karif crops
-
నారు ఎండుతోంది... నాట్లు వేసేందుకు భయపడుతున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/మాక్లూర్: నేలను చల్లబరిచే తొలకరి వానలు ముఖం చాటేశాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా చినుకు నేలను తాకడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు పనులు నెమ్మదించాయి. ముఖ్యంగా భూమిలో వేడి కారణంగా వరినారుకు ప్రమాదం ఏర్పడింది. బోర్ల సాయంతో నీటిని ఎంత పెట్టినా రంగుమారుతోంది. ఎదుగుదల కనిపించడం లేదు. వేర్లు, కొనలు వాడిపోయి ఎండుముఖం పడుతున్నాయి. నారు చనిపోయి చేతికిరాని ప్రాంతాల్లో మళ్లీ నార్లు పోస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులను చూసి రైతులు నాట్లు వేసేందుకు భయపడుతున్నారు. వర్షాలు పడ్డప్పుడే చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, మొక్కదశలో ఉన్న మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వీటికి నీరందించినా తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు ఆకులు వాడిపోతున్నాయి. పారకం చేసిన కొద్ది గంటలకే నేల పూర్తిగా పొడిబారుతోంది. ఒక్కరోజు అరుపిచ్చినా పొలంలో నెర్రలు ఏర్పడుతున్నాయి. భూమి లోపలి వేడికి విత్తనాలు సైతం ఉడికిపోయి చనిపోయితున్నాయి. అయితే, వర్షాల్లేక వ్యవసాయానికి ఏర్పడిన గడ్డు పరిస్థితులను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న చేతికొచ్చిన యాసంగి పంటలపై దాడిచేసి తీవ్రంగా నష్టం చేసిన వానలు, ఇప్పుడేమో సమయానికి రాకుండా దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు. దమ్ము చేసి నారు పోయడంతోనే.. నేల లోపలి భూభాగం చల్లబడాలంటే అది వర్షాలతోనే సాధ్యమవుతుంది. తొలకరి చినుకులతో నేలలో కొంత తేమశాతం కనిపిస్తే నార్లు పోయడానికి, విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ, నేల పొడిగా ఉండగానే రైతులు పొలంలో కొంత భాగాన్ని దమ్ముచేసి అందులో వరినార్లు పోశారు. దీనికి తోడు వర్షాలు రాకపోవడంతో నేలలోని వేడికి నార్లు మాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో దమ్ము చేయకుండా వెదజల్లే పద్ధతిలో నార్లు పోసుకోవాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో 5.13లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 4.17 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాల లేమి కారణంగా వరిసాగు ఇప్పటి వరకు 2శాతం కూడా మించలేదు. బోధన్ డివిజన్‌లోనే నాట్లు ప్రారంభమయ్యాయి. మొక్కజొన్న సాగు సైతం ఐదుశాతం దాటలేదు. నారు పెరుగుతలేదు మూడెకరాల కోసం బీపీటీ రకం విత్తనాలు కొని ఇరవై రోజుల క్రితం నారు పోసినం. వర్షాల్లేక ఎండల ప్రభావానికి నారు వాడిపోయి రంగుమారుతోంది. ఎంత నీళ్లు పెట్టినా ఎదగడం లేదు. వాతావరణం అనుకూలించక పసుపు, సోయా, మక్క సాగుకు సాహసించడం లేదు. – కృష్ణయాదవ్, యువరైతు, నికాల్పూర్ రోగం వస్తే మందులు కొట్టినం తొమ్మిది బస్తాల బీపీటీ విత్తనాలు చల్లినం. ఎండలకు నారుకు రోగం వచ్చింది. మొగిపురుగు ఆశించింది. వెంటనే మందులు కొట్టినం. పరిస్థితులు చూస్తేంటే నాట్లు వేయాలంటే భయంగా ఉంది. వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించాలి. – శ్రీనివాస్, రైతు, నికాల్పూర్ -
కాటేసిన ఖరీఫ్
-
రుణ ప్రణాళిక ఎప్పుడో?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతాంగం సిద్ధమైంది. ఇటీవల కొన్ని వర్షాలు పడడంతో కొందరు రైతులు విత్తనాలను విత్తుకోగా.. కొంతమంది భూములను చదును చేస్తూ విత్తనాలను వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పొలాల బాట పట్టారు. అయితే ఖరీఫ్ రుణ ప్రణాళిక మాత్రం జిల్లాలో ఇప్పటి వరకు ఖరారు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పంటల పెట్టుబడులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్ రుణ ప్రణాళిక ఆలస్యం చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రతి ఏటా బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గతేడాది కూడా రుణ లక్ష్యంలో 67 శాతం మాత్రమే పూర్తి చేశారు. రుణాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఖరీఫ్, రబీకి బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు.. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ లక్ష్యం 2,35,213 హెక్టార్లు కాగా వీటిలో వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, ఇతర అన్ని కలిపి 1,04,248 హెక్టార్లు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. 1,30,965 హెక్టార్లలో పత్తి పంట సాగుకానుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేశారు. వర్షాలు కురిస్తే మరింత జోరందుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు, దాని అనుబంధ రంగాలకు రుణాలు అందించేందుకు గతనెల 30వ తేదీన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎల్బీసీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి అన్ని జిల్లాల వార్షిక ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల రుణాలను కలిపి రూ.1.46లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు సైతం గతేడాది లక్ష్యం కంటే 6 నుంచి 10 శాతం పెంచి ఆ నిధులను కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, బ్యాంకుల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఆ పనిలోనే అధికారులు నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది రూ.1874.13కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా వాటిలో రూ.1,255.66కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అంటే 67శాతం మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైనా లక్ష్యం పూర్తవుతుందా వేచి చూడాలి. రుణం కోసం ఎదురుచూపులు ఖరీఫ్ సాగు జిల్లాలో ఇప్పుడిప్పుడే జోరందుకుంది. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా రూ.5 వేలు ఇవ్వడం పెట్టుబడికి రైతులకు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. దానికి తోడు పత్తి, మొక్కజొన్న, తదితర విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందు, కూలీల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు సాగు మరింత భారంగా మారింది. బ్యాంక్ అధికారులు స్పందించి వెంటనే రుణ ప్రణాళికను ఖరారు చేయాలని కోరుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తిసాగు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వర్షాలు కరిస్తే మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. పంట రుణాలకు రాయితీలు రైతన్నలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చెప్పున రైతుబంధు చెక్కుల పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా రుణాల విషయంలోనూ రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అందించే పంట రుణాలకు వడ్డీ రాయితీలను వర్తింపజేస్తున్నాయి. స్వల్పకాలిక రుణాలు తీసుకొని, సకాలంలో తిరిగి చెల్లించే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు పంట రుణాలకు 9శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రెండు శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు చెప్పింది. అందుకు అన్ని బ్యాంకుల యాజమాన్యాలు సమ్మతించాయి. దీంతో 7 శాతానికికే రుణాలు అందిస్తున్నారు. రూ.1లక్ష లోపు రుణం తీసుకొని ఏడాది లోపు పూర్తి బకాయి చెల్లిస్తే వడ్డీ ఉండదు. 7 శాతం వడ్డీలో కేంద్రం 3శాతం భరిస్తుండగా, మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. అదే విధంగా రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం తీసుకొని దానిని సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 4 శాతం రాయితీ రైతులకు అందుతుంది. అందులో 3శాతం కేంద్రం, ఒక్కశాతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లిస్తుంది. చాలా మంది రైతులకు రుణ వడ్డీ రాయితీపై అవగాహన లేని పరిస్థితి ఉంది. ఈ ఏడాదైనా వ్యవసాయ అధికారులు గానీ బ్యాంకు అధికారులు గానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
సోయానే దిక్కు..?
రానున్న ఖరీఫ్ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు రైతులు మొగ్గు చూపుతారని భావిస్తూ సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. 1.12 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రతిపాదన పంపింది. 60,863 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఆయకట్టుకు ఆధారమైన నిజాంసాగర్‌లో నీళ్లు లేవు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ దశకు చేరుకుంటోంది.. భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి బోర్లు వట్టి పోతున్నాయి.. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖనే అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ శాఖ ముందు జాగ్రత్త పడుతోంది. ఇందుకు అనుగుణంగా తన ఖరీఫ్ ప్రణాళికను మార్చుకుంది. ఈసారి రైతులు వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు మొగ్గు చూపే అవకాశాలుండటంతో సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. గత ఏడాది (2018) ఖరీఫ్ సీజనులో సోయా 83,265 ఎకరాల్లో సాగైంది. ఈసారి 1.12 లక్షల ఎకరాలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోయా విత్తనాలను తెప్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. 1.12 లక్షల ఎకరాలకు సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపింది. అలాగే మరో 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 500 క్వింటాళ్ల మొక్కజొన్న, ఐదు వేల క్వింటాళ్ల జీలుగ, 130 క్వింటాళ్ల సన్‌హెంప్ విత్తనాలు అవసరమని ఆ శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదించింది. స్వల్పంగా తగ్గనున్న వరి విస్తీర్ణం.. రానున్న ఖరీఫ్ సీజనులో వరి విస్తీర్ణం స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఖరీఫ్ సీజనులో జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ఈసారి మాత్రం 2.25 లక్షల ఎకరాలకు తగ్గనున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. అలాగే మొక్కజొన్న 52 వేల ఎకరాల నుంచి 49 వేల ఎకరాలు సాగయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ఖరీఫ్‌లో 4.41 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళికను సిద్ధం చేసింది. గత సీజనులో అన్ని రకాల పంటలు కలిపి 4.42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. యూరియా వినియోగం.. ఈ ఖరీఫ్ సీజనులో 60,863 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, అవసరానికి అనుగుణంగా యూరియాను తెప్పించాలని భావిస్తోంది. అలాగే 10,794 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం కాగా, ప్రస్తుతం 4,527 మెట్రిక్‌టన్నులు అందుబాటులో ఉంది. అలాగే 7,712 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులకు గాను 1,392 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. ఇక కాంప్లెక్స్ ఎరువులు 26,529 మెట్రిక్ టన్నులకు గాను, అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే రివైజ్డ్ యాక్షన్ ప్లాన్.. ప్రస్తుత పరిస్థితులు., రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్ ప్రణాళికను రూపొందిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు మారితే అందుకు అనుగుణంగా సవరించిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
రబీ ఆశలు ఆవిరి!
ఒక్క నాగార్జునసాగర్‌లోనే కొద్దిపాటి నిల్వలు మిగతా ప్రాజెక్టుల్లో ఎక్కడా అందుబాటులో లేని నీరు సాగర్‌లోనూ ఎక్కువ వాటా తాగునీటి అవసరాలకే గత ఏడాదితో పోలిస్తే 141 టీఎంసీల నీటి కొరత సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రబీ సీజన్‌కు ఇప్పటికే నెలకొన్న కరెంట్ కష్టాలకు, తోడు నీటి కష్టాలూ జతకానున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో సాగు నీటి అవసరాలకు సరిపోయే నీటి నిల్వలు ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో వాటిపై పూర్తిగా ఆశలు వదులుకోక తప్పేలాలేదు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటల విస్తీర్ణమే గణనీయంగా తగ్గగా, రబీలో మరింత క్షీణించే అవకాశముంద ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తు తం ఒక్క నాగార్జునసాగర్ నుంచి మాత్రమే కొద్దిపాటి నీటి కేటాయింపులకు అవకాశం ఉంటుం దని, అందులోనూ సింహభాగం తాగునీటి అవసరాలకే కేటాయించే అవకాశాలుంటాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా ప్రాజెక్టుల్లోని నీటిని సైతం వచ్చే జూన్ వరకు కాపాడుకుని బొట్టుబొట్టునూ జాగ్రత్తగా వాడుకోవాలని సూచనలు చేస్తున్నాయి. వర్షాలులేక ఇక్కట్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వపై ప్రభావాన్ని చూపాయి. కృష్ణా బేసిన్ పరిధిలో కొంత ఆలస్యంగానైనా వర్షాలు కురిసినా, గోదావరి బేసిన్లో మాత్రం సరిపోని రీతిలో వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్, కడెం, లోయర్ మానేరు, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టుల్లో ఎక్కడా నీరు చేరలేదు. గత ఏడాది ఇదే సమయంలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సుమారు 470 టీఎంసీల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుతానికి కేవలం 329 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 141 టీఎంసీల నీటి కొరత ఉంది. ఈ సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద సాగు అవసరాలకు సరిపడా నీటి కేటాయింపులు జరుపలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వదిలారు. నిజానికి ఈ ప్రాజెక్టు కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా లక్ష ఎకరాలకు మించి నీరివ్వలేదు. ఇక నిజాంసాగర్, సింగూరు పరిధిలో సాగు అవసరాల్లో 40 శాతానికి తక్కువగానే నీటి కేటాయింపులు చేశారు. ఒక్క నాగార్జునసాగర్ పరిధిలో మాత్రం నల్లగొండ జిల్లాలోని కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలకు సాగు నీరందింది. ఇదే ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలోని 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందింది. అయితే ప్రస్తుత రబీ సీజన్లో ఈ ఆయకట్టుకు సుమారు 40 శాతం సాగునీరు తగ్గే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 271 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ కనీస నీటి మట్టం 510 అడుగులకి లెక్కవేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 165 టీఎంసీలు మాత్రమే. ఇందులో ఏఎంఆర్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు)కింద తాగునీటికి 5 టీఎంసీలు, సాగర్ కింద మరో 8 టీఎంసీల తాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 11 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు వేసవిలో మరో 7 నుంచి 8 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటా యి. అన్నీపోనూ మిగిలిన నీటితో ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టు 22 లక్షల ఎకరాల్లో సగానికి తక్కువే నీటిని అందించే అవకాశం ఉం టుందని చెబుతున్నారు. అయితే డిసెంబర్ 15 తర్వాత ప్రాజెక్టులో నీటి నిల్వ, రబీ సాగు గణాం కాలను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులపై ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న 23.26 టీఎంసీల నీటిలో 6 టీఎంసీల మేర నీటి ఆవిరి నష్టాలు పోనూ మిగిలిన నీటిలో 12.5 టీఎంసీల నీటిని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు వాడతామని, ఇక్కడినుంచి సాగు అవసరాలకు నీరిచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 11 టీఎంసీల నీటిలో 3 నుంచి 4 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తే, కింద ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు నీరు ఇవ్వడం గగనమే కానుంది. సింగూరు నుంచి నీరు విడుదల కాకుంటే దిగువన ఉన్న నిజాంసాగర్ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ఇక్కడున్న కేవలం 1.66 టీఎంసీల నీటితో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల పశువుల దాహార్తిని తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటిని జాగ్రత్తగా వచ్చే జూన్ వరకు వాడుకోవాల్సి ఉంటుందని, రైతులకు సైతం ఈ అంశంపై అవగాహన కల్పించాలని నీటి పారుదల శాఖ కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తోంది. -
రైతుల కష్టం కన్నీటి పాలు
మునిపంపుల(రామన్నపేట),న్యూస్‌లైన్: అన్నదాతకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నగా, ఈ రబీలోనైనా అప్పులు తీరుతాయనే వరిసాగు చేసిన రైతుల ఆశలు ఆది లోనే ఆవిరయ్యాయి. సమాచారం లే కుండా ఆసిఫ్ నహర్ కాలువకు సోమవారం రాత్రి నీళ్లు వదలడంతో అప్పటికే కాల్వకు పడిన గండ్ల నుంచి వరద నీరు నారుమళ్లలోకి చేరి సుమారు 100ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. దీంతో మునిపంపుల రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు ఆసిఫ్ నహర్ కాలువకు మునిపంపుల లో మూడుచోట్ల, కక్కిరేణిలో ఒకచోట గండిపడింది. అధికారులు గండ్లను పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలువ నీటికోసం ఎదురుచూడకుండా గ్రామ రైతులు బావులు, బోర్లకింద రైతులు రబీసాగును ఆరంభించారు. నార్లుపోసి నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఐబీ అధికారులు ఇంద్రపాలనగరం పెద్దచెరువు, శోభనాద్రిపురం, నీర్నెముల చెరువులను నింపారు. నీర్నెం ల చెరువు అలుగు నీళ్లతో పొలాలు మునుగుతాయని భావి ంచిన చెరువు దిగువన ఉన్న రైతులు సోమవారంరాత్రి గే ట్లు లేపడంతో నీరు దిగువకు పారింది. పెద్ద ఎత్తున వచ్చిన కాలువనీరు గతంలో పడిన గండ్ల గుండాపోయి పొలాలు మునిగాయి. దెబ్బతిన్న రోడ్లు వరద నీటి ఉధృతికి మునిపంపుల-ఇస్కిళ్ల గ్రామాల మధ్య వేసిన రోడ్డు తెగింది. గత వర్షాలకు తెగిన రోడ్డుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. మా మిండ్ల శేషాద్రి, కూనూరు రాములు, పాండు, గంగాధరి గోపాల్, డోగిపర్తి జానకిరాములు, సప్పిడి భాస్కర్‌రెడ్డి, భగవంతరెడ్డి, సోమవీరనర్స య్య, సద్దుల మల్లేశం, మిర్యాల రవిలకు చెందిన సుమారు 40 ఎకరాల పొలం, నారు మడులు నీటమునిగి ఇసుక మేట వేసింది. దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. తహసీల్దార్ బండఅరుణారెడ్డి, ఎంపీడీఓ కె.సునీత, ఏఈలు జి.కొండయ్య, సదానందం, సర్పంచ్ కూనూరు రాముల మ్మ, పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు చంద్రశేఖర్, అం జయ్యలు దెబ్బతిన్న పొలాలు, రహదారులను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.