సోయానే దిక్కు..?  | Nizamabad Agriculture Kharif Season | Sakshi
Sakshi News home page

సోయానే దిక్కు..? 

Published Wed, May 8 2019 8:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Nizamabad Agriculture Kharif Season - Sakshi

రానున్న ఖరీఫ్‌ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు రైతులు మొగ్గు చూపుతారని భావిస్తూ సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. 1.12 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రతిపాదన పంపింది.  60,863 మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా ఆయకట్టుకు ఆధారమైన నిజాంసాగర్‌లో నీళ్లు లేవు.. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ దశకు చేరుకుంటోంది.. భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి బోర్లు వట్టి పోతున్నాయి.. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్‌ సీజనులో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖనే అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ శాఖ ముందు జాగ్రత్త పడుతోంది. ఇందుకు అనుగుణంగా తన ఖరీఫ్‌ ప్రణాళికను మార్చుకుంది. ఈసారి రైతులు వరికి బదులు ఆరుతడి పంట సోయా వైపు మొగ్గు చూపే అవకాశాలుండటంతో సబ్సిడీ సోయా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తెప్పించాలని నిర్ణయించింది. గత ఏడాది (2018) ఖరీఫ్‌ సీజనులో సోయా 83,265 ఎకరాల్లో సాగైంది.

ఈసారి 1.12 లక్షల ఎకరాలకు చేరే అవకాశాలున్నాయి. దీంతో ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్‌ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోయా విత్తనాలను తెప్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. 1.12 లక్షల ఎకరాలకు సరిపడా 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదన పంపింది. అలాగే మరో 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 500 క్వింటాళ్ల మొక్కజొన్న, ఐదు వేల క్వింటాళ్ల జీలుగ, 130 క్వింటాళ్ల సన్‌హెంప్‌ విత్తనాలు అవసరమని ఆ శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదించింది.
 
స్వల్పంగా తగ్గనున్న వరి విస్తీర్ణం.. 
రానున్న ఖరీఫ్‌ సీజనులో వరి విస్తీర్ణం స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఖరీఫ్‌ సీజనులో జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. ఈసారి మాత్రం 2.25 లక్షల ఎకరాలకు తగ్గనున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. అలాగే మొక్కజొన్న 52 వేల ఎకరాల నుంచి 49 వేల ఎకరాలు సాగయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ఖరీఫ్‌లో 4.41 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని ప్రణాళికను సిద్ధం చేసింది. గత సీజనులో అన్ని రకాల పంటలు కలిపి 4.42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

యూరియా వినియోగం..  
ఈ ఖరీఫ్‌ సీజనులో 60,863 మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం కానున్నట్లు వ్యవసాయశాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ప్రస్తుతం 23,881 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, అవసరానికి అనుగుణంగా యూరియాను తెప్పించాలని భావిస్తోంది. అలాగే 10,794 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం కాగా, ప్రస్తుతం 4,527 మెట్రిక్‌టన్నులు అందుబాటులో ఉంది. అలాగే 7,712 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ ఎరువులకు గాను 1,392 మెట్రిక్‌ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. ఇక కాంప్లెక్స్‌ ఎరువులు 26,529 మెట్రిక్‌ టన్నులకు గాను, అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయి.

అవసరమైతే రివైజ్డ్‌ యాక్షన్‌ ప్లాన్‌.. 
ప్రస్తుత పరిస్థితులు., రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఖరీఫ్‌ ప్రణాళికను రూపొందిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు మారితే అందుకు అనుగుణంగా సవరించిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement