
చదువుకునే బిడ్డలకు గట్టి చేయూతనిచ్చారు.. ఆడబిడ్డలకు గూడు కట్టించారు.. రాజకీయాల్లో నాయకురాళ్లుగా నలుగురినీ నడిపించేందుకు పదవులిచ్చి పెద్దపీట వేశారు.. సమాజంలో మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలిచారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాలు అందించారు.
నవరత్న కాంతుల్లో మహిళా లోకం నవశకం నాంది పలికింది. ఆయన పాలనలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలతో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ముందుకుసాగారు. మహిళాభివృద్ధి ద్వారానే కుటుంబ అభివృద్ధి జరుగుతుందనే గట్టి విశ్వాసంతో వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలైన అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. – సాక్షి, అమరావతి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీలను కురిపించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ అమలుచేసిన మహిళా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించిన చంద్రబాబు కనీసం తాను ఇచ్చిన హామీలనూ పట్టించుకోవడం లేదు. సూపర్ సిక్స్ అమలుకే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరమైతే గత నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రూ.7,282 కోట్లే ఇచ్చి రూ.865 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
ఈ ఏడాది (2025–26) బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు రూ.17,179 కోట్లు మాత్రమే కేటాయించగా ఎంత ఖర్చు చేస్తారనేది అనుమానమే. ప్రధానంగా తల్లికి వందనం, ఉచిత బస్సు, ఆడబిడ్డ సంక్షేమ నిధి వంటి అనేక పథకాల అమలులో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
ప్రధాన హామీల అమలులో వైఫల్యం ఇలా..
ఆడబిడ్డ నిధి దగా: 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున (ఏడాదికి రూ.18వేలు) ఇస్తామన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని 1.80 కోట్ల మందికి రూ.32,400 కోట్లు కేటాయించాలి. రెండేళ్లకు రూ.64,800 కోట్లు కావాలి. కానీ, గత ఏడాది, ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఆడబిడ్డలను దగా చేశారు.
ఉచిత బస్సు.. తుస్సు: మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,500 కోట్లవుతుంది. నిరుడు, ఈ ఏడాది కలిపి బడ్జెట్‌లో రూ.7 వేల కోట్లు ఎగరగొట్టడంతో ఉచిత బస్సు తుస్సు అనిపించారు.
తల్లికి వందనంలోనూ వంచనే: పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గత బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.5,386 కోట్లు కేటాయింపులు చేసినా రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో ఆ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు చూపారు. బడ్జెట్ డాక్యుమెంట్‌లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌లో మాత్రం రూ.8278 కోట్లు కేటాయించినట్లు మాత్రమే ఉంది. 1 నుంచి 12వ తరగతి రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు చదువుతున్నారు. వారికి రూ.15 వేల చొప్పున ఆ పథకానికి రూ.13,112 కోట్లు కేటాయించాలి.
విద్యా దీవెనను భ్రష్టు పట్టించేలా: విద్యా దీవెన పథకానికి రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, చంద్రబాబు గత ఏడాది రూ.700 కోట్లే కేటాయించారు. విద్యా దీవెన, వసతి దీవెనకు ఈ ఏడాది మరో రూ.3,900 కోట్లు కావాలి. ఇచ్చింది రూ.2,600 కోట్లు మాత్రమే.
దీపం సాయం..అంతా గ్యాస్: రాష్ట్రంలోని 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు కోసం రూ.4 వేల కోట్లు అవుతుంది. నిరుడు కేవలం రూ.865 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,439 కోట్లే కేటాయించింది.
సున్నా వడ్డీ రుణాలు సున్నానేనా: డ్వాక్రా సంఘాలకు రూ.పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. దీనికోసం గత బడ్జెట్‌లో రూ.950 కోట్లు కేటాయించినా రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రూ.వంద కోట్లే కేటాయించారు.
50ఏళ్లకే పెన్షన్.. ఒట్టిదే: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చారు. మరో 20 లక్షల మందికి నెలకు రూ.4 వేల చొప్పున అందించాలంటే ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. రెండు బడ్జెట్లలోనూ కేటాయింపులు చేయకపోవడంతో 50 ఏళ్లకే పెన్షన్ ఒట్టిదేనా? అని మహిళలు మండిపడుతున్నారు. ఇవే కాకుండా నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలకు మొండిచేయే. ఇక పింఛన్ల కోత సరేసరి.


Comments
Please login to add a commentAdd a comment