సాక్షి, హైదరాబాద్: నెల కిందట ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా వానలు.. రాత్రయితే చలిపెట్టేలా గాలులు.. వారం పదిరోజులు కొనసాగిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వానల జాడే లేకుండా పోయింది. ఇదేమైనా ఎండా కాలమా అన్నట్టుగా ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. నిజానికి ఏటా నైరుతి రుతుపవనాల సీజన్‌లో సంతృప్తికరంగా వానలు పడేది ఆగస్టు నెలలోనే. అలాంటిది ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు, తేలికపాటి జల్లులు కురిసినా.. ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. నెలంతా పొడి వాతావరణంతోనే గడిచింది. ఇదే సమయంలో ఈ నెలలో సగటున 29.5 డిగ్రీలకుపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక వేడి ఆగస్టుగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా.. ఇలా వానలు ఆగిపోవడం, ఒక్కసారిగా భారీగా కురవడం వంటివి జరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.
ఆగస్టులో 63.34శాతం లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఈసారి నైరుతి సీజన్ తీరును పరిశీలిస్తే.. ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకుగాను.. రెండు నెలల్లో అత్యంత లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక జాప్యం, వచ్చినా సరిగా వానలు పడక జూన్ నెలలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెల రెండో వారం నుంచి వానలు ఊపందుకుని, నెలాఖరులో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆ నెలలో ఏకంగా రెండింతలు అధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత ఆగస్టు నెలకు వచ్చేసరికి వానలు జాడే లేకుండా పోయాయి. రుతు పవనాల్లో కదలిక మందగించడంతో నెలంతా పొడి వాతావరణమే ఏర్పడింది. సాధారణంగా ఆగస్టులో సగటున 21.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. కేవలం 7.97 సెంటీమీటర్లే పడింది. అంటే ఏకంగా 63.34శాతం లోటు వర్షపాతం కావడం గమనార్హం. 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువగా వానలు పడినట్టు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఈ నెలలో గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 30డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రణాళిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి.
సీజన్ సగటు మాత్రం అధికమే..
మొత్తంగా నైరుతి రుతపవనాల సీజన్ పరిస్థితిని పరిశీలిస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వరకు సాధారణంగా 56.69 సెంటీమీటర్ల వర్షం కురవాలి. ఈసారి అంతకన్నా 13శాతం ఎక్కువగా 64.22 సెంటీమీటర్లు కురిసింది. ఇందులో జూన్‌లో తీవ్ర లోటు ఉండగా.. జూలై చివరినాటికి ఏకంగా 57శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వానలు కురవకపోవడంతో అధిక వర్షపాతం 13 శాతానికి పడిపోయింది.
నైరుతి సీజన్‌లో కురవాల్సిన, కురిసిన వర్షపాతం తీరు ఇదీ.. (సెం.మీ.లలో)
నెల | కురవాల్సింది | కురిసినది | శాతం |
జూన్ | 12.94 | 7.26 | 56.15 |
జూలై | 22.91 | 48.99 | 213.86 |
ఆగస్టు | 21.74 | 7.97 | 36.66 |
మండలాల వారీగా వర్షపాతం తీరు..
కేటగిరీ | మండలాలు |
అత్యధికం (60% కంటే ఎక్కువ) | 26 |
అధికం (20–59% ఎక్కువ) | 236 |
సాధారణం (–19% నుంచి +19% వరకు) | 293 |
లోటు (–20% నుంచి –59%) | 57 |
జిల్లాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే...
- ప్రస్తుత సీజన్‌లో 14 జిల్లాల్లో అధికంగా, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడినట్టు అధికారులు చెప్తున్నారు.
- మండలాల వారీగా పరిశీలిస్తే 26 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 236 మండలాల్లో అధిక వర్షపాతం, 293 మండలాల్లో సాధారణ వర్షపాతం, 27 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.
- జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు వారాలు వానల్లేక రాష్ట్రంలో డ్రైస్పెల్ నమోదైంది. జూలై తొలి రెండు వారాలు కూడా చాలాచోట్ల పొడి వాతావరణమే ఉంది. ఆగస్టు మొదటి వారం నుంచి మూడో వారం వరకు వరుసగా పొడి వాతావరణంతో డ్రైస్పెల్ నమోదైంది. చివరి వారంలో మాత్రం పలుచోట్ల తేలికపాటి వానలు పడ్డాయి. కొన్నిచోట్ల వాతావరణం కాస్త చల్లబడింది.
Comments
Please login to add a commentAdd a comment