drought crisis
-
Namibia's drought crisis: నాడు ఆహ్లాదం..నేడు ఆహారం
సాక్షి, అమరావతి: నమీబియాలో కరువు విజృంభిస్తోంది. గడిచిన శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్షం తాండవిస్తోంది. ఇది మనుషుల నుంచి వన్య ప్రాణులకు వరకు కబళిస్తోంది. నైరుతి ఆఫ్రికాలోని నమీబియా..వన్యప్రాణులతో కూడిన ఉద్యానవనాలు, సఫారీలకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన వన్యప్రాణులు ఇప్పుడు కరువు కారణంగా మనుషులకు ఆహారంగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మేత, నీళ్లు లభించక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు అధిక వన్యప్రాణి జనాభా కలిగిన ఉద్యానవనాల్లోని జీవులను అక్కడి ప్రభుత్వం వధిస్తోంది. వాటిని చంపడం ద్వారా ఉద్యానవనాల్లో మేత, నీళ్ల సమస్యలను తగ్గించి పేద ప్రజలకు ఆహారంగా వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. సంఖ్యను తగ్గిస్తూ..జంతువులను వధిస్తూ నమీబియాలో ఏటా వచ్చే కరువు ఈసారి మరింత తీవ్రంగా మారింది. గతంలో కరువు ముప్పు నుంచి ఉద్యానవనాలను తప్పించేందుకు జంతువులను ప్రభుత్వం వేలం వేసేది. వచి్చన సొమ్ముతో ఉద్యానవనాలను నిర్వహించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా అనేక జంతువులను వధించేలా నమీబియా లైవ్లీహుడ్ వల్నెరబిలిటీ అసెస్మెంట్ అండ్ ఎనాలిసిస్ రిపోర్ట్‌ను అక్కడి ప్రభుత్వం తీసుకువచి్చంది. దీంతో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 100 ఎలాండ్స్, 300 జీబ్రాలతో సహా సుమారు 700కు పైగా జంతువులను వధించడానికి చర్యలు తీసుకుంది. జంతువుల సంఖ్య అధికంగా ఉన్న నేషనల్ పార్కులలో మేత, నీరు సరిపోవడం లేదు. మేత కరువును, నీటి లభ్యతను నివారించడంలో ఈ వన్యప్రాణుల సంఖ్యను తగ్గించే విధానం తమకు సహాయపడుతుందని నమీబియా ప్రభుత్వం భావిస్తోంది. హెచ్చరికలు..ఆంక్షలు నమీబియాలో దుర్భిక్షంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. దేశంలో మే నెలలో అత్యవసర పరిస్థితిని విధించారు. 30 లక్షల మంది జనాభాలో దాదాపు సగం మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క ఏనుగులు, ఇతర వన్యప్రాణులు మనుషులపై దాడులు చేసే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. రాత్రిపూట ఆయా ప్రదేశాల్లో తిరగడం, నదుల్లో ఈత కొట్టడం, స్నానాలు చేయడం, పశువులను విచ్చలవిడిగా వదిలిపెట్టడం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. నమీబ్ నౌక్లఫ్ట్ పార్క్, మంగెట్టి నేషనల్ పార్క్, బ్వాబ్వాటా నేషనల్ పార్క్, ముడుమో నేషనల్ పార్క్, న్కాసా రూపారా నేషనల్ పార్కుల్లోని వన్యప్రాణులను తీసుకువచ్చి వధించి..పేదలకు ఆహారంగా అందిస్తోంది. -
Afghanistan: ఏడాదిగా అరాచకమే
సరిగ్గా ఏడాది క్రితం.. అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న అఫ్గానిస్తాన్ మళ్లీ తాలిబన్ల చెరలో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోవడం ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో తాలిబన్లు పాగా వేశారు. వారి అరాచక పాలనకు ఏడాది నిండింది. తాలిబన్లు అఫ్గాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరువు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తున్నాయని అఫ్గాన్ పౌరులు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. పిడివాద పాలనను పరిశీలిస్తే నిర్వేదమే మిగులుతుంది. ఆహార సంక్షోభం ప్రపంచంలో తాలిబన్ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020–21లో అఫ్రాఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే కావడం గమనార్హం. తాలిబన్ల రాకతో ఈ సాయమంతా హఠాత్తుగా ఆగిపోయింది. అఫ్గాన్‌కు చెందిన 7 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. అఫ్గాన్ పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్‌కు వలసవెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోతున్నారు. ఈ రోజు తినడానికి తిండి దొరికితే అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. అఫ్గాన్ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు కనిపించడం లేదు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు: అఫ్గాన్‌లో మహిళలపై వివక్ష యథావిధిగా కొనసాగుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. మీరు ఇక ఇళ్లకే పరిమితం కావాలి, మీ కుటుంబాల్లోని పురుషులకు ఉద్యోగాలు ఇస్తాం అంటూ తేల్చిచెప్పేశారు. వారికి ఉన్నత విద్యను సైతం దూరం చేస్తున్నారు. బాలికలు పాఠశాలల్లో ఆరో గ్రేడ్‌కు మించి చదువుకోవడానికి వీల్లేదు. టీనేజీ బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. అంతోఇంతో స్తోమత కలిగిన కొందరు ఇళ్లల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే శరీరమంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలుంటాయి. వ్యవసాయ కూలీలుగా విద్యావంతులు దేశంలో ఈ ఏడాది కరువు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా ఉపాధి కోసం చేలల్లో పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి రోజువారీ కూలీ 2 డాలర్ల లోపే లభిస్తోంది. జనం ఆవేదన ఇలా ఉండగా, తాలిబన్ల వాదన మరోలా ఉంది. దేశంలో అవినీతిని అంతం చేశామని, దురాక్రమణదారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు. షరియా చట్టం పరిధిలోనే మహిళలకు హక్కులు కల్పిస్తున్నామనిఅంటున్నారు. బొగ్గు, పండ్లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడంతోపాటు కస్టమ్స్ రెవెన్యూ వసూళ్ల ద్వారా తాలిబన్లు ఆదాయం సంపాదిస్తున్నారు. 2021 డిసెంబర్ నుంచి 2022 జూన్ మధ్య 840 మిలియన్ డాలర్లు ఆర్జించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్ బడ్జెట్ 2.6 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
వేలాడుతున్న కరువు కత్తి
కరోనాని మించిన మరో మహమ్మారి తరుముకొస్తోంది దీనికి వ్యాక్సిన్ కూడా ఉండదు. ఇబ్బంది పడేది బీదాబిక్కీ జనమే. దేశాల జీడీపీలు కూడా తల్లకిందులవుతాయి ఈ శత్రువు మనకి ఎప్పట్నుంచో తెలుసు. అదే కరువు. ఇక ముందున్నది కరువు కాలమనే వివిధ అధ్యయనాలు తేల్చేశాయి. కోవిడ్–19తో గత ఏడాదిన్నరగా కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలపై మరో కత్తి వేళ్లాడుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, అడ్డూ అదుçపూ లేకుండా పెరిగిపోతున్న జనాభా, నీటి సంరక్షణ విధానంలో లోపాలు, ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న వైరస్లు మరో ముప్పు ముంగిట్లో మనల్ని నెట్టేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కరువుతో అల్లాడిపోతాయని ఐక్యరాజ్యసమితి సహా వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికను ఇప్పట్నుంచే రూపొందించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ సహా వివిధ దేశాలు ఇప్పటికే కరువు ముప్పుని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నీటి చుక్క దొరక్కపోవడంతో ఒక ఊరు ఊరంతా ఖాళీ అయింది. కేవలం ఆ గ్రామంలో 10–15 కుటుంబాలు మాత్రమే మిగలడం భవిష్యత్ కరువు పరిస్థితులకి అద్దం పడుతోంది. వేడెక్కుతున్న భూగోళం మన భూగోళం ప్రమాదకర స్థాయిలో వేడెక్కిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌తో గత పదిహేనేళ్లలో భూ ఉపరితలం, సముద్రాలు రెట్టింపు వేగంతో వేడెక్కిపోతున్నాయి. ఏ స్థాయిలో వేడెక్కుతోందంటే హిరోషిమాను ధ్వంసం చేసిన నాలుగు అణుబాంబుల్ని ప్రతీ సెకండ్ పేలిస్తే పుట్టేంత వేడి. అర్థం కావడం లేదా ..? భూమ్మీద ఉన్న 730 కోట్ల మంది ఒకేసారి 20 వేర్వేరు ఎలక్ట్రిక్ పరికరాల్ని వాడితే పుట్టేంత రేడియో ధార్మికతని సూర్యుడి నుంచి పుడమి సంగ్రహిస్తోందని నాసా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. దీని వివరాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ వెల్లడించింది. ఈ స్థాయిలో భూమి వేడెక్కడం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో తరచూ లానినా, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి పరిస్థితులు ఎదురవుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది. లానినా, ఎల్‌నినో పరిస్థితులు 3–7 ఏళ్ల మధ్య ఏర్పడి 9–12 నెలల పాటు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సాగుతాయి. దీని వల్ల కరువు కాటకాలు ఏర్పడతాయి. భూగోళం వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కరువు భూతాన్ని తరిమికొట్టడానికి కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వివిధ దేశాలకు ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్లో నీటి సంరక్షణ, దీర్ఘకాలంలో భూగర్భ జలాల్ని సుస్థిరంగా కొనసాగడానికి ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల అయిదు జిల్లాల్లోని 27 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. 3,93,000 హెక్టార్ల భూమి సాగులోని వస్తుంది. సోమాలియాలో కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ వ్యవస్థల్ని, విపత్తు సంసిద్ధతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అఫ్గాన్‌లో కరువుతో అల్లాడిపోతున్న 22 లక్షల మంది పౌరులకు ఆహార భద్రతను కల్పిస్తోంది. కరువు ముప్పుని ముందుగా గుర్తించి ప్రణాళికను రచించే ప్రాజెక్టుని ప్రారంభిస్తోంది. అధ్యయనాలు చెబుతున్నదేంటంటే.. ► 5 వేల ఏళ్లుగా కరువు అంటే మానవాళికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ కరోనా వేళ పులి మీద పుట్రలా భారత్, ఉక్రెయిన్, మాల్డోవా, బంగ్లాదేశ్, సెర్బియా దేశాలు కరువు ముప్పులో ఉన్నాయి. ► భారత్ స్థూల జాతీయోత్పత్తిపై కరువు ఏడాదికి 2–5% మేర ప్రభావం చూపిస్తుంది. మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది పెద్ద దెబ్బ. ► కరువు పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికాలో ఏడాదికి 640 కోట్ల డాలర్ల నష్టాన్ని కలుగజేస్తాయి. యూరప్‌లో ఏడాదికి 900 కోట్ల యూరోల నష్టం కలుగుతుంది. ► గత 150 ఏళ్లకాలంలో దక్కను పీఠభూముల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదురయ్యా యి. 1876–1878, 1899–1900, 1918– 1919, 1965–67, 2000–2003, 2015– 18లలో భారత్ కరువుని ఎదుర్కొంది. ► ప్రపంచ జనాభాలో అయిదో వంతు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► దక్షిణార్ధ గోళాల దేశాల్లో వర్షపాతం 30% తగ్గిపోనుంది. ► 92 ఏళ్లలో బ్రెజిల్ కనీవినీ ఎరుగని కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ► అమెరికాలోని కాలిఫోర్నియా ప్రతీ ఏడాది కరువుకి హాట్‌స్పాట్‌గా మారుతోంది. భరించలేనంత ఎండవేడిమితో కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి ► మరి కొద్ది ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక దేశాలు నీటి కొరతతో అల్లాడిపోతాయి. ప్రపంచాన్ని కబళించే మరో మహమ్మారి కరువు. దీనికి చికిత్సనివ్వడానికి ఎలాంటి వ్యా క్సిన్ ఉండదు. ఈ శతాబ్దంలో కరువు పరిస్థితులు 150 కోట్ల మందిపై ప్రభావం చూపించాయి. 12,400 కోట్ల డాలర్లకి పైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ఎప్పుడూ ఉండే కారణాలతో పాటు కరోనా మహమ్మారి తోడు కావడం కరువుని మరింత పెంచేస్తుంది. – మామి మిజుతొరి, యూఎన్‌డీఆర్‌ఆర్ చీఫ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ
హైదరాబాద్: తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భేటీ అయింది. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరవు, మంచినీటి సమస్య, ప్రాజెక్ట్‌ల రీడిజైన్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.