సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు.
సోలిపేట రామలింగరెడ్డి మృతి పట్ల టీఆర్‌ఎస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘తెలంగాణ ఉద్యమ సహచరుడు, జర్నలిస్టు, ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం నన్ను కలచివేసింది. వారి మృతి తెలంగాణకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు’ అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరు. వారు జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు’ అంటూ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు.
‘దుబ్బాక శాసనసభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్న..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
‘తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడు’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రామలింగారెడ్డి, రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.
‘తెలంగాణ ఉద్యమ సహచరుడు,ఎమ్మెల్యే, శాసనసభ అంచనాలు,పద్దుల కమిటీ చైర్మన్ శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.వారు ప్రజా జీవితంలో చేసిన సేవలు మరువ లేనివి.సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడు. జర్నలిస్టుగా,ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించారు.రామలింగారెడ్డి లేరనేది ప్రజలకు తీరని లోటు.వారి మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సానుభూతి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment