ఏ‘కరువు’! | karuvu effect | Sakshi
Sakshi News home page

ఏ‘కరువు’!

Published Tue, Aug 30 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

వనపర్తి మండలం చిట్యాలలో ఎండిన నారుమడిని మేస్తున్న పశువులు

వనపర్తి మండలం చిట్యాలలో ఎండిన నారుమడిని మేస్తున్న పశువులు

  • వరుస కరువుతో కుదేలవుతున్న వ్యవసాయం
  • ఈ ఏడాది కరుణించని వరుణుడు
  • ప్రభుత్వ సాయం కోసం రైతన్నల ఎదురుచూపులు
  • వనపర్తి: మూడేళ్లుగా వరుస కరువుతో అల్లాడుతున్న రైతన్నలకు చేయూతనందించే వారే కరువయ్యారు. ఖరీఫ్‌ ఆరంభంలో మురిపించి, ఆ తర్వాత ముఖం చాటేస్తున్న వర్షాల కారణంగా ఏటా పెట్టుబడులు పెట్టడం తప్పా.. ఆశించిన మేరకు దిగుబడులు సాధించుకున్న వారే లేరు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మిన అన్నదాతపై మరోసారి కోలుకోలేని దెబ్బపడింది. వేసిన పంటల్లో ఇప్పటికే 60శాతం ఎండిపోయాయి. వనపర్తి నియోజకవర్గంలో 35రోజులుగా చుక్క వర్షం లేకపోవడంతో మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. నాడుమడులు వట్టిపోతున్నాయి. 
    ఆగస్టులో కరుణించని వరుణుడు
    వర్షంపై ఆధారడి వ్యవసాయం చేసుకునే రైతులు రెండేళ్ల కరువులో చేసిన అప్పులు తీర్చుకుందామని ఎంతో ఆశతో మొదట్లో కురిసిన వర్షాలకు మొక్క, జొన్న, కంది పంటలను సాగు చేశారు. బోర్లలో కాసిన్ని నీరున్న రైతులు వర్షాలు పడకపోతాయా.. బోర్లు నిండా నీరు రాకపోతుందా అని వాతావరణ శాఖపై నమ్మకం ఉంచి వేసిన నారుమడులు ప్రస్తుతం పశుగ్రాసంగా మారిపోయాయి. ఖరీఫ్‌ ఆరంభంలో జూన్‌ మాసంలో వనపర్తి నియోజకవర్గంలో సగటు వర్షపాతం 67.8మిల్లీమీటర్లు కాగా 127.2 మి.మీ. వర్షం కురిసింది. జూలైలో 163.0మి.మీ.లకు 171.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఆగస్టులో వరుణుడు మొఖం చాటేడయంతో పంటలకు భారీ నష్టం జరిగింది. ఈ మాసంలో 143మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 41.4మి.మీ. మాత్రమే కురిసింది. 101.6మి.మీ వర్షం లోటు ఉండటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. 
    చెరువుల్లో కనిపించని జలకళ 
    ప్రభుత్వం భూగర్భజలాలను పెంపొందించాలని రూ.కోట్లు వెచ్చించి మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసినా, వర్షం రాని కారణంగా చెరువు నేల నెర్రెలతో దర్శనమిస్తోంది. రోజుకో బోరులో నీరు అడుగంటిపోతోంది. నిండా పొట్టదశలో ఉన్న మక్కపంట ఎండిపోతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయే గానీ పంట చేతికొచ్చే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
    ఆదుకోని బీమా కంపెనీలు..
    వరుస కరువుతో పల్లెల్లో అన్నదాతలు అల్లాడుతున్నా.. ప్రీమియం కట్టించుకున్న బీమా కంపెనీలు రూపాయి సాయం చేయడం లేదు. పెట్టుబడితో పాటు ప్రీమియం చెల్లించేందుకు వెచ్చించిన డబ్బులు వృథా అయ్యాయనే వేదనలో రైతులున్నారు. బీమా కోసం ప్రీమియం చెల్లించిన రశీదులతో నిత్యం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 
      
     
    (వనపర్తి, పెబ్బేరు, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాల్లో ఈ ఏడాది పంటల వివరాలు హెక్టార్లలో..)
    పంట         సాధారణ విస్తీర్ణం     సాగు విస్తీర్ణం     నష్టం అంచనా  
    ఆముదం      4,527                 2,195         850
    కందులు        1,996              1,887          750
    మొక్కజొన్న 16,524            14,196         12,000
    జొన్న         2,111             1,799           850
    పత్తి           3,441               868             450
    వరి           11,226            4,200          2,500  
     
    ఎండిన పంటను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు 
    వరుస కరువుతో అల్లాడుతున్న మమ్మల్ని ఆదుకునే వారే లేరా. ప్రభుత్వం రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదు. వేలకువేల పెట్టుబడులతో వ్యవసాయం చేసే బదులు అడ్డమీది కూలీగా పనికి వెళ్లినా అప్పులు, వడ్డీల బాధలు తప్పేవి. ఎండిన పంటలను చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు.
    – కుమ్మరి వెంకటయ్య, రైతు, చిట్యాల, వనపర్తి  
     
    ఒక్క అధికారి రాలేదు.. 
    పంటలకు బీమా వర్తించాలంటే ఇంతకంటే కరువు రావాలా? ప్రీమియం కట్టించుకునేప్పుడు ఉప కథలు చెప్పే అధికారులు, తీరా పంటలు ఎండాయంటే తిరిగి మళ్లీ చూడటం లేదు. ఖరీఫ్‌ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక్క వ్యవసాయ అధికారి కూడా పంటలను చూడటానికి ఊర్లోకి రాలేదు.
    –  భాస్కర్, రైతు, చిట్యాల 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement