సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : చినుకమ్మ జాడ లేదు.. నేలలో చెమ్మ లేదు.. వేసిన విత్తనం వేసినట్టే ఉంది.. అక్కడక్కడా మొల కెత్తిన విత్తనాలూ ఎండకు మాడిపోతున్నాయి.. ముఖ్యంగా పత్తి పరిస్థితి దారుణంగా ఉంది! మొక్కజొన్న, పండ్లతోటలదీ అదే దుస్థితి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అందులో 10 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. అందులో దాదాపు 2 లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొక్క జొన్న సహా ఇతర వాణిజ్య పంటలు 6 లక్షల ఎకరా ల్లో సాగైనా మూడున్నర లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తకపోవడమో, మొలకెత్తినా వాడిపోవడమో జరిగింది.
నైరుతి రుతుపవనాలు మొదటి వారం మురిపించినా.. తర్వాతి రెండు వారాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ రెండు వారాలు ఎండలు వేసవిని తలపించడంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. పండ్ల తోటలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలకు నీటి కొరత ఏర్పడింది.
మొదట్లో మురిపించి..
రాష్ట్రంలో శనివారం నాటికి ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. అయితే ఇదంతా జూన్ 5–12 తేదీల మధ్యే కురిసిందే కావడం గమనార్హం. ఆ తర్వాత 10 నుంచి 12 రోజులు వేసవిని తలపించాయి. ఆదిలాబాద్‌లో సాధారణ వర్షపాతం 128.7 మి.మీ. కాగా అంతకంటే ఎక్కువగా 181.1 మి.మి. కురిసింది. అయితే ఇందులో 90 శాతం జూన్ 3–10 మధ్యే నమోదైనదే కావడం గమనార్హం. మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినా అందులో సగానికంటే ఎక్కువగా మొలకెత్తలేదు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
దీంతో రైతులు దాదాపు 65 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న ఇతర వాణిజ్య పంటలు సాగు చేశారు. కానీ ఆ తర్వాత వాన జాడ లేకపోవడంతో దాదాపు 90 శాతం విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ మొలకెత్తిన విత్తనాలు దాదాపుగా ఎండిపోయాయి. శనివారం నాటికి కరీంనగర్‌లో సాధారణ వర్షపాతం మైనస్ 23 మి.మి., రాజన్న సిరిసిల్లలో మైనస్ 52 శాతం నమోదైంది. సాధారణం కంటే 99 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైన మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పంటల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14–23 మధ్య వానల్లేక మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ పడ్డ చిరుజల్లులు పంటలకు కాస్త ఉపశమనం ఇచ్చాయని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అటు వర్షాలు.. ఇటు రైతుబంధు..
మొదట్లో మోస్తరు వర్షాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేలు ఇవ్వడం రైతుల్లో ఉత్సాహం నింపింది. చేతిలో డబ్బు ఉండటంతో మోస్తరు వర్షాలకే రైతులు పంటలు సాగు చేశారు. జూన్ 12 నాటికి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడానికి రైతుబంధు కారణమని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 3–10 మధ్య 144 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆ జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొదట్లో మోస్తరు వర్షాలు కురిసినా తర్వాత వానల్లేక దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి పరిస్థితి డోలాయమానంలో పడింది. ‘‘మొదట్లో మంచి వర్షాలతో రైతులు వెంటనే విత్తనాలు నాటారు.
భూమిలో తేమ శాతం పెరిగినప్పుడు విత్తనాలు వేస్తే 15 రోజుల పాటు వర్షాలు రాకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ మోస్తరు వర్షాలకే విత్తనాలు నాటితే భూమిలో ఉన్న వేడి అలాగే ఉండటం వల్ల విత్తనం మొలకెత్తదు. రైతులు ఈ విషయంలో రైతుల తొందరపాటు ఇబ్బందిగా మారింది’’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు విశ్లేషించారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట ప్రాంతాల్లో అప్పుడే మొలచిన పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పట్టారని, గడచిన రెండ్రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో ఇప్పుడు మొక్కలకు ఇబ్బంది ఉండదని ఆ అధికారి చెప్పారు.
వాడిపోతున్న పండ్ల తోటలు
రెండు వారాల పాటు వానల్లేకపోవడంతో పండ్ల తోటల రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగైదు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 80 శాతం బత్తాయి సాగు చేస్తున్నారు. కాయ దశలో ఉన్న బత్తాయి ఏపుగా ఎదగాలంటే ప్రస్తుతం నీరు పుష్కలంగా అందించాలి. అయితే జూన్ 10–22 మధ్య వర్షం లేకపోవడం, అంతకు ముందు మోస్తరు వర్షాలే కురవడంతో భూగర్భ జల నీటిమట్టం పడిపోయింది. బోర్లు వట్టిపోయి పండ్ల తోటలు వాడిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment