డొంకేశ్వర్‌లో ఓ రైతు పొలంలో నెర్రలు ఏర్పడి వాడిపోతున్న మక్క
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్: నేలను చల్లబరిచే తొలకరి వానలు ముఖం చాటేశాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా చినుకు నేలను తాకడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించాయి. ముఖ్యంగా భూమిలో వేడి కారణంగా వరినారుకు ప్రమాదం ఏర్పడింది. బోర్ల సాయంతో నీటిని ఎంత పెట్టినా రంగుమారుతోంది. ఎదుగుదల కనిపించడం లేదు. వేర్లు, కొనలు వాడిపోయి ఎండుముఖం పడుతున్నాయి. నారు చనిపోయి చేతికిరాని ప్రాంతాల్లో మళ్లీ నార్లు పోస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను చూసి రైతులు నాట్లు వేసేందుకు భయపడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
వీటికి నీరందించినా తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు ఆకులు వాడిపోతున్నాయి. పారకం చేసిన కొద్ది గంటలకే నేల పూర్తిగా పొడిబారుతోంది. ఒక్కరోజు అరుపిచ్చినా పొలంలో నెర్రలు ఏర్పడుతున్నాయి. భూమి లోపలి వేడికి విత్తనాలు సైతం ఉడికిపోయి చనిపోయితున్నాయి. అయితే, వర్షాల్లేక వ్యవసాయానికి ఏర్పడిన గడ్డు పరిస్థితులను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చేతికొచ్చిన యాసంగి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టం చేసిన వానలు, ఇప్పుడేమో సమయానికి రాకుండా దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు.
దమ్ము చేసి నారు పోయడంతోనే..
నేల లోపలి భూభాగం చల్లబడాలంటే అది వర్షాలతోనే సాధ్యమవుతుంది. తొలకరి చినుకులతో నేలలో కొంత తేమశాతం కనిపిస్తే నార్లు పోయడానికి, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ, నేల పొడిగా ఉండగానే రైతులు పొలంలో కొంత భాగాన్ని దమ్ముచేసి అందులో వరినార్లు పోశారు. దీనికి తోడు వర్షాలు రాకపోవడంతో నేలలోని వేడికి నార్లు మాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దమ్ము చేయకుండా వెదజల్లే పద్ధతిలో నార్లు పోసుకోవాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఈ ఏడాది వర్షాకాలం సీజన్‌లో 5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 4.17 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాల లేమి కారణంగా వరిసాగు ఇప్పటి వరకు 2శాతం కూడా మించలేదు. బోధన్ డివిజన్‌లోనే నాట్లు ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న సాగు సైతం ఐదుశాతం దాటలేదు.
నారు పెరుగుతలేదు
మూడెకరాల కోసం బీపీటీ రకం విత్తనాలు కొని ఇరవై రోజుల క్రితం నారు పోసినం. వర్షాల్లేక ఎండల ప్రభావానికి నారు వాడిపోయి రంగుమారుతోంది. ఎంత నీళ్లు పెట్టినా ఎదగడం లేదు. వాతావరణం అనుకూలించక పసుపు, సోయా, మక్క సాగుకు సాహసించడం లేదు. – కృష్ణయాదవ్, యువరైతు, నికాల్‌పూర్
రోగం వస్తే మందులు కొట్టినం
తొమ్మిది బస్తాల బీపీటీ విత్తనాలు చల్లినం. ఎండలకు నారుకు రోగం వచ్చింది. మొగిపురుగు ఆశించింది. వెంటనే మందులు కొట్టినం. పరిస్థితులు చూస్తేంటే నాట్లు వేయాలంటే భయంగా ఉంది. వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించాలి.
– శ్రీనివాస్, రైతు, నికాల్‌పూర్
Comments
Please login to add a commentAdd a comment