రాజకీయం అంటే వైరుధ్య భావాలుంటాయి. విభిన్న సిద్ధాంతాలు ఉంటాయి. ఇవేమి గిట్టని నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం తీరు నాకెప్పుడు ఆసక్తికరంగానే కనిపిస్తుంది. నక్సలైటుగా నాపై టాడా కేసులు మోపి జైల్లో పెట్టిన నాటి నుంచి, ఏపీ సీఎం హోదాలో ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయేవరకు బాబు నడక, నడత ప్రతీదీ ఆశ్చర్యమే. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా క్షేత్రం లోకి రావాల్సిందే. యుద్ధం చేయాల్సిందే. కానీ మారీ చుని తీరుగా చంద్రబాబు జుగప్సాకరమై రాజకీయ రాక్షస క్రీడ ఉత్సుకత గొల్పుతూనే ఉంటుంది. బాబు ఏలుబడిలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు చచ్చుబడిపోయి పోలీసుస్వామిక వ్యవస్థ వేయి మదపుటేనుగుల బలాన్ని పుంజుకుంది. ఆయన పాలనలో హక్కులకోసం గొంతెత్తకూడదు. ఆత్మగౌరవం కోసం రోడెక్కకూ డదు. అరాచకాలను నిలదీయకూడదు. రాజ్యాంగాన్ని ప్రశ్నించొద్దు. నిలబడితే లాఠీలు లేస్తాయి. నినదిస్తే ఆడబిడ్డలపైనా గుర్రాలు పరుగెత్తుతాయి. నిలదీస్తే నయీంలు, నల్లదండు ముఠాలు పుట్టుకొస్తాయి.
చట్టాలను ఏమార్చటం, పోలీసు అధికారులను వశంచేసుకొని వాళ్లకింత చలిగంజి పోసి గుంజకు కట్టేయటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అప్పట్లో మావోయిస్టు గెరిల్లాలతో నేరుగా తలపడలేక నల్లదండు, బ్లాక్ కోబ్రా పేరుతో నరహంతక ముఠాలను సృష్టించి, బాబే ఆ ముఠా నాయకుడు అయ్యాడు. నయీం, శేషన్న లాంటి కిరాతకులను చేరదీసి అరాచకాలకు ఒడిగట్టాడు. 1999–2003 వరకు హైదరా బాద్ నగరం చుట్టుపక్కల నయీం నేరాలు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అతడికి సీఏం కార్యాలయంతోనే సంబంధాలు ఉండేవి. పోలీసులు ఉన్నతాధికారులు, చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు అండ ఉండేది.
చంద్రబాబు నాయుడు నయీంను భూ దందాలకు వాడుకున్నారు. హైటెక్ సిటీ చుట్టు పక్కల విలు వైన భూములను బాబు సారథ్యంలోనే నయీం కబ్జా పెట్టాడు. ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ వ్యవహారం సాగేది. మాదాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో అమాయక ప్రజలను బెదిరించి నుంచి వేల ఎకరాల భూములను లాక్కున్నారు. ఈ భూ కబ్జాలతోనే రూ. వందల కోట్లు సంపాదించి, వాటిని బినామీ సంస్థల్లో పెట్టు బడులుగా పెట్టి అధికారం బలంతో ఇవాళ రూ. లక్షల కోట్లకు అధిపతి అయ్యారు.
చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు తల్లి అమ్మణ్ణమ్మ. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పాలు అమ్ముకొని జీవనం చేస్తారని చంద్రబాబు నాయుడే చాలాసార్లు చెప్పుకున్నారు. పాలు అమ్ముకునే పెద్దావిడ 2000 సంవత్సరంలో రూ. 40 లక్షలు పెట్టి హైదరాబాద్‌లోని మదీనాగూడలో 5 ఎకరాల భూమిని, బంజారాహిల్స్ రూ. 35 లక్షలతో మరో భవనాన్ని కొనుగోలు చేశారు. సరే ఆమె రెక్కల కష్టంతోనే కొన్నారు అనుకుందాం. మన సాంప్రదాయంలో వారసత్వ భూములు ఎవరికి చెందుతాయి? ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి చెందు తాయి కదా? కానీ ఆస్తులు కొనుగోలు చేసిన మరుసటి ఏడాదికే అమ్మణ్ణమ్మ తన చిన్నకొడుకు పిల్లలను వదిలేసి, బాబు కొడుకు లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చింది. అదే మదీనా గూడలో బాబు భార్య భువ నేశ్వరికి కూడా 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఎలా కొన్నారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. నయీం మధ్యవర్తిత్వం చేసి ఆ భూములను బాబు కుటుంబానికి ఇచ్చాడని అప్పట్లో బహిరంగంగానే ప్రజల్లో చర్చ జరిగింది. ఇట్లా వేల ఎకరాలు నల్లదండు ముఠా చేతుల్లోకి వెళ్లిపోయాయి.
రూ. లక్షల కోట్లు అడ్డంగా సంపాదించిన చంద్రబాబు నల్లడబ్బుతో ఓటుకు కోట్లుతో తెలంగాణ లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణను అస్థిర పరచాలనే కుయుక్తి పన్నారు. ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేస్తున్న తన సామా జిక వర్గానికే చెందిన పోలీసు అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పెట్టుకున్నారు. ఆయన రాష్ట్ర శాంతి భద్రతలను గాలికి వదిలేసి టీడీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తయారయ్యారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముకు ప్రాణహాని పొంచి ఉన్నా.. ఆయనకు పట్టింపు ఉండదు, ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరిగే వరకు వీళ్లకు తెలియదు. కానీ అదే ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తోందో సర్వే చేస్తారు.
ఆ రిపోర్టు చంద్రబాబుకు ఇచ్చి ఏ పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుని మీద హత్యాయత్నం జరినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ, తెలుగుదేశం నేతలకే కళ్లు బైర్లు కమ్మేలా హత్యాయత్నం జరిగిన 30 నిమిషాల్లో ప్రెస్‌మీట్ పెట్టి అది ప్రచారం కోసం చేసిన పని అని ప్రకటించటం దుర్మార్గం కాదా? ఇటువంటి అధికారుల మీద నమ్మకం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించగలదా? తెలుగుదేశం జెండాలను ఒంటి నిండా కప్పుకొని విచ్చలవిడిగా తిరుగాడుతున్న అధికారులను ఈసీ పక్కనపెడితే అది ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రని ఆరోపణలు చేసే బాబు అనైతిక రాజకీయ క్రీడను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది.
వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
మొబైల్ : 94403 80141
నల్లదండు నాయకుడు
Published Thu, Apr 11 2019 2:23 AM | Last Updated on Thu, Apr 11 2019 2:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment