no rain
-
వానలు మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నెల కిందట ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా వానలు.. రాత్రయితే చలిపెట్టేలా గాలులు.. వారం పదిరోజులు కొనసాగిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వానల జాడే లేకుండా పోయింది. ఇదేమైనా ఎండా కాలమా అన్నట్టుగా ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. నిజానికి ఏటా నైరుతి రుతుపవనాల సీజన్లో సంతృప్తికరంగా వానలు పడేది ఆగస్టు నెలలోనే. అలాంటిది ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు, తేలికపాటి జల్లులు కురిసినా.. ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. నెలంతా పొడి వాతావరణంతోనే గడిచింది. ఇదే సమయంలో ఈ నెలలో సగటున 29.5 డిగ్రీలకుపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక వేడి ఆగస్టుగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా.. ఇలా వానలు ఆగిపోవడం, ఒక్కసారిగా భారీగా కురవడం వంటివి జరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆగస్టులో 63.34శాతం లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి నైరుతి సీజన్ తీరును పరిశీలిస్తే.. ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకుగాను.. రెండు నెలల్లో అత్యంత లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక జాప్యం, వచ్చినా సరిగా వానలు పడక జూన్ నెలలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెల రెండో వారం నుంచి వానలు ఊపందుకుని, నెలాఖరులో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆ నెలలో ఏకంగా రెండింతలు అధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత ఆగస్టు నెలకు వచ్చేసరికి వానలు జాడే లేకుండా పోయాయి. రుతు పవనాల్లో కదలిక మందగించడంతో నెలంతా పొడి వాతావరణమే ఏర్పడింది. సాధారణంగా ఆగస్టులో సగటున 21.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. కేవలం 7.97 సెంటీమీటర్లే పడింది. అంటే ఏకంగా 63.34శాతం లోటు వర్షపాతం కావడం గమనార్హం. 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువగా వానలు పడినట్టు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఈ నెలలో గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 30డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రణాళిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి. సీజన్ సగటు మాత్రం అధికమే.. మొత్తంగా నైరుతి రుతపవనాల సీజన్ పరిస్థితిని పరిశీలిస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వరకు సాధారణంగా 56.69 సెంటీమీటర్ల వర్షం కురవాలి. ఈసారి అంతకన్నా 13శాతం ఎక్కువగా 64.22 సెంటీమీటర్లు కురిసింది. ఇందులో జూన్‌లో తీవ్ర లోటు ఉండగా.. జూలై చివరినాటికి ఏకంగా 57శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వానలు కురవకపోవడంతో అధిక వర్షపాతం 13 శాతానికి పడిపోయింది. నైరుతి సీజన్లో కురవాల్సిన, కురిసిన వర్షపాతం తీరు ఇదీ.. (సెం.మీ.లలో) నెల కురవాల్సింది కురిసినది శాతం జూన్ 12.94 7.26 56.15 జూలై 22.91 48.99 213.86 ఆగస్టు 21.74 7.97 36.66 మండలాల వారీగా వర్షపాతం తీరు.. కేటగిరీ మండలాలు అత్యధికం (60% కంటే ఎక్కువ) 26 అధికం (20–59% ఎక్కువ) 236 సాధారణం (–19% నుంచి +19% వరకు) 293 లోటు (–20% నుంచి –59%) 57 జిల్లాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే... ప్రస్తుత సీజన్లో 14 జిల్లాల్లో అధికంగా, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడినట్టు అధికారులు చెప్తున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే 26 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 236 మండలాల్లో అధిక వర్షపాతం, 293 మండలాల్లో సాధారణ వర్షపాతం, 27 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు వారాలు వానల్లేక రాష్ట్రంలో డ్రైస్పెల్ నమోదైంది. జూలై తొలి రెండు వారాలు కూడా చాలాచోట్ల పొడి వాతావరణమే ఉంది. ఆగస్టు మొదటి వారం నుంచి మూడో వారం వరకు వరుసగా పొడి వాతావరణంతో డ్రైస్పెల్ నమోదైంది. చివరి వారంలో మాత్రం పలుచోట్ల తేలికపాటి వానలు పడ్డాయి. కొన్నిచోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. -
నారు ఎండుతోంది... నాట్లు వేసేందుకు భయపడుతున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్: నేలను చల్లబరిచే తొలకరి వానలు ముఖం చాటేశాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా చినుకు నేలను తాకడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించాయి. ముఖ్యంగా భూమిలో వేడి కారణంగా వరినారుకు ప్రమాదం ఏర్పడింది. బోర్ల సాయంతో నీటిని ఎంత పెట్టినా రంగుమారుతోంది. ఎదుగుదల కనిపించడం లేదు. వేర్లు, కొనలు వాడిపోయి ఎండుముఖం పడుతున్నాయి. నారు చనిపోయి చేతికిరాని ప్రాంతాల్లో మళ్లీ నార్లు పోస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను చూసి రైతులు నాట్లు వేసేందుకు భయపడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వీటికి నీరందించినా తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు ఆకులు వాడిపోతున్నాయి. పారకం చేసిన కొద్ది గంటలకే నేల పూర్తిగా పొడిబారుతోంది. ఒక్కరోజు అరుపిచ్చినా పొలంలో నెర్రలు ఏర్పడుతున్నాయి. భూమి లోపలి వేడికి విత్తనాలు సైతం ఉడికిపోయి చనిపోయితున్నాయి. అయితే, వర్షాల్లేక వ్యవసాయానికి ఏర్పడిన గడ్డు పరిస్థితులను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చేతికొచ్చిన యాసంగి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టం చేసిన వానలు, ఇప్పుడేమో సమయానికి రాకుండా దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు. దమ్ము చేసి నారు పోయడంతోనే.. నేల లోపలి భూభాగం చల్లబడాలంటే అది వర్షాలతోనే సాధ్యమవుతుంది. తొలకరి చినుకులతో నేలలో కొంత తేమశాతం కనిపిస్తే నార్లు పోయడానికి, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ, నేల పొడిగా ఉండగానే రైతులు పొలంలో కొంత భాగాన్ని దమ్ముచేసి అందులో వరినార్లు పోశారు. దీనికి తోడు వర్షాలు రాకపోవడంతో నేలలోని వేడికి నార్లు మాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దమ్ము చేయకుండా వెదజల్లే పద్ధతిలో నార్లు పోసుకోవాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో 5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 4.17 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాల లేమి కారణంగా వరిసాగు ఇప్పటి వరకు 2శాతం కూడా మించలేదు. బోధన్ డివిజన్‌లోనే నాట్లు ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న సాగు సైతం ఐదుశాతం దాటలేదు. నారు పెరుగుతలేదు మూడెకరాల కోసం బీపీటీ రకం విత్తనాలు కొని ఇరవై రోజుల క్రితం నారు పోసినం. వర్షాల్లేక ఎండల ప్రభావానికి నారు వాడిపోయి రంగుమారుతోంది. ఎంత నీళ్లు పెట్టినా ఎదగడం లేదు. వాతావరణం అనుకూలించక పసుపు, సోయా, మక్క సాగుకు సాహసించడం లేదు. – కృష్ణయాదవ్, యువరైతు, నికాల్పూర్ రోగం వస్తే మందులు కొట్టినం తొమ్మిది బస్తాల బీపీటీ విత్తనాలు చల్లినం. ఎండలకు నారుకు రోగం వచ్చింది. మొగిపురుగు ఆశించింది. వెంటనే మందులు కొట్టినం. పరిస్థితులు చూస్తేంటే నాట్లు వేయాలంటే భయంగా ఉంది. వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించాలి. – శ్రీనివాస్, రైతు, నికాల్పూర్ -
మొలకెత్తని ఆశలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : చినుకమ్మ జాడ లేదు.. నేలలో చెమ్మ లేదు.. వేసిన విత్తనం వేసినట్టే ఉంది.. అక్కడక్కడా మొల కెత్తిన విత్తనాలూ ఎండకు మాడిపోతున్నాయి.. ముఖ్యంగా పత్తి పరిస్థితి దారుణంగా ఉంది! మొక్కజొన్న, పండ్లతోటలదీ అదే దుస్థితి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అందులో 10 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. అందులో దాదాపు 2 లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొక్క జొన్న సహా ఇతర వాణిజ్య పంటలు 6 లక్షల ఎకరా ల్లో సాగైనా మూడున్నర లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తకపోవడమో, మొలకెత్తినా వాడిపోవడమో జరిగింది. నైరుతి రుతుపవనాలు మొదటి వారం మురిపించినా.. తర్వాతి రెండు వారాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ రెండు వారాలు ఎండలు వేసవిని తలపించడంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. పండ్ల తోటలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలకు నీటి కొరత ఏర్పడింది. మొదట్లో మురిపించి.. రాష్ట్రంలో శనివారం నాటికి ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. అయితే ఇదంతా జూన్ 5–12 తేదీల మధ్యే కురిసిందే కావడం గమనార్హం. ఆ తర్వాత 10 నుంచి 12 రోజులు వేసవిని తలపించాయి. ఆదిలాబాద్‌లో సాధారణ వర్షపాతం 128.7 మి.మీ. కాగా అంతకంటే ఎక్కువగా 181.1 మి.మి. కురిసింది. అయితే ఇందులో 90 శాతం జూన్ 3–10 మధ్యే నమోదైనదే కావడం గమనార్హం. మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినా అందులో సగానికంటే ఎక్కువగా మొలకెత్తలేదు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దాదాపు 65 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న ఇతర వాణిజ్య పంటలు సాగు చేశారు. కానీ ఆ తర్వాత వాన జాడ లేకపోవడంతో దాదాపు 90 శాతం విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ మొలకెత్తిన విత్తనాలు దాదాపుగా ఎండిపోయాయి. శనివారం నాటికి కరీంనగర్లో సాధారణ వర్షపాతం మైనస్ 23 మి.మి., రాజన్న సిరిసిల్లలో మైనస్ 52 శాతం నమోదైంది. సాధారణం కంటే 99 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైన మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పంటల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14–23 మధ్య వానల్లేక మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ పడ్డ చిరుజల్లులు పంటలకు కాస్త ఉపశమనం ఇచ్చాయని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అటు వర్షాలు.. ఇటు రైతుబంధు.. మొదట్లో మోస్తరు వర్షాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేలు ఇవ్వడం రైతుల్లో ఉత్సాహం నింపింది. చేతిలో డబ్బు ఉండటంతో మోస్తరు వర్షాలకే రైతులు పంటలు సాగు చేశారు. జూన్ 12 నాటికి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడానికి రైతుబంధు కారణమని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 3–10 మధ్య 144 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆ జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొదట్లో మోస్తరు వర్షాలు కురిసినా తర్వాత వానల్లేక దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి పరిస్థితి డోలాయమానంలో పడింది. ‘‘మొదట్లో మంచి వర్షాలతో రైతులు వెంటనే విత్తనాలు నాటారు. భూమిలో తేమ శాతం పెరిగినప్పుడు విత్తనాలు వేస్తే 15 రోజుల పాటు వర్షాలు రాకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ మోస్తరు వర్షాలకే విత్తనాలు నాటితే భూమిలో ఉన్న వేడి అలాగే ఉండటం వల్ల విత్తనం మొలకెత్తదు. రైతులు ఈ విషయంలో రైతుల తొందరపాటు ఇబ్బందిగా మారింది’’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు విశ్లేషించారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట ప్రాంతాల్లో అప్పుడే మొలచిన పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పట్టారని, గడచిన రెండ్రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో ఇప్పుడు మొక్కలకు ఇబ్బంది ఉండదని ఆ అధికారి చెప్పారు. వాడిపోతున్న పండ్ల తోటలు రెండు వారాల పాటు వానల్లేకపోవడంతో పండ్ల తోటల రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగైదు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 80 శాతం బత్తాయి సాగు చేస్తున్నారు. కాయ దశలో ఉన్న బత్తాయి ఏపుగా ఎదగాలంటే ప్రస్తుతం నీరు పుష్కలంగా అందించాలి. అయితే జూన్ 10–22 మధ్య వర్షం లేకపోవడం, అంతకు ముందు మోస్తరు వర్షాలే కురవడంతో భూగర్భ జల నీటిమట్టం పడిపోయింది. బోర్లు వట్టిపోయి పండ్ల తోటలు వాడిపోతున్నాయి. -
అనంతపురం జిల్లాలో నీటి కష్టాలు
-
ఏ‘కరువు’!
వరుస కరువుతో కుదేలవుతున్న వ్యవసాయం ఈ ఏడాది కరుణించని వరుణుడు ప్రభుత్వ సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు వనపర్తి: మూడేళ్లుగా వరుస కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు చేయూతనందించే వారే కరువయ్యారు. ఖరీఫ్ ఆరంభంలో మురిపించి, ఆ తర్వాత ముఖం చాటేస్తున్న వర్షాల కారణంగా ఏటా పెట్టుబడులు పెట్టడం తప్పా.. ఆశించిన మేరకు దిగుబడులు సాధించుకున్న వారే లేరు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మిన అన్నదాతపై మరోసారి కోలుకోలేని దెబ్బపడింది. వేసిన పంటల్లో ఇప్పటికే 60శాతం ఎండిపోయాయి. వనపర్తి నియోజకవర్గంలో 35రోజులుగా చుక్క వర్షం లేకపోవడంతో మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. నాడుమడులు వట్టిపోతున్నాయి. ఆగస్టులో కరుణించని వరుణుడు వర్షంపై ఆధారడి వ్యవసాయం చేసుకునే రైతులు రెండేళ్ల కరువులో చేసిన అప్పులు తీర్చుకుందామని ఎంతో ఆశతో మొదట్లో కురిసిన వర్షాలకు మొక్క, జొన్న, కంది పంటలను సాగు చేశారు. బోర్లలో కాసిన్ని నీరున్న రైతులు వర్షాలు పడకపోతాయా.. బోర్లు నిండా నీరు రాకపోతుందా అని వాతావరణ శాఖపై నమ్మకం ఉంచి వేసిన నారుమడులు ప్రస్తుతం పశుగ్రాసంగా మారిపోయాయి. ఖరీఫ్ ఆరంభంలో జూన్ మాసంలో వనపర్తి నియోజకవర్గంలో సగటు వర్షపాతం 67.8మిల్లీమీటర్లు కాగా 127.2 మి.మీ. వర్షం కురిసింది. జూలైలో 163.0మి.మీ.లకు 171.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఆగస్టులో వరుణుడు మొఖం చాటేడయంతో పంటలకు భారీ నష్టం జరిగింది. ఈ మాసంలో 143మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 41.4మి.మీ. మాత్రమే కురిసింది. 101.6మి.మీ వర్షం లోటు ఉండటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువుల్లో కనిపించని జలకళ ప్రభుత్వం భూగర్భజలాలను పెంపొందించాలని రూ.కోట్లు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసినా, వర్షం రాని కారణంగా చెరువు నేల నెర్రెలతో దర్శనమిస్తోంది. రోజుకో బోరులో నీరు అడుగంటిపోతోంది. నిండా పొట్టదశలో ఉన్న మక్కపంట ఎండిపోతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే గానీ పంట చేతికొచ్చే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోని బీమా కంపెనీలు.. వరుస కరువుతో పల్లెల్లో అన్నదాతలు అల్లాడుతున్నా.. ప్రీమియం కట్టించుకున్న బీమా కంపెనీలు రూపాయి సాయం చేయడం లేదు. పెట్టుబడితో పాటు ప్రీమియం చెల్లించేందుకు వెచ్చించిన డబ్బులు వృథా అయ్యాయనే వేదనలో రైతులున్నారు. బీమా కోసం ప్రీమియం చెల్లించిన రశీదులతో నిత్యం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. (వనపర్తి, పెబ్బేరు, గోపాల్పేట, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో ఈ ఏడాది పంటల వివరాలు హెక్టార్లలో..) పంట సాధారణ విస్తీర్ణం సాగు విస్తీర్ణం నష్టం అంచనా ఆముదం 4,527 2,195 850 కందులు 1,996 1,887 750 మొక్కజొన్న 16,524 14,196 12,000 జొన్న 2,111 1,799 850 పత్తి 3,441 868 450 వరి 11,226 4,200 2,500 ఎండిన పంటను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు వరుస కరువుతో అల్లాడుతున్న మమ్మల్ని ఆదుకునే వారే లేరా. ప్రభుత్వం రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదు. వేలకువేల పెట్టుబడులతో వ్యవసాయం చేసే బదులు అడ్డమీది కూలీగా పనికి వెళ్లినా అప్పులు, వడ్డీల బాధలు తప్పేవి. ఎండిన పంటలను చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు. – కుమ్మరి వెంకటయ్య, రైతు, చిట్యాల, వనపర్తి ఒక్క అధికారి రాలేదు.. పంటలకు బీమా వర్తించాలంటే ఇంతకంటే కరువు రావాలా? ప్రీమియం కట్టించుకునేప్పుడు ఉప కథలు చెప్పే అధికారులు, తీరా పంటలు ఎండాయంటే తిరిగి మళ్లీ చూడటం లేదు. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక్క వ్యవసాయ అధికారి కూడా పంటలను చూడటానికి ఊర్లోకి రాలేదు. – భాస్కర్, రైతు, చిట్యాల -
ఆదెరువు..ఆగం
ఆగస్టులో చినుకు రాలని వాన వేలాది ఎకరాలలో పంటలకు నష్టం అన్నదాత విలవిల జిల్లాలోని వివిధ మండలాల్లో కరువు కరాళ నత్యం చేస్తోంది.. సరైన వర్షాలు కురియక వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లింది.. వరుసగా రెండేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల నుంచి తేరుకోక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నకు, ఈసారి ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలు ఊరటనిచ్చినా ఆ తర్వాత మొహం చాటేశాయి.. దీంతో రైతులు విలవిలలాడుతున్నారు. మిడ్జిల్ : ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు మండలంలో మొక్కజొన్న 60వేల ఎకరాల్లో, పత్తి 20వేల ఎకరాల్లో, కంది ఐదు వేల ఎకరాల్లో, వరి ఇతర పంటలు మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేశారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 74మి.మీ.కుగాను 84మి.మీ. కురియడంతో రైతులు ఎంతో సంతోషించారు. జూలైలో సాధారణ వర్షపాతం 123మి.మీ.కుగాను కేవలం 20మి.మీ. మాత్రమే కురిసింది. ఆగస్టులో 113మి.మీ. కురియాల్సి ఉండగా నేటికీ చినుకు జాడలేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది 30శాతం పంట దిగుబడి రాగా, ఈసారి పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశలన్నీ..డియాసలే! నవాబుపేట : ఆరుతడి పంటలు వేసి ఈసారి అప్పులు తీర్చుకుందామనుకున్నా అన్నదాతకు ఖరీఫ్ కాస్తా షాక్ ఇచ్చింది. పంటలు వేయగానే ఏపుగా పెరగటంతో ఇక పంటలు బాగా పండుతాయనుకున్న తరుణంలో వరుణుడు కాస్తా మెహం చాటేశాడు. దీంతో రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. మండలంలో సుమారు పదివేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. వీటిలో మొక్కజొన్న 8,447హెక్టార్లు, జొన్న 548హెక్టార్లు, రాగి 34హెక్టార్లు, కంది 653హెక్టార్లలో వేశారు. చాలా చోట్ల మొక్కజొన్న ఎండిపోయింది. పంట బాగా దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.1,300 ప్రభుత్వ మద్దతు ధర ఉంటే ఎకరాకు 20క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. ఈ లెక్కన వర్షాభావం కారణంగా ఈసారి మొక్కజొన్నకు రూ.53కోట్లు, ఇతర పంటలు రూ.ఏడు కోట్ల వరకు నష్టపోయే అవకాÔ¶ ముంది. వరి విషయానికి వస్తే మండలంలో 739 హెక్టార్లలో వేశారు. ఇది కాస్తా నెర్రెలు వారటంతో సగానికిపైగా నష్టపోయే అవకాశం ఏర్పడింది. కష్టాలు తప్పడంలేదు మాగనూర్ : అన్నదాతలకు ఈసారి కష్టాలు తప్పడంలేదు. మాగనూర్ మండలంలో వరి రెండు వేల ఎకరాల్లో, పత్తి 7,215ఎకరాల్లో, ఆముదాలు 5,634ఎకరాల్లో, కందులు 16,556ఎకరాల్లో, పెసర 642ఎకరాల్లో, మినుములు 37ఎకరాల్లో సాగుచేశారు. 25రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంటలన్నీ ఎండుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఏకధాటిగా వర్షాలు కురియడంతో చాలా వరకు ఆముదం పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు ఎకరానికి సుమారు రూ.పదివేల చొప్పున పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పత్తి పూత, పిందే దశలో; మరికొన్ని గ్రామాల్లో నెల రోజుల మొక్కలు ఉన్నాయి. ఓ మోస్తరుగా పెరిగినా వర్షం కురియకపోవడమేగాక ఎర్రతెగులు సోకింది. దీంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి దాపురించింది. పంటంతా ఎండిపోయింది గత నెలలో కురిసిన తొలకరి వర్షాలకు మొక్కజొన్న పంట సాగు చేశాం. ఆ తర్వాత యూరియా వేయడంతో పంట వేపుగా పెరిగింది. అయితే 50రోజుల నుంచి వాన లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. – ప్రసాద్, రైతు, ఊర్కొండ విచారణ జరుపుతున్నాం మండలంలో వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – కష్ణకిశోర్, ఏఓ, మిడ్జిల్ -
చెన్నైవాసులకు ఊరట కలిగించే వార్త
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో కష్టాలుపడుతున్న చెన్నై వాసులకు ఊరట కలిగించే వార్త. మరో 48 గంటల పాటు చెన్నైలో వర్షాలు పడే సూచన లేదని శుక్రవారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు చెన్నైలో భారీ వర్షాలు పడతాయని ఈ రోజు ఉదయం చేసిన హెచ్చరికను ఉపసంహరించుకున్నట్టు తెలియజేసింది. చెన్నైలో వర్షం కాస్త తగ్గుముఖంపట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భారత వైమానిక దళం ఏరియల్ సర్వే నిర్వహించి సహాయక చర్యలు చేపడుతోంది. వర్షం ఇకనైనా ఆగిపోతే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో అపారనష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ జలమయంకాగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
జూన్ ముగుస్తున్నా కానరాని వానచుక్క.