వారి త్యాగం అపూర్వం.. మరి రాజకీయమో? | Solipeta Ramalinga Reddy Writes Guest Columns On Pulwama Terror Attack | Sakshi
Sakshi News home page

వారి త్యాగం అపూర్వం.. మరి రాజకీయమో?

Published Thu, Mar 14 2019 2:58 AM | Last Updated on Thu, Mar 14 2019 2:58 AM

Solipeta Ramalinga Reddy Writes Guest Columns On Pulwama Terror Attack - Sakshi

పుల్వామా దాడి ఉగ్రవాద ఉన్మాదం. ఇటువంటి రాక్షస చర్యలు  భారతీయ సైన్యం, భరత ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి. వాస్తవాధీన రేఖ దాటివెళ్లి ఉగ్ర శిబిరా లను మట్టుబెట్టిన వాయుసేనను చూసి దేశం గర్వి స్తోంది. త్రివిధ దళాలకు యావత్తు దేశం సెల్యూట్‌ చేస్తోంది. రక్షణ దళాల త్యాగాల మీద, అసమాన శౌర్య సాహసాల మీద ఎటువంటి మచ్చ లేదు. ఉన్న దల్లా  ఓ విషాదం అలుముకున్న వేళ.. కాశ్మీర్‌ చుట్టూ అల్లుకున్న వివాదాస్పద రాజకీయాల గురించే చర్చ.  కాశ్మీర్‌ అశాంతి ఇప్పటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే అలుముకుంది. దానికిౖ వెపు  పాకిస్తాన్‌ ఉగ్రవాదం, మరో వైపు స్వార్థపూరిత రాజ కీయ పార్టీల వైఖరి తోడయింది. కాశ్మీర్‌ చిన్న రాష్ట్రమే, భారత చిత్రపటంలో హిమాలయాల్లోకి విసి రేసినట్టున్న ఒక  మంచు రాష్ట్రమే... కానీ దేశ రాజకీ యాలను వేగంగాప్రభావితం చేయగల రాష్ట్రం అది.

దేశం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. మళ్లీ కాశ్మీర్‌ అల్లకల్లోలమే ముందుకొచ్చింది. మోదీకి మరో రాజకీయ అవకాశం దొరికింది. హిందుత్వ ఎజెండాతో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో మత హింసను పురిగొ ల్పింది. కషాయపు భావజాలాన్ని వ్యతిరేకించిన వారిపై గోవధ పేరుతో మూక దాడులకు పాల్పడ్డది. మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల మీద దేశ ద్రోహం కేసులు మోపి జైల్లో పెట్టింది. హిందూమతోద్ధారకుణ్ణి నేనే, సనాతన ధర్మ వ్యాప్తి అంతా తన భుజస్కంధాలపైనే ఉందన్నట్లు  ఫోజు కొట్టే మోదీ, అమిత్‌ షాలు జమ్మూకశ్మీర్, పొరుగు దేశం పాక్‌లోని హిందువుల గురించి ఎందుకు పట్టిం చుకోలేదన్నది ఆశ్చర్యం కలిగించే ప్రశ్న.

పాక్‌లో హిందూ మహిళల దుస్థితి దారుణంగా ఉంది. భారత్‌ నుంచి పాక్‌ విడివడిన నాటి నుంచి అక్కడ హిందూ మహిళలపై అకృత్యాలు జరుగు తూనే ఉన్నాయి. పాక్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేవు. హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్‌ బానిసలుగా బతుకీడుస్తున్నారు. అక్కడ హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఏ కారణంగా నైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటా కూడా అతని భార్యకు దక్కదు. కనీసం అక్కడి హిందువులకు పాక్‌ ప్రభుత్వం అందజేసే ’నేషనల్‌ డేటా బేస్‌ రెగ్యులేషన్‌ అథారిటీ’ గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా లేదు. పాక్‌–భారత్‌  దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగాయి,  జరు గుతున్నాయి. ఈ చర్చల్లో  రాజకీయ ఎజెండా తప్ప, పాక్‌లోని హిందువుల రక్షణ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరుపలేదు? 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015  డిసెంబర్‌ 25న తన రష్యా, ఆప్ఘనిస్థాన్‌ పర్యటన ముగించుకొని న్యూఢిల్లీకి వస్తూ.. మార్గమధ్యంలో ఉన్నట్టుండి లాహోర్‌లో ల్యాండైపోయారు. మోదీ ఆకస్మికంగా లాహోర్‌లో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్‌లో జిందాల్‌ గ్రూపు నకు చెందిన సజ్జన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఒత్తిడి మేరకే ఆయన పాకిస్తాన్‌ వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులతో కలిపి ‘ఛాయ్‌ పే చర్చ’ పెట్టటం మోదీకి అలవాటు. హిందుత్వ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చిన మోదీ∙పాక్‌ వెళ్లినప్పుడు అక్కడి హిందూవులను ఎందుకు కలవలేకపోయారు? అక్కడ వారికి జరుగు తున్న అన్యాయాలను ఎందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? ఆయన పాక్‌లో అడుగు పెట్టేటప్పటికే ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక చర్చలపై ప్రతిష్టంభనతోపాటు.. సరిహద్దుల్లో పాక్‌ రేంజర్లు య«థేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు.

దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. మోదీ పాక్‌ వెళ్లి, నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కలిసినప్పుడు కశ్మీర్‌ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. 2014 నుంచి 2019 వరకు కశ్మీర్‌ రక్షణలో దాదాపు 900 మంది సైనికులు అశువులు బాశారు. 1999లో జరిగిన  కార్గిల్‌ యుద్ధంలో అధి కారిక లెక్కల ప్రకారం 527 మంది సైనికులు చని పోయారు. 1,363 మంది గాయపడ్డారు. ఒకరు యుద్ధ ఖైదీగా చిక్కారు. మళ్లీ యుద్ధం వస్తే ఎంత మంది వీరుల ప్రాణాలను తింటుందో తెలియదు. సైనికుడు అంటే యుద్ధంలో ప్రాణాలు అర్పించే మర మనుషులు కాదు. వాళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఓ కుటుంబం ఉంది. ఏడాదికి ఓ మారైనా వారి కుటుంబం ఆత్మీయ కౌగిలి కోరుకుంటుంది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ అంశాన్ని అధి కార పీఠాన్నిచ్చే అక్షయ పాత్రగా చూడకుండా ఓ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి.

వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
మొబైల్‌:  94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement