Pollution problem
-
ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం
బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్ ప్రైసింగ్), కార్‌పూలింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని తెలిపింది. -
ఏమిటీ కాలుష్యం?
♦ వ్యర్థాలు ఎక్కడేస్తున్నారు? ♦ 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి ♦ ‘సాక్షి’ కథనాలే ఎజెండా ♦ అంచనా పద్దుల కమిటీ సమీక్షలో పీసీబీపై సోలిపేట ఫైర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమపై పంజా విసురుతున్న కాలుష్య సమస్యపై రాష్ట్ర శాసనసభ అంచనా పద్దుల ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఫైర్ అయ్యారు. పటాన్చెరు, హత్నూర, చేగుంట పల్లెలను కాలుష్యం కబలిస్తోందని, జనం మీదికి విష వాయువులను, వ్యర్థ రసాయనాలను పల్లెలపైకి వదిలేస్తున్న కంపెనీల తీరుపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన తెలంగాణ రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించారు. ఈపీటీఎల్‌కు తరలించి శుద్ధి చేయాల్సిన రసాయన వ్యర్థాలను పాశమైలారం, రుద్రారం, చేగుంట, హత్నూర ప్రాంతాల్లోని పరిశ్రమల యాజమాన్యాలు అడ్డగోలుగా చెరువులు, కుంటల్లో వేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు. గురువారం రామలింగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ శాసనసభ సమావేశ మందిరంలో అంచనా పద్దుల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. పటాన్చెరు కాలుష్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపధ్యంలో రామలింగారెడ్డి.. కాలుష్యాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్లు తెలిసింది. పరిశ్రమల నుంచి రోజుకు ఎంత రసాయనిక వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటినేం చేస్తున్నారు? ఈపీటీఎల్‌లో (రసాయనిక వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్) ఎన్ని వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న పీసీబీ నివేదికలకు వాస్తవాంశాలకు పొంతన ఉందా? అంటూ ఆయన పీసీబీ అధికారులను నిలదీసినట్టు తెలిసింది. పాశమైలారంలో రాత్రి 10 తరువాత ఫార్మా కంపెనీలు పొగను వదిలేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కాలుష్యంపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌ను ఆదేశించినట్లు తెలిసింది.