు. ఐఐటీకీ ప్రిపేర్‌ అయ్యాడు. చికెన్‌పాక్స్‌ రావడంతో ఎగ్జామ్‌ సరిగ్గా రాయలేకపోయాడు. ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటల్‌) బిట్స్‌ పిలానీలో చేశాడు. 

ఒరాకిల్‌లో జాబ్‌ వచ్చినప్పడు మాత్రం...
అనుదీప్‌కి పుస్తకాలు చదవడం అలవాటు. నా క్వాలిఫికేషన్‌ ఇంటర్‌. కాని కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. అలా నా చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, చిన్నయసూరి నీతికథలు.. అన్నిటినీ రాత్రి పిల్లలకు చెప్పేదాన్ని. అట్లా బుక్‌రీడింగ్‌ మీద అనుదీప్‌కి ఇంట్రెస్ట్‌ పెరిగింది. ఇవ్వాళ సివిల్స్‌ సక్సెస్‌కు అదీ ఒక రీజన్‌ అనుకుంటాన్నేను. ఇంజనీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడే క్యాంపస్‌ సెలక్షన్‌లో ఒరాకిల్‌లో జాబ్‌ వచ్చింది. అప్పుడు మాత్రం అనుకున్నాం.. వీడు ఉద్యోగంలో చేరకుండా సివిల్స్‌కి ప్రిపేర్‌ అయితే బాగుండు అని. అట్లా అనుకున్నామో లేదో తెల్లవారే ఫోన్‌ చేశాడు. ‘అమ్మా.. జాబ్‌లో చేరను. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతా’ అని. ‘నీ ఇష్టం నాన్నా...’ అన్నాం. ఇంజనీరింగ్‌ ఫోర్త్‌ ఇయర్‌లో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్‌ తీసుకున్నాడు. ఫస్ట్‌ ఎటెంప్ట్‌లో రాలేదు. సెకండ్‌ ఎటెంప్ట్‌కి ఐఆర్‌ఎస్‌లో వచ్చింది. మేం హ్యాపీగానే ఉన్నాం. కాని వాడికే శాటిస్‌ఫాక్షన్‌ లేకుండింది. మళ్లీ ప్రిపేర్‌ అయ్యాడు. థర్డ్‌ ఎటెంప్ట్‌లో రాలేదు. పోనీలే నాన్నా.. వదిలెయ్‌ అన్నా వినలేదు. ‘లేదమ్మా.. నా గోల్‌ అది’ అంటూ మళ్లీ ఫోర్త్‌ టైమ్‌ రాశాడు. అప్పుడూ రాలేదు. అయినా ఊరుకోలేదు. అయిదోసారి.. ఇట్లా ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకొని మాకూ సర్‌ప్రైజే ఇచ్చాడు. 

సమస్యలు తెలుసు...
వాళ్ల నాన్న ఇంజనీర్‌ కదా. మా ఇంటికెప్పుడూ రైతులు వçస్తుండేవారు పొలంలో కరెంట్‌ సమస్యలతోని. వాళ్లు వాళ్ల ప్రాబ్లమ్స్‌ మావారితో చెప్పుకుంటుంటే మావారు వాళ్లకు సలహాలిస్తుంటే అనుదీప్‌ వెళ్లి వాళ్ల నాన్న పక్కన కూర్చుని అన్నీ వినేవాడు. రైతులు వెళ్లిపోయాక  తనకొచ్చిన డౌట్స్‌ అన్నీ వాళ్ల నాన్నను అడిగి తెలుసుకునేవాడు. అట్లా చిన్నప్పటినుంచే వాడికి రైతుల ప్రాబ్లమ్స్, ఊళ్లో పరిస్థితుల గురించి తెలుసు. అవన్నీ వాడికిప్పుడు హెల్ప్‌ అవుతాయనే అనుకుంటున్నా. అనుదీప్‌ చాలా సెన్సిటివ్‌. పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. ఆడవాళ్లంటే కూడా చాలా రెస్పెక్ట్‌. ఎవరినీ నొప్పించడు. అయినా వాడి నుంచి నేను కోరుకునేది ఒకటే. వాడి లైఫ్‌ ఇప్పుడు స్టార్ట్‌ అయింది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి పొజిషన్‌కు వెళ్లొచ్చు. ఎప్పుడు ఎక్కడ.. ఏ పొజిషన్‌లో ఉన్నా అందరినీ రెస్పెక్ట్‌ చేయాలి. ప్రాబ్లమ్స్‌తో తన దగ్గరకు వచ్చిన వాళ్ల పట్ల భేదభావం చూపొద్దు. డబ్బున్నవాళ్లపట్ల, లేని వాళ్ల పట్ల ఎలాంటి తారతమ్యాలు చూపొద్దు అని. ఇదే మాట చెప్తాను వాడికెప్పుడూ. నా పిల్లల మీద నాకు చాలా నమ్మకం. తోటివాళ్లకు సహాయపడేలా ఉంటారని. 

తొలి జీతంతో కానుక
అనుదీప్‌ ఫోర్త్‌టైమ్‌ సివిల్స్‌ రాశాక మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. నాకు, వాళ్ల నాన్నకు ఢిల్లీకి టికెట్స్‌ బుక్‌ చేశాడు. ఫోన్లో ఆ విషయం చెప్పేవరకు మాకు తెలీదు. ‘అమ్మా.. నీ కోసమే ప్లాన్‌చేశా ఇది. నువ్వెప్పుడూ ఇల్లూ పని అంటూ కదలనే కదలవు. అందుకే ఈ సర్‌ప్రైజ్‌’ అని చెప్పాడు. ఆగ్రా తీసుకెళ్లాడు. తాజ్‌మహల్‌ చూపించాడు. నిజానికి దానికన్నా కూడా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ వాడు ఐఏఎస్‌ కావడం. వాడి కలను నెరవేర్చుకోవడం. ఇందులో నేను వాడికి  చేసిన హెల్ప్‌ ఏమీ లేదు. అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్‌లా ఉన్నా. అన్నీ షేర్‌ చేసుకుంటాడు. అనుదీప్‌లో నాకు బాగా నచ్చేది ఈగో లేకపోవడం. వాడు మంచి పెయింటర్‌ కూడా. ఐఆర్‌ఎస్‌గా జాయిన్‌ అయ్యాక వచ్చిన ఫస్ట్‌ శాలరీతో నాకు పట్టుచీర కొన్నాడు. సెల్‌ ఫోన్‌ కొనిచ్చాడు. ఇప్పుడు మేమెక్కడ కనపడినా అనుదీప్‌ వాళ్ల మదర్‌ కదా.. అని నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది. మదర్‌గా ఇంతకన్నా ప్రైడ్‌ ఏముంటుంది నాకు? 

– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement