
మా ఊర్లో చెట్ల పండుగ..మీరంతా రండి
♦ జిల్లా గీత కార్మికులకు సోలిపేట రామలింగారెడ్డి ఆహ్వానం
♦ చిట్టాపూర్‌లో 16న ‘సాక్షి’ ఆధ్వర్యంలో హరితహారం
♦ ఏకకాలంలో 5 వేల ఈత మొక్కలునాటే కార్యక్రమం
♦ ముఖ్యఅతిథులుగా హరీశ్‌రావు, పద్మారావు
దుబ్బాక: ‘మా ఊరు చిట్టాపూర్‌లో పండుగ చేస్తున్నాం.. ఈ నెల 16న ఊరు ఊరంతా కలిసి చెట్లు నాటుతున్నాం. ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హరితహారంలో అందరం చేయి చేయి కలుపుదాం. కల్లు గీత కష్టసుఖాలు, ఈత వనాల పెంపకంపై మాటముచ్చట పెడదాం. గీత కార్మిక సోదరులూ.. కదిలిరండి’ అని శాసనసభ అంచనా పద్దుల చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పలువురు గీతకార్మిక నేతలకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో సాక్షి ఆధ్యర్యం హరితహారం కార్యక్రమం చేపడుతున్నామని, 5 ఎకరాలకు పైగా గౌడ సొసైటీ భూమి, చెరువు శిఖం భూముల్లో దాదాపు 5 వేల ఈత మొక్కలను నాటుతున్నట్లు చెప్పారు. ఉద్యమంలా చేపడుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు, ఉన్నతస్థాయి అధికారులు పాల్గొంటారని వివరించారు. జిల్లా నలుమూలల నుంచి గీత కార్మిక సోదరులు భారీఎత్తున తరలిరావాలని రామలింగారెడ్డి కోరారు.