8.18 లక్షల పింఛన్‌దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు
తొలి విడతలో పక్షవాతం, కండరాల జబ్బులతో కదల్లేని వారికి పరీక్షలు
ఇంటికే వచ్చి పరీక్షలు చేయనున్న వైద్య బృందం
ఆ సమయానికి ఇంట్లో లేకపోతే పింఛను నిలిచిపోయినట్టే.. మలి విడతలో ఇతర రోగులు, దివ్యాంగులకు ఆస్పత్రుల్లో పరీక్షలు
నిర్ణిత తేదీలో పరీక్షలకు హాజరుకాకపోతే అనర్హత వేటే.. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి పింఛన్లలో కోతలకు రకరకాల యత్నాలు
సాక్షి, అమరావతి: పింఛన్‌దారుల(pensioners) పట్ల చంద్రబాబు ప్రభుత్వం(chandrababu government) కనికరం చూపడంలేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పింఛను రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దివ్యాంగులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారినీ వదలడంలేదు. అంగ వైకల్యం(Disabled), వివిధ రకాల వ్యాధులకు గురై పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పింఛన్‌దారుల అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పింఛను పొందుతున్న 24,091 మందినీ పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు ఇచ్చన మార్గదర్శకాలూ కఠినంగా ఉన్నాయి.
నిర్ణీత సమయానికి వారికి పరీక్ష జరగకపోతే పింఛను రద్దయినట్లే. పక్షవాతం, కండరాల వ్యాధులతో బాధ పడుతున్న వారిని వైద్య బృందాలు ఇంటికి వెళ్లి పరీక్షించాలని ఆదేశించింది. ప్రభుత్వ వైద్యులు ఇంటికి వచ్చిన సమయంలో వీరు అందుబాటులో లేకపోతే పింఛను రద్దయినట్లే. దివ్యాంగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 7.95 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన తేదీన వైద్యుల కమిటీల ముందు పునః పరీక్షలు చేయించుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. వీరు నిర్ణీత తేదీన వైద్యుల బృందం ముందు హాజరు కాకపోతే పింఛను నిలిపివేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మెమో జారీ చేశారు.
నేటి నుంచే తొలి దశ పరీక్షలు
తొలి దశలో శనివారం నుంచే పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత తరహా వ్యాధులతో బాధపడుతూ పింఛన్లు తీసుకుంటున్న 24,091 మందికి ఇంటింటికీ వెళ్లి అర్హత పరీక్షలు చేస్తారు. ఇందు కోసం 112 వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఎముకల డాక్టర్, జనరల్ మెడిసిన్, లబ్ధిదారుని ఏరియా స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. 88 రోజుల పాటు తొలి దశ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన 7.95 లక్షలమంది దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, ఇతర రోగాల కారణంగా పింఛన్ పొందుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల వద్ద కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్షల నిర్వహణకు కమిటీలు
⇒ ఈ పరీక్షల నిర్వహణకు ప్రతి జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఆర్‌డీఏ పీడీ కన్వీనర్‌గా 11 మంది జిల్లా స్థాయి అ«ధికారులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లా కమిటీలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా లబ్ధిదారుల వైద్య పరీక్షలకు షెడ్యూల్ రూపొందిస్తాయి.
⇒ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని పింఛనుదారులకు ఏ తేదీలో పరీక్షలు చేయాలో నిర్ణయించి, ఆ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ముందుగా లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తారు. వైద్య బృందం ఇంటికి వెళ్లినప్పుడు పక్షవాతం లేదా కండరాల వ్యాధితో పింఛను పొందుతున్న లబ్ధిదారు లేకపోతే పింఛను నిలిపివేస్తారు. అదేవిధంగా దివ్యాంగులు, ఇతర వ్యాధుల పింఛనుదారులు నిర్ణయించిన తేదీకి నిర్ణీత వైద్య బృందం ఎదుట హాజరు కాకపోయినా తని పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
⇒ ఒక్కొ వైద్య బృందం రోజుకు 25 మంది పింఛనుదారులకు అర్హత– అనర్హతల పరిశీలనతో పాటు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టారు. లబ్ధిదారునికి గతంలో పింఛను పొందేందుకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కాకుండా కొత్త వారి ద్వారా ఇప్పుడు పరీక్షలు చేస్తారు.
⇒ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. వైద్య బృందాలు పరీక్షలు చేసే పింఛన్‌దారులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. పునఃసమీక్షలో నిర్ధారించిన వాటిలో కనీసం 5 శాతం లబ్ధిదారులను కలెక్టర్లు సోషల్ ఆడిట్ చేయడానికి అదనంగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment