AP Budget 2021: జన సాధికార బడ్జెట్‌ | AP BUDGET 2021 | Sakshi
Sakshi News home page

AP Budget 2021: జన సాధికార బడ్జెట్‌

Published Fri, May 21 2021 4:21 AM | Last Updated on Fri, May 21 2021 10:32 AM

AP BUDGET 2021 - Sakshi

బడ్జెట్‌ ప్రతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

మహిళలు ముందడుగు వేయాలి. స్వతంత్రంగా తలెత్తుకుని బతకాలి!!. 
అన్నదాతకు విత్తు నుంచి ఎరువుల వరకూ అన్నీ ఊళ్లోనే ఇవ్వాలి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. పంట దెబ్బతింటే బీమాతో ఆదుకోవాలి!!. 
నిరుపేదకు సుస్తీ చేస్తే  డబ్బుల్లేక వైద్యం దొరకదనే భయం ఉండకూడదు. ప్రభుత్వ వైద్యంతో పాటు తనకు కార్పొరేట్‌ వైద్యమూ ఉచితంగానే అందాలి!!.  
చదువే సమాజాన్ని నడిపిస్తుంది. బుద్ధి వికసించే ప్రీ స్కూలు నుంచి... కెరీర్‌ను నిర్ణయించే గ్రాడ్యుయేషన్‌ వరకూ విద్యార్థులకు వెన్నంటి ఉండాలి!.వాళ్లను వ్యవస్థకు దిక్సూచీలుగా మార్చాలి!!.  
ఇవే కాదు!. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలకు సైతం తగిన విధంగా చేయూతనివ్వాలి.  

మొత్తంగా చూస్తే గురువారం నాటి రాష్ట్ర బడ్జెట్లో కనిపించింది ఈ జన సాధికారతే!. అన్ని వర్గాలనూ ఆర్థికంగా స్వతంత్రులను చేయటం... గౌరవంగా బతుకు బండి లాగించేలా చూడటం. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం... అంతటి వయసూ లేకపోయినా జన సాధికారతకు మాత్రం సీఎం వైఎస్‌ జగన్‌ తిరుగులేని బాట వేశారు. 

అభివృద్ధి అంటే నాలుగు భవనాలు నిర్మించటం కాదని... నిన్నటి కంటే నేడు బాగుండటం... రేపు మరింత బాగుంటుందన్న భరోసా కల్పించటమేనని చెప్పిన సీఎం... దాన్ని ఆచరణలో చూపించారు. మహిళల సమానత్వాన్ని చేతల్లో చూపిస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్రాత్మక అడుగేశారు. వరసగా రెండో ఏడాదీ కోవిడ్‌ అన్ని రంగాలనూ దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా... నవరత్నాలు గానీ, నూతనంగా అమల్లోకి తెచ్చిన పథకాలకు గానీ ఎక్కడా ఇబ్బం ది లేకుండా తగిన కేటాయింపులు చేస్తూ ఏకంగా రూ.2,29,779 కోట్లతో బడ్జెట్‌ను సమర్పించింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని ముఖ్యాంశాలు... 

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధే లక్ష్యంగా 2021–2022 బడ్జెట్‌ను రూ.2,29,779.27 కోట్లతో రూపొందించింది. తొలిసారిగా జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను తీసుకు వచ్చి సమాజంలో సగం ఉన్న మహిళలకు, పిల్లలకూ ప్రత్యేక కేటాయింపులు చేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, కాపుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. విద్య, వైద్య రంగానికి అగ్రతాంబూలం ఇస్తూ.. కోవిడ్‌ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీ పడకుండా ముందుకు అడుగులు వేసింది. కోవిడ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో గురువారం ఒక్క రోజే బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగిపోయింది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా, మాట తప్పని నేతగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను ఈ బడ్జెట్‌ ప్రతిబింబించింది.

ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపించాయి. తొలి సారిగా మైనారిటీ యాక్షన్‌ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేస్తూనే వ్యవసాయం, విద్య, వైద్య, సాగునీటి మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన çహామీల్లో 95 శాతం పైగా నవరత్నాల పథకాల క్యాలెండర్‌ అమలుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్‌ ప్రతిపాదనలు చేశారు.

బడ్జెట్‌లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు ఏ ఏ వర్గాలకు ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా వివరించారు. కోవిడ్‌–19 వల్ల కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఏ పథకాన్ని విస్మరించకుండా, నిధుల్లో కోత పెట్టకుండానే విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. 2021–22 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. నవరత్నాల్లో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీకి తగినన్ని నిధులు కేటాయించారు.

మహిళలు, పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీలకు ప్రత్యేక కేటాయింపులు
తొలి సారిగా జండర్‌ బడ్జెట్‌ పేరుతో మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.47,283.21 కోట్లు కేటాయించారు. పిల్లలు, చిన్నారుల అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.16,748.47 కోట్లు కేటాయించారు. చేతి వృత్తుల వారికి ఇచ్చిన మాట మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్‌లో కొత్తగా మైనారిటీలకు యాక్షన్‌ ప్లాన్‌ పేరుతో రూ.3,840.72 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. బీసీ ఉప ప్రణాళికకు 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్‌లో 32 శాతం అధికంగా రూ.28,237.65 కోట్లు కేటాయించారు.

ఎస్సీ ఉప ప్రణాళికకు గత బడ్జెట్‌తో పోల్చితే ఈ బడ్జెడ్‌లో 22 శాతం అధికంగా రూ.17,403.14 కోట్లు కేటాయించారు. ఎస్టీ ఉప ప్రణాళికలో గత బడ్జెట్‌ కన్నా ఈ బడ్జెట్‌లో 27 శాతం అధికంగా రూ.6,131.24 కోట్లు కేటాయించారు. కాపుల సంక్షేమం కోసం గత బడ్జెట్‌ కన్నా ఈ బడ్జెట్‌లో 7 శాతం అధికంగా రూ.3,306 కోట్లు కేటాయించారు. 

అన్ని వర్గాలకు బాసట 
ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లు, అర్చకులకు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, ఫాస్టర్లకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. పేద వర్గాలకు వైఎస్సార్‌ బీమా వర్తింప చేసేందుకు నిధులు కేటయించారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో ఏకంగా రూ.17,000 కోట్లు కేటాయించారు. 

వ్యవసాయానికి ప్రాధాన్యం
ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం చేసేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద రూ.7,200 కోట్లు కేటాయించారు. వివిధ పథకాల ద్వారా రైతులపై వరాల జల్లు కురిపించారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలకు, ఉచింగా బోర్లు వేయడానికి, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, పంటల బీమా ప్రీమియంకు బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు చేశారు. 

విద్యా రంగానికి బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రూ.24,624.22 కోట్లు కేటాయించారు. ఇందులో మన బడి నాడు–నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు రూ.3,500 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తూ రూ.13,830.44 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు నాడు–నేడు కింద రూ.1,535.88 కోట్లు కేటాయించారు. 

జలయజ్ఞం, గృహ నిర్మాణానికి ప్రాముఖ్యత
పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా గృహ నిర్మాణ రంగానికి బడ్జెట్‌లో రూ.5,661.57 కోట్లు కేటాయింపులు చేశారు. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.13,237 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి రూ.6,438 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంకు రూ.2,881 కోట్లు కేటాయించారు. 

ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తంకు కేటాయింపులు
పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు, ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం కింద రూ.500 కోట్లు కేటాయించారు. 

మొత్తం బడ్జెట్‌ రూ.2,29,779.27 కోట్లు
మొత్తం రూ.2,29,779.27 కోట్లతో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,82,196.54 కోట్లు ఉంటుంది. రుణాల చెల్లింపులతో కలిపి కేపిటల్‌ వ్యయం రూ.47,582.73 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం రూ.1,77,196.48 కోట్లు కాగా,  కేంద్ర పన్నుల్లో వాటా రూ.26,935.32 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.57,930.62 కోట్లు వస్తాయని మంత్రి తెలిపారు. రెవెన్యూ లోటు రూ.5000.05 కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.37,029.79 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement