గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు,పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకునేది బావనే. పులికి ఆదివాసులకి ఇదే బంధుత్వం. ఫారెస్టు అధికారులతో సహా నాగరికులు అంతా పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజనులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. ఆడపులి, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అనుబంధం. గిరిజనుల జీవన చర్యలు జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. అడవుల నుంచి వారిని తరిమేస్తున్నారు.
ఆటవిక తెగలు, ఆధునిక ప్రపంచం రెండు వేర్వేరు సహజాతాలు. అడవిలో పుట్టి పెరిగారు. జంగల్ వాళ్లది. జల్, జమీన్ వాళ్లది. అటవీ సరిహద్దులు అనేవి రాష్ట్రాలకు, పాలకులకే గానీ, ఈ విభజన రేఖలు ఆదివాసులకు ఏమి తెలుసు. గ్లోబలైజేషన్ మీదపడి అడవిని విధ్వంసం చేస్తుంటే...మనుగడ కోసం గిరిజనం తావు దొరికిన చోటికి వెళ్లిపోతోంది. అది వారికి ప్రకృతే చూపించిన మార్గం. వెంటపడి తరుముతున్న ప్రపంచీకరణ విధ్వంసాన్ని నిలవరించి ఆదివాసులకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేసి అపురూప మానవ జాతులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా మూలవాసు లను నిలవరించాలనుకోవటం దుర్మార్గం.
పర్యావరణ సమతూకానికి, అటవీ ఆవరణ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అవసరమే. పులి పెరిగిన చోట తప్పనిసరిగా జంతు జీవజాల సమతుల్యత ఉంటుంది. పులులు సహజంగా పుట్టి పెరిగే చోట అభయారణ్యాలను అభివృద్ధి చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఫారెస్టు అధికారులు పదేపదే గిరిజన గూడేల మీద దాడులకు తెగబడు తున్న కవ్వాల్ పులుల అభయారణ్యం వాస్తవంగా పులుల శాశ్వత ఆవాసానికి అస్సలు అనుకూలం కాదు అనే వాదనలు చాలాకాలంగా వినవస్తున్నప్ప టికీ.. గడిచిన ఐదేళ్ల నుంచి అటవీ శాఖ ఈ అభయా రణ్యం నిర్వహణకు రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఇదిగో పులి, అదిగో పులి అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తోంది.
కానీ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో శాశ్వత ఆవాసం కలిగిన ఒక్క పులిని కూడా అటవీ అధికా రులు చూపెట్టలేకపోయారు. ఎండాకాలంలో మహా రాష్ట్రలోని తాడోభా అడవుల నుంచి వలస వచ్చి పోయే పులులను సీసీ కెమెరాల్లో బంధించి ఇదే మన పులి అని చెప్పుకుంటున్నారు. ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవటానికే అటవీ అధికారులు అన్యా యంగా ఆదివాసుల మీద పడుతున్నారు. అభయార ణ్యంలో మనుషులు సంచారం చేస్తున్నందువల్లే పులులు రావటం లేదనే శాస్త్రీయత ఏమాత్రం లేని వాదనను ముందుపెడుతున్నారు. నాగరిక మను షుల సంచారం, అటవిలో ఆదివాసుల జీవనం... రెండింటినీ ఒకే గాటున ముడిపెట్టి చూపిస్తున్నారు.
ఆదివాసీ సంస్కృతి, జీవన విధానం విభిన్న మైనది. ఆటవిక సమాజంలో బావతోనే బంధుత్వం ఎక్కువ. గిరిజనుల ఇంటిలో మనువు, పురుడు, పుణ్యం, కార్యం ఏదైనా తొలిబొట్టు పెట్టి పిలుచుకు నేది బావనే. పులికి ఆదివాసులది ఇదే బంధుత్వం. నాగరికులు అంతా (ఫారెస్టు అధికారులతో కలిపి) పులిని క్రూర మృగంగా చూస్తే.. ఆదివాసులు మాత్రం పులిని ‘బావా’ అని సంబోధిస్తారు. గిరిజ నులు బావకు ఇచ్చే మర్యాద పులికి ఇస్తారన్న మాట. ఆదివాసుల దైనందిన చేతల్లోనూ ఇదే కనిపిస్తుంది. తమ నివాసాల పరిధిలో సంచరించే పులి గుణం తెలుసుకొని మసులుకుంటారు. గాండ్రించే పులిని ‘కోపగొండి’ అని, మందకొడి చలనం ఉన్న పులిని ‘పెంటిది’, వయసు మళ్లిన పులిని ‘ముసలి బావ’ ఇలా సంబోధిస్తారు. పెంటిది, ముసలి బావ పులుల ఆవాసాల్లోకి దాదాపుగా ఆదివాసులు వేటకు వెళ్లరు. అవి తిని రేపటి కోసం దాచుకున్న జంతు మాంసపు భాగాలను తీసుకోరు. అది పులులకు ఆదివాసులకు మధ్య ఉన్న అవినాభావ అనుబంధం.
వేసవి కాలం మినహా మిగిలిన రెండు కాలాల్లో (వర్షాకాలం, చలికాలం) ఐదు గంటలకే అడవిలో సూర్యాస్తమయం అవుతుంది. అదే సమయంలో వన్య జీవరాశులు తావుల్లోంచి బయటికి వస్తాయి. చీకటి పడటానికంటే ముందే గిరిజనులు గుడిసెకు చేరుకుంటారు. ఏడు గంటల వరకు వంటావార్పు, భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిద్రలోకి జారు కుంటారు. రాత్రంతా వన్యప్రాణులు ఆడవిలో స్వేచ్ఛా ఆహార ఆన్వేషణ చేస్తాయి. మళ్లీ సూర్యో దయం వేళకు గుహలు, పొదల్లోకి వెళ్లిపోతాయి. తిరిగి ఆదివాసుల దిన చర్య మొదలవుతుంది. అటవీ ఆవరణ వ్యవస్థలో గిరిజనుల జీవన చర్యలు ఎక్కడ కూడా జంతుజాల జీవనచక్రంలో జోక్యం చేసుకోవు. ప్రకృతే వాళ్ల మధ్య ఆ విధమైన సర్దుబాటు చేసింది. ఇవేమీ పట్టకుండా అటవీ అధికారులు ఆగి, అదను చూసి ఆదివాసుల మీద పడుతున్నారు. ఆదివాసుల సాంస్కృతిక మూలాల విధ్వంసంతో మొదలైన ఈ దాడి వాళ్ల జీవనాన్ని, జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. వాళ్ల కాలి కింది నేల, జీవితాన్నిచ్చిన ప్రకృతి ఇప్పుడు పరాయిది అయిపోయింది. ఆదివాసులు అంటేనే నిత్య అనుమానితులుగా, పూర్తి అభద్రత జాతిగా మార్చేశారు.
గత ఏడాది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలంచ గూడెం మీద పోలీసులు, ఫారెస్టు అధికారులు విరుచుకుపడ్డారు. మహిళల చీరలు లాగి, పసిపిల్లలను చెట్లకు కట్టే శారు. పురుషులను వన్యప్రాణి కంటే ఘోరంగా వేటాడినట్టు వెంటపడి కొట్టారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫారెస్టు శాఖ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది తిరగక ముందే తాజాగా కొమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కోలాంగొంది గూడెంపై పాశవిక దాడులకు తెగ బడ్డారు. మనం మనుషులుగా పుట్టినందుకు సాటి మనుషుల పట్ల కనీసం చూపాల్సిన కనికరం లేకుండా వారిని బంధించి వేంపల్లి కలప డిపోలో కుక్కిన తీరు జుగుప్సాకరం. ‘2005 డిసెంబర్ 13 తరువాత తిరస్కరణకు గురైన దరఖాస్తుదా రులందరినీ అడవి నుంచి వెళ్లగొట్టాలని సుప్రీంకోర్టు తీర్పుకు’ లోబడే తాము ఆదివాసులను బయటికి పంపిస్తున్నామని సమర్ధించుకోవటానికి చూడటం నీతిమాలిన చర్య.
సుప్రీంకోర్టు తీర్పు మీద పునఃస మీక్ష జరగాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రక్షిత అడ వులైనా, రిజర్వు అడవులైనా అందులో నివసించే గిరిజనులకు హక్కులు కల్పించాలి. పోడు భూము లకు పట్టాలు ఇవ్వాల్సిందేనని గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రికి గాని, స్థానిక కలెక్టర్‌కు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారికి కానీ ఏ మాత్రం సమాచారం లేకుండా ఫారెస్టు అధికారులు ఏకపక్ష నిర్ణయంతో, గిరిజన గూడాల మీద పడి దాడులు చేయటం చట్టాలను ఉల్లంఘించటమే. దీనికి అటవీ శాఖ ప్రధాన సంరక్ష ణాధికారి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంది.
వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
సెల్ : 94403 80141
Comments
Please login to add a commentAdd a comment