శతాబ్దంలోనే భయంకర కరువుతో అల్లాడుతున్న ప్రజలు
నేషనల్ పార్కుల్లోనూ వన్య ప్రాణులకు మేత, నీరుకు గడ్డు పరిస్థితులు
దీనిని అరికట్టేందుకు ఉద్యానవనాల్లో జీవుల సంఖ్యను తగ్గించే ప్రణాళిక
వాటిని చంపడం ద్వారా పేదల కడుపు నింపే ప్రయత్నం
నమీబియాలో వన్యప్రాణులను వధిస్తున్న అక్కడి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: నమీబియాలో కరువు విజృంభిస్తోంది. గడిచిన శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్షం తాండవిస్తోంది. ఇది మనుషుల నుంచి వన్య ప్రాణులకు వరకు కబళిస్తోంది. నైరుతి ఆఫ్రికాలోని నమీబియా..వన్యప్రాణులతో కూడిన ఉద్యానవనాలు, సఫారీలకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన వన్యప్రాణులు ఇప్పుడు కరువు కారణంగా మనుషులకు ఆహారంగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మేత, నీళ్లు లభించక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు అధిక వన్యప్రాణి జనాభా కలిగిన ఉద్యానవనాల్లోని జీవులను అక్కడి ప్రభుత్వం వధిస్తోంది. వాటిని చంపడం ద్వారా ఉద్యానవనాల్లో మేత, నీళ్ల సమస్యలను తగ్గించి పేద ప్రజలకు ఆహారంగా వినియోగిస్తున్నట్లు ప్రకటించింది.
సంఖ్యను తగ్గిస్తూ..జంతువులను వధిస్తూ
నమీబియాలో ఏటా వచ్చే కరువు ఈసారి మరింత తీవ్రంగా మారింది. గతంలో కరువు ముప్పు నుంచి ఉద్యానవనాలను తప్పించేందుకు జంతువులను ప్రభుత్వం వేలం వేసేది. వచి్చన సొమ్ముతో ఉద్యానవనాలను నిర్వహించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా అనేక జంతువులను వధించేలా నమీబియా లైవ్లీహుడ్ వల్నెరబిలిటీ అసెస్‌మెంట్ అండ్ ఎనాలిసిస్ రిపోర్ట్‌ను అక్కడి ప్రభుత్వం తీసుకువచి్చంది. దీంతో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 100 ఎలాండ్స్, 300 జీబ్రాలతో సహా సుమారు 700కు పైగా జంతువులను వధించడానికి చర్యలు తీసుకుంది. జంతువుల సంఖ్య అధికంగా ఉన్న నేషనల్ పార్కులలో మేత, నీరు సరిపోవడం లేదు. మేత కరువును, నీటి లభ్యతను నివారించడంలో ఈ వన్యప్రాణుల సంఖ్యను తగ్గించే విధానం తమకు సహాయపడుతుందని నమీబియా ప్రభుత్వం భావిస్తోంది.
హెచ్చరికలు..ఆంక్షలు
నమీబియాలో దుర్భిక్షంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. దేశంలో మే నెలలో అత్యవసర పరిస్థితిని విధించారు. 30 లక్షల మంది జనాభాలో దాదాపు సగం మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క ఏనుగులు, ఇతర వన్యప్రాణులు మనుషులపై దాడులు చేసే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. రాత్రిపూట ఆయా ప్రదేశాల్లో తిరగడం, నదుల్లో ఈత కొట్టడం, స్నానాలు చేయడం, పశువులను విచ్చలవిడిగా వదిలిపెట్టడం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. నమీబ్ నౌక్లఫ్ట్ పార్క్, మంగెట్టి నేషనల్ పార్క్, బ్వాబ్వాటా నేషనల్ పార్క్, ముడుమో నేషనల్ పార్క్, న్కాసా రూపారా నేషనల్ పార్కుల్లోని వన్యప్రాణులను తీసుకువచ్చి వధించి..పేదలకు ఆహారంగా అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment