చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం | Govt aim at womens welfare | Sakshi
Sakshi News home page

చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం

Published Thu, Feb 8 2024 5:33 AM | Last Updated on Thu, Feb 8 2024 3:28 PM

Govt aim at womens welfare - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది.

ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది.  – సాక్షి, అమరావతి

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.  ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

మహిళా సాధికారత కోసం..
రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురో­గతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభు­త్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడు­తున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు.

అంతేకాకుండా అభివృద్ధి కార్య­క్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహి­ళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్‌ – చైల్డ్‌ బేస్డ్‌ బడ్జెట్‌లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం.

ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. 

టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు..
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది.

సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం.

జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్‌ యాప్, దిశ పెట్రోల్‌ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement