ఎరువులే రైతు గుదిబండలు | fertilizers are were clogging to Farmers | Sakshi
Sakshi News home page

ఎరువులే రైతు గుదిబండలు

Published Thu, Apr 20 2017 1:11 AM | Last Updated on Mon, Oct 22 2018 8:47 PM

ఎరువులే రైతు గుదిబండలు - Sakshi

ఎరువులే రైతు గుదిబండలు

అభిప్రాయం

పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లు.. ఈ మూడింటి భారం దించిన రోజున సేద్యం దండగ కాదు పండగే అవుతుంది.

వ్యవసాయం బతుకు దెరువు మాత్రమే కాదు. అది పల్లె జీవన విధానం. మట్టి మనుషుల సంస్కృతి. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయం వాటా 16 శాతం మాత్రమే కానీ దేశ జనాభాలో 53 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం పండగ కావాలంటే  పంటల ఉత్పాదకతలో మెరుగుదల ఉంటాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు లాభాలను చూడగలిగి తేనే రైతు బతుకుతాడు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా వ్యవసాయం ఆశాజనకంగాలేదు. దాదాపు 17  రాష్ట్రాల్లో రైతు వార్షిక ఆదాయం రూ 20 వేలే ఉంది. అంటే నెలకు రూ. 1,666లు అన్నమాట.

ఇలాగైతే వ్యవసాయం బతకటం చాలా కష్టం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీ యంగా తగ్గుతోంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో 60 శాతం ఉండగా.. 2011–12 కు వచ్చే సరికి 49 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో 3 కోట్లమంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలేశారు. 2019–20 నాటికి మరో 2.5 కోట్ల మంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలిపెట్టవచ్చని అంచనా. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే పంట ఉత్పత్తిలో మెరుగుదల ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు, లాభాలు చూడగలిగితే రైతు బతుకుతాడు.

దేశంలో ఏ ప్రాంతం, రాష్ట్రం కేసి చూసినా మన పలెటూళ్లలో రైతుకు ఎరువులు, విత్తనాలే గుదిబండలు. ఎదుగుతున్న పైరుకు అదును మీద ఎరువులు వేయాలంటే  రైతు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. యూరియా కట్టకైనా, కాంప్లెక్స్‌ ఎరువుకైనా షావుకారే దిక్కు. షావుకారి దోపిడీకి మా నాయన రామకృష్ణారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దుబ్బాక మండలం  చిట్టాపూర్‌లో మాకు  ఏడు  ఎకరాలు ఉండేది.  చెరువు కింద భూమి. వరి పండేది. మా కుటుంబానికి జీవనాధారం ఆ భూమే. అప్పటికే అప్పు సప్పో చేసి  నాటు పట్టేది. ఇక మందు కట్టలు అంటే మా ఊరి షావుకారు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆయన లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేది. మందు కట్ట ధర మీద రూ 150 ఎక్కువ రాసుకునేటోడు. పంట చేతికి అందే నాటికి దానికి రూ 3 చొప్పున వడ్డీ  లెక్కకట్టేవాడు, ఇక్కడ ఇంకో షరతు ఉండేది. చేనులో పండిన  పంట మందు కట్టలు ఇచ్చిన షావుకారికే అమ్మాలి. అది కూడా మార్కెట్‌ ధరతో సంబంధం లేకుండా, ఆయన నిర్ణయించిన ధరకే. ఆ పంటను కూడా మా నాయనే  తీసుకుపోయి, సిద్దిపేట మార్కెట్‌లో అమ్మి డబ్బు తెచ్చి షావుకారు చేతిలో పెట్టే వాడు. అంత దుర్మార్గమైన దోపిడీ ఉండేది. నా యవ్వనపు తొలినాళ్లలో నక్సలిజం వైపు నా అడుగులు పడటానికి ఇలాంటి దోపిడీ ఓ కారణం. పల్లెల్లో ప్రతి రైతు పరిస్థితి ఇదే.

దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగం కాళ్లకింది పునాది కదిలిపోతున్న సందర్భంలో పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పందిరి మెట్ల మాదిరిగా పెనవేసుకొనిపోయిన కరువు, అప్పులు, ఆడబిడ్డ పెళ్లి,  చేతి వృత్తుల విధ్వంసం, చెరువుల విలుప్తం.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిళ్లే రైతు ఆత్మహత్యలకు కారణం. ఈ మూడింటి భారం దించిన రోజున వ్యవసాయం దండగ కాదు పండగే అవుతుంది. రైతన్న రాజన్న ఆయితాడు.

ఇప్పటి వరకు రాజ్య పాలన చేసిన వాళ్లెవరూ ఆ స్థాయి శోధన కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఉద్యమ నేతగా, పెద్ద రైతుగా కేసీఆర్‌ రైతు కష్టాలకు మూలాలను అన్వేషించారు. పాలకపక్ష నేతగా అన్నదాత కన్నీళ్లు తుడిచే పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కొక్క సమస్యను విడగొట్టి రైతు కష్టాలు బాపే వైపు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సమగ్ర ప్రగతికి సాగు భూమి,  చేతి వృత్తుల అభివద్ధే వెన్నెముకలని ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానని పంతం పట్టారు. రెండేళ్లలో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి మలిపేందుకు కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారు. పల్లెను మళ్లీ పచ్చగా నిలబెట్టే మహాయజ్ఞం చేపట్టారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 36 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ నాలుగు విడతల్లో 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఆ పని చేయలేక నిక్కినీల్గుతున్నవేళ.. కేసీఆర్‌ ఉచిత ఎరువుల పంపిణీ పథకం రైతన్నకు మళ్లీ వ్యవసాయంపై భరోసాను ఇచ్చింది. రాష్ట్రంలో 57 లక్షల మంది సన్నచిన్నకారు రైతుల చేతిలో 1.57 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాలుసరి 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. వాస్తవానికి  రైతులు అవగాహనా లోపంతోనే మోతాదుకు మించి  ఎరువులు వాడుతున్నారని, రాష్ట్ర రైతుల అవసరాలకు 17.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఎరువుల సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 6,300 కోట్ల భారం  పడుతుందని  అంచనా.

యూరోపియన్‌ దేశాలతో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేసియా, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, సౌత్‌ ఆఫ్రికావంటి దేశాల్లో వ్యవసాయం సబ్సిడీలపై భారీగానే ఖర్చు చేస్తున్నాయి. అయితే రైతుకు అత్యంత అవసరమైన ఎరువుల మీద ఏ దేశంలోనూ ప్రణాళికబద్ధమైన విధానాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ దేశాల సబ్సిడీ అమలుకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనున్నది.


సోలిపేట రామలింగారెడ్డి
వ్యాసకర్త టీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు,
రాష్ట్ర శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్‌
మొబైల్‌ : 94403 80141

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement