
గోండి, కొలామి భాషల రక్షణకు కృషి
గోండి భాషలోకి మహాభారతం అనువాదం
గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ ఘనత
మన్‌కీ బాత్‌లో ప్రశంసించిన ప్రధాని మోదీ
ఆదిలాబాద్ టౌన్: ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు పయనిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా యాంకర్‌ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు.
గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ సేవల గురించి ఇటీవల మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించటం గమనార్హం.
మట్టిలోని మాణిక్యం
కైలాస్ 1 నుంచి 10వ తరగతి వరకు వాఘాపూర్ సర్కారు బడిలో చదివాడు. ఉట్నూర్‌లోని లాల్‌టేక్డి రెసిడెన్షియల్‌లో ఇంటర్, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్‌ట్రెయిన్డ్ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు పిల్లలు గంగోత్రి, సృజన్‌రామ్ ఉన్నారు.
గాదిగూడ మండలంలోని డొంగర్‌గావ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసి, ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్‌లో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు.
గోండి భాషలోకి మహాభారతం
ఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్ అనువదించాడు. ‘సుంగల్‌తూర్పో (ఇలవేల్పు), తొడసం బండు (ఇంటి దేవత), నైతం మారుబాయి (అమ్మమ్మ), తొడసం నేలేంజ్ (తమ్ముని కూతురు)’పేరిట ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో వందకు పైగా పాటలు రచించి, వాటిని సైతం ఏఐ యాంకర్‌తో పాడించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
గిరిజనులను చైతన్యపర్చాలని..
గిరిజనులను చదువు వైపు మళ్లించడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నా. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్ ద్వారా గోండి, కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. – తొడసం కైలాస్, ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment