రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా? | Solipeta Ramalinga Reddy Article On Central Govt Policies Against Communists Leaders | Sakshi
Sakshi News home page

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా?

Published Sun, Feb 17 2019 1:24 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

Solipeta Ramalinga Reddy Article On Central Govt Policies Against Communists Leaders - Sakshi

రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూడదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. ఈ క్రమంలోనే 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబ, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫరేరా, అంబేడ్కర్‌ మనవడు ఆనంద్‌ తేల్‌తుంబ్డేలు రాజద్రోహులయ్యారు. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైళ్లో బంధించే  హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ రాజ్య హింసకు అంగీకార ముద్ర వేసే ధోరణి బలపడుతోంది.

దేశంలో, రాష్ట్రలో ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా.. ప్రజల్లో సానుభూతి పవ నాలు తగ్గినట్లు అనిపిం చినా.. పాలకులపై హత్యా యత్నం కుట్రలు బయట కొస్తుంటాయి. నిఘా వర్గాలు చెమటోర్చి కుట్రను పసిగట్టి ‘అత్యవసరం’గా బయట పెడుతూనే  ఉంటాయి. ఇది రాజ్యం అల్లిన విషవలయం. ఆధిపత్య అస్తిత్వాల పాలనలో ఈ వృత్తం పునరావృతమవుతూనే ఉంటుంది. రాజ్యా ధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ‘రాజ్యం’ లో వివిధ రూపాల్లో హింస రచన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగమే ఇలాంటి కుట్రకోణాలు. వరవరరావుతోపాటు హక్కుల ఉద్యమకారులపై మోపిన రాజద్రోహం ఎన్నికల అంకగణితంలో ఓట్ల లెక్కను సాధించే ఓ అధ్యాయం మాత్రమే. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేసేందుకు పాకిస్తాన్‌ సహాయంతో కుట్ర పన్నుతున్నారని గుండెలు బాదుకుంటూ  మొత్తుకుని ఓట్లు, సీట్లు సంపాదించిన మోదీ.. వేగంగా పడిపోతున్న తన పొలిటికల్‌ గ్రాఫ్‌ను నిల బెట్టుకోవటానికి మరో హత్యాయత్నంను తెర మీదకు తెచ్చారు. ప్రధానిని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణే పోలీసులు ఆరోపించటం, హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్‌ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్‌ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్‌ గోంజాల్వెస్, అరుణ్‌ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర  కేసులు పెట్టి, నెలనెల తరబడి వాళ్లను జైల్లో బంధించి  ప్రజల్లో ఓ  మిధ్యా సానుభూతి వలయాన్ని పరిచి రాజ్యాధికారం సుస్థిరపరుచుకునే ప్రయత్నమే.

రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూ డదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. అట్లానే కాళ్లు చేతులు చచ్చుబడి పోయి, 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబ, దాదాపు వృద్ధాప్యం అంచుల్లో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫరేరా, అంబేడ్కర్‌ మన వడు ఆనంద్‌ తేల్‌తుంబ్డేలు రాజద్రోహులు అయ్యారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమా యకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ. రాజ్యహింసకు అంగీకార ముద్రవేసే ధోరణి బలపడుతోంది. 

బ్యాంకులను లూటీ చేసి రూ కోట్లకు కోట్లు కొల్లగొట్టి దేశంలో కృత్రిమ ఆర్థిక సంక్షోభాన్ని  సృష్టించే ఆర్థిక నేరగాళ్లు మాత్రం దేశ ద్రోహులు కాదు. దేశీయ బ్యాంకుల  నుంచి రూ వేల కోట్ల దబ్బును దర్జాగా విదేశాలకు పట్టుకుని పోతుంటే ఏ చట్టం కూడా వాళ్లకు అడ్డు రాదు. బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు తమ చెమట, రక్తమాంసా లను రూపాయిగా మలిచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వైట్‌ కాలర్‌ దొంగలు ఎత్తుకుపోతుంటే రాజ్యం కళ్లు మూసుకుంటోంది. 

నీరవ్‌ మోదీ అనే వ్యాపారి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ. 11,360 కోట్లు, నీలేష్‌ ఫరేఖ్‌ రూ. 2,500 కోట్లు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేంతవరకు రాజ్యా నికి తెలియదు. విజయ్‌ మాల్యా బ్యాంకులకు రూ. 9,500 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాక కానీ మనకు ఆ విషయం తెలియదు. రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి కట్టలేకపోతే రెవెన్యూ రిక వరి(ఆర్‌ఆర్‌ యాక్ట్‌) కింద ఆస్తులు జప్తు చేస్తారు. ఆçస్తులు జప్తు చేయటాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలమంది ఉన్నారు. కానీ వీళ్ల మెడలు వంచి పొరుగు దేశాల నుంచి పట్టుకొని వచ్చి తిన్నది కక్కేయటానికి మన రాజ్యాంగంలో చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఏమీ ఉండవు.  

దేశంలో కుట్ర కేసులు కొత్తేమీ కాదు. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో ‘సికింద్రాబాద్‌ కుట్ర కేసు’  పెట్టారు. 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు. 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. నాటి నక్సలైట్‌ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వర వరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్‌ కోర్టు సికింద్రాబాద్‌ కుట్ర కేసులో అంద రినీ నిర్దోషులుగా ప్రకటించింది.

1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ  రాంనగర్‌ కుట్ర కేసు పెట్టారు. కొండ పల్లి సీతారామయ్య వంటి నక్సల్స్‌ నేతలు, వరవర రావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కేఎస్‌పై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో  వరవరరావు, సూరిశెట్టి సుధా కర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 

2005లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005లో మే 30న నిజా మాబాదులో అరెస్ట్‌ చేశారు. ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. 2010 ఆగస్ట్‌ 2న నిజామాబాద్‌ అడిషనల్‌ సెషన్స్‌జడ్జి ఆ కేసును కొట్టేశారు. 2004లో చంద్రబాబు ప్రభు త్వం కృత్రిమ లేఖ లతో నా మీద కూడా టాడా కేసు పెట్టింది. అభియోగం తప్పు అని కోర్టులు అంతిమ తీర్పులు ఇచ్చాయి. నిజమే..! కానీ కృత్రిమ లేఖ లతో, ఊహా త్మక అభియోగాలతో అక్రమంగా చార్జిషీట్‌ మోపిన పాలకులు, పోలీసుల మీద చర్యలు ఏవి? రాజ్యాంగంలో అటువంటి చట్ట సవరణ ఎందుకు తీసుకురావటం లేదు? కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోవాలి. పరిపాలన చివరి దశలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని హక్కుల ఉద్యమ కారులపై పెట్టిన రాజద్రోహం కేసు లను  ఉపసంహరించుకోవాలి.

వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే
 
సెల్‌ : 94403 80141

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement