ఏమిటీ కాలుష్యం?
♦ వ్యర్థాలు ఎక్కడేస్తున్నారు?
♦ 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి
♦ ‘సాక్షి’ కథనాలే ఎజెండా
♦ అంచనా పద్దుల కమిటీ సమీక్షలో పీసీబీపై సోలిపేట ఫైర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమపై పంజా విసురుతున్న కాలుష్య సమస్యపై రాష్ట్ర శాసనసభ అంచనా పద్దుల ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఫైర్ అయ్యారు. పటాన్‌చెరు, హత్నూర, చేగుంట పల్లెలను కాలుష్యం కబలిస్తోందని, జనం మీదికి విష వాయువులను, వ్యర్థ రసాయనాలను పల్లెలపైకి వదిలేస్తున్న కంపెనీల తీరుపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన తెలంగాణ రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించారు. ఈపీటీఎల్‌కు తరలించి శుద్ధి చేయాల్సిన రసాయన వ్యర్థాలను పాశమైలారం, రుద్రారం, చేగుంట, హత్నూర ప్రాంతాల్లోని పరిశ్రమల యాజమాన్యాలు అడ్డగోలుగా చెరువులు, కుంటల్లో వేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు.
గురువారం రామలింగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ శాసనసభ సమావేశ మందిరంలో అంచనా పద్దుల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. పటాన్‌చెరు కాలుష్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపధ్యంలో రామలింగారెడ్డి.. కాలుష్యాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్లు తెలిసింది. పరిశ్రమల నుంచి రోజుకు ఎంత రసాయనిక వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటినేం చేస్తున్నారు? ఈపీటీఎల్‌లో (రసాయనిక వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్) ఎన్ని వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న పీసీబీ నివేదికలకు వాస్తవాంశాలకు పొంతన ఉందా? అంటూ ఆయన పీసీబీ అధికారులను నిలదీసినట్టు తెలిసింది. పాశమైలారంలో రాత్రి 10 తరువాత ఫార్మా కంపెనీలు పొగను వదిలేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కాలుష్యంపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించినట్లు తెలిసింది.