సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి | Solipeta Ramalinga Reddy Elected Assembly Estimates Committee Chairman | Sakshi
Sakshi News home page

సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి

Published Mon, Sep 23 2019 8:37 AM | Last Updated on Mon, Sep 23 2019 8:37 AM

Solipeta Ramalinga Reddy Elected Assembly Estimates Committee Chairman - Sakshi

సాక్షి, దుబ్బాక: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌ గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. ఆదివారం శాసనసభ సమావేశాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డిని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

రెండోసారి చైర్మన్‌ గా.. 
రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ గా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి అంచనాల కమిటీ చైర్మన్‌ గా ఎన్నికైన రామలింగారెడ్డి అసెంబ్లీ రద్దయ్యేంతవరకు ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ రెండో సారి రామలింగారెడ్డిని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా.. నమ్మిన బంటుగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు. ఆయనపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్‌ తాను విద్యాబుద్ధులు నేర్చుకొని ఇంతటి స్థాయికి చేరుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన దుబ్బాక టికెట్‌ను (అప్పటి దొమ్మాట) రామలింగారెడ్డికి టీఆర్‌ఎస్‌ నుంచి 2004 కేటాయించడంతో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 బై ఎలక్షన్‌లో సైతం విజయం సాధించారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా .. 
సోలిపేట రామలింగారెడ్డి మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో, 2008 బై ఎలక్షన్‌ లో దొమ్మట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో నాలుగోసారి 65 వేల పై చిలుకు మెజార్టీతో రాష్ట్రంలోనే మెజార్టీలో 6వ స్థానంలో నిలిచారు.

నక్సలైట్‌..జర్నలిస్టు నుంచి అంచనాల కమిటీ వరకు... 
సోలిపేట రామలింగారెడ్డి ప్రస్థానం మొదట నక్సలైట్‌ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. తాను దుబ్బాక జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే వామపక్ష ఉద్యమాల ప్రభావం రామలింగారెడ్డిపై తీవ్రంగా పడింది. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిట్టాపూర్‌లో పోలీస్‌పటేల్‌ ఏ లోటు లేని కుటుంబం. అయినప్పటికినీ అప్పటి రోజుల్లో గ్రామాల్లో పేదలపై భూస్వాముల అరాచకాలు ఆయనపై తీవ్రప్రభావం చూపింది. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో మొదట్లో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం జనశక్తి అనుంబంధంతో మొదలుకాగా కొద్దిరోజుల్లోనే పీపుల్స్‌వార్‌ అనుబంధ సంస్థ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ)లో చేరారు.

ఆ క్రమంలోనే పీపుల్స్‌వార్‌ రాష్ట్ర నాయకులు శాఖమూరి అప్పారావుతో పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయిలో ఉద్యమం వైపు నడిపించింది.ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో పోరాటాల్లో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆయనపై కక్ష గట్టిన పోలీసులు దేశంలోనే మొట్టమొదటి టాడాకేసు జర్నలిస్టుగా ఉన్న రామలింగారెడ్డిపై పెట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు పెద్దెత్తున ఉద్యమించడంతో టాడాకేసును రద్దుచేశారు. జర్నలిస్టుగా, రచయితగా ఆర్‌ఎల్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్‌ పేరుతో రచనలు, కవితలు రాశారు. 2001 టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలో క్రీయాశీల పాత్ర పోషించారు.

ఉద్యమంలో వందకు పైగా కేసులు.. 
తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కేసులు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పైనే నమోదయ్యాయి. వందకు పైగా కేసులతో చాలా రోజులు జైలులో, కోర్టుల చుట్టూ తిరగారు. రాష్ట్రంలోనే ఉద్యమంలో ప్రతి సంఘటనలోను రామలింగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామలింగారెడ్డి బయోడేటా 
పేరు: సోలిపేట రామలింగారెడ్డి 
పుట్టినతేది: 02 అక్టోబర్‌ 1962 
పుట్టిన స్థలం: చిట్టాపూర్, దుబ్బాక మండలం. 
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి. 
విద్యార్హతలు: డిగ్రీ 
భార్య: సుజాత 
పిల్లలు: కుమారుడు సతీష్‌రెడ్డి, కూతురు ఉదయశ్రీ. 
రాజకీయ ప్రస్థానం: చదువుకొనే రోజుల్లో పీపుల్స్‌వార్‌ గ్రూపుతో సంబంధాలు, జర్నలిస్టుగా 2 దశాబ్ధాలకు పైగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement