ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ఆయనకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది.
ఆత్మహత్యలకు మానసిక నిపుణులు ఎన్నో కారణాలు చెబుతున్నారు. పరిస్థితులతో ఇమడలేకపోవడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘట నలు, మూర్తిమత్వలోపాలు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం, కొన్ని సంఘటనలు జరుగుతాయని ఊహించుకుని భయపడటం, అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు కారణమవుతాయట. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు వీటికి అతీతుడు కాలేకపోయారు. పరిస్థితులు ఒక్కసారిగా చిక్కుముళ్లుగా పడి ఉరితాళ్లై చుట్టుముట్టినప్పుడు చావును వెతుక్కున్నారు. అట్లాగని కోడెల పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఫ్యాక్షన్ రాజకీయాలతో పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, వ్యక్తిగత, కుల, రాజకీయ, వృత్తి అస్తిత్వంతో తన ఉనికిని నిలబెట్టుకుంటున్న క్రియాశీలక నేత. అటు వంటి నాయకుని మరణానికి ఎవరు బాధ్యులు? అతను ఎంత మనోవేదన అనుభవించి ఉంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం అవు తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కోడెల మరణం దేశ రాజకీయాల్లో నిజంగానే ఒక కేస్ స్టడీగా తీసుకొని పరిశోధన చేయాల్సిన అంశమే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా పరమైన దూకుడు పెంచారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారని, రివర్స్ టెండర్ల ప్రక్రియకు వెళ్తామని చెప్పి.. చేసి చూపించారు. ఇది నిరూపితమైంది కూడా. అట్లాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్‌ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. అతను, అతని కుటుంబంపై మొత్తం ఇరవై మూడు కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఆయనను మానసికంగా కుంగదీసే ఉంటుంది. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి.
ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టలేం. ఇందులో దాగి ఉన్న రాజకీయ కోణాన్ని కూడా విస్మరించలేం. ఎట్లా అయితేనేమి కోడెల చట్టబద్దంగా బోనులో ఇరుక్కున్నారు.ఇటువంటి సమయంలో అండగా నిలవా ల్సింది చంద్రబాబే. మంచో చెడో పార్టీ పెద్దగా చంద్రబాబు కోడెల భుజం తట్టి ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆ పని చేయలేదు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న చంద్రబాబు చుట్టూ అవినీతి ఆరోపణలు, నోటుకు కోట్లు తదితర కేసులు ముసురుకుంటున్నాయి. ఈ కేసుల నుంచి ఆయనను రక్షించటంతో పాటు మరణం అంచున ఉన్న టీడీపీకి జీవ గంజి పోయటానికి ఎవరో ఒకరు బలిపీఠం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ బలిపీఠం తానే ఎక్కుతానని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వాగ్దానం చేశారు. ‘తాను ఆత్మహత్య చేసుకొని చంద్రబాబును రక్షించుకుంటా’ అని శపథం చేశారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛి కమే. ఆత్మహత్యను వైద్య పరిభాషలో ‘క్రైఫర్ హెల్ప్’గా పరిగణిస్తా రట. ఏదైనా సహాయం కోసం అర్థించినపుడు ఎవరూ సహాయం అందజేయకపోతే చివరి పరిష్కారంగా ఆత్మహత్యను ఎంచుకోవడం జరుగుతుంది. కోడెలకు సరిగ్గా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆయ నకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఒక సారి నాదెండ్ల భాస్కర్‌రావు, మరోసారి పిల్లనిచ్చిన సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో వంచనకు గురి అయ్యారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ టెక్సాస్‌లో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్‌రావు గద్దె మీద కూర్చొని నేనే సీఎం అన్నాడు. అప్పుడు ఎంతో గుండె నిబ్బరాన్ని, రాజకీయ పరిణతిని చూపించిన ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. తిరిగి రామారావు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడిన ఎన్టీఆర్ తనవాడు అనుకున్న, సొంత అల్లుడు చేసిన ఘాతుకానికి తట్టుకోలేకపోయారు. నలుగురికి చెప్పుకోలేక లోలోపల మదనపడి గుండె పగిలి మరణించారు.
తాజాగా కోడెల పరిస్థితి కూడా ఇదే. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి అతనేమీ అనుకూలతను ఆశించి ఉండరు. కానీ అనుకూల వర్గం నుంచి ఒక బలమైన రక్షణ కవచాన్ని కోరుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంతానికి వాడుకున్నాడనే అవమాన భారమే కోడెల ఉసురు తీసిందని టీడీపీ నేతల ఆరోపణ. కానీ ఆయన గతంలో ఇంతకన్నా దారుణమైన అవమానాలను అనుభవించారు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ వచ్చినప్పుడు బాధితుల కోసమని బియ్యం సేకరించి వాటిని అమ్ముకున్నా రనే ఆరోపణలు కోడెలపై వచ్చాయి. ఇటువంటి అమానవీయ ఆరో పణలు ధైర్యంగా ఎదుర్కొన్న కోడెలకు అసెంబ్లీ ఫర్నిచర్ ఆరోపణ ఒక లెక్కా.
ఇరవై రోజుల క్రితం మాత్రలు మింగి తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మొదటి ఆత్మహత్య ప్రయత్నం సంద ర్భంలోనే అధినేతగా చంద్రబాబు నేరుగా కోడెల ఇంటికి వెళ్లి ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి, మూడు నెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఆయనలో అభద్రతా భావాన్ని పెంచారు. సంక్లిష్ట సమయంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు చేసిన నమ్మకద్రోహమే కోడెల మనసు విరిచి ‘అసహజ’ నిర్ణయానికి దారితీసింది. కోడెల మరణాన్ని, అంతిమ యాత్రను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ యాత్రగా మలిచారు. కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు భోరున విలపిస్తుండగా, కొందరు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటే చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో నడవటం అత్యంత జుగుప్సాకరంగా అనిపించింది. దేశంలో అంతరిస్తున్న రాజకీయ విలువలకు కోడెల ఆసహజ మరణం ఒక కేస్ స్టడీ కావాలి. అధికార పీఠంపై యావ తప్ప ఒక లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి నాయకత్వం ఎంత ప్రమాదకరమో భావితరం తెలుసుకోవాలి.
సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దులు కమిటీ చైర్మన్ ‘ 94403 80141
Comments
Please login to add a commentAdd a comment