సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది.
భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.
♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది.
♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్‌ల (సీఓఆర్‌ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది.
♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి.
♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి.
1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం.
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట..
♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం.
♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం.
♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్‌కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్‌లు, హోమ్‌గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment