నీరు నిలిస్తే అంతే సంగతులు! | Do not store water before plants has to be spoiled | Sakshi
Sakshi News home page

నీరు నిలిస్తే అంతే సంగతులు!

Published Tue, Jul 15 2014 10:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

నీరు నిలిస్తే అంతే సంగతులు! - Sakshi

నీరు నిలిస్తే అంతే సంగతులు!

పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వానలు మొదలయ్యాయంటే బొప్పాయి రైతులు కలవరపాటుకు గురవుతుంటారు. ఎందుకంటే మొక్కలు/చెట్ల పాదుల్లో వర్షపు నీరు నిలిస్తే కాండం-మొదలు కుళ్లు తెగులు సోకుతుంది. పంటకు, రైతుకు అపార నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ తెగులుపై రైతులు పూర్తి అవగాహన ఏర్పరచుకొని, సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
 
 ఏ దశలోనైనా సోకుతుంది
 శిలీంద్రపు జాతి తెగుళ్లలో అత్యంత ప్రధానమైనది, ప్రమాదకరమైనది కాండం-మొదలు కుళ్లు తెగులు. ఇది నేల, నీరు, పనిముట్లు, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు కారక శిలీంద్రాలు మొక్కలు మొలిచేటప్పుడు విత్తనాలను, మొలిచిన తర్వాత నారును, తోటలో కాండాన్ని కుళ్లేలా చేస్తాయి. ఈ తెగులు ఏ దశలోనైనా పంటపై దాడి చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. తెగులు కారణంగా వేర్లు కుళ్లితే ‘రూట్ రాట్’ అని, మొదలు భాగం కుళ్లితే ‘ఫుట్ రాట్’ అని, కాండం కుళ్లితే ‘స్టెమ్ రాట్’ అని, మొదలు-వేర్ల మధ్య భాగం కుళ్లితే ‘కాలర్ రాట్’ అని, కణజాలం మెత్తబడితే ‘మాగుడు తెగులు’ అని... ఇలా ఈ తెగులును వివిధ పేర్లతో పిలుస్తుంటారు.
 
 ఏం జరుగుతుంది?
 తెగులు సోకినప్పుడు ముందుగా కాండం మొదలు వద్ద నీటి మచ్చలు కన్పిస్తాయి. ఆ తర్వాత అవి మొక్కల మొదళ్లకు పూర్తిగా వ్యాపిస్తాయి. తెగులు సోకిన భాగం క్రమేపీ గోధుమ లేదా నలుపు రంగుకు మారుతుంది. కణజాలం కుళ్లి చెడిపోతుంది. దీనివల్ల భూమి నుంచి నీరు-లవణాలు చెట్టు పైభాగాలకు, చెట్టు తయారు చేసిన పిండి పదార్థాలు వేర్లకు సరఫరా కావు. ఫలితంగా ఆకులు వాడిపోతాయి. మొక్కలు పేలవంగా ఉంటాయి.
 
 తెగులు సోకిన మొక్కలు/చెట్ల లేత ఆకులు పసుపు రంగుకు మారతాయి. ముదురు ఆకులు చెట్టు అడుగు భాగం నుంచి రాలిపోతాయి. కాయలు, పిందెలు కూడా రాలతాయి. చెట్టు నిలువునా నేల మట్టానికి పడిపోతుంది. కుళ్లిన ప్రదేశంలో కణజాలం తేనె తుట్టె మాదిరిగా జల్లెడలా కన్పిస్తుంది. తెగులు ఉధృతి వర్షం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.
 
 నివారణ ఇలా...
 విత్తనాలు వేసేటప్పుడు కిలో విత్తనాలకు 3 గ్రాముల కాప్టాన్/మాంకోజెబ్ పట్టించి విత్తనశుద్ధి చేయాలి. 22.5-15 సెంటీమీటర్ల సైజు, 150 గేజీ మందం కలిగిన పాలిథిన్ సంచుల్లో విత్తనాలు విత్తాలి. సంచి అడుగున, పక్కన రంధ్రాలు చేయాలి. రెండు పాళ్ల  ఎర్రమట్టి, ఒక పాలు పశువుల ఎరువు, ఒక పాలు ఇసుక చొప్పున కలిపి ఆ మిశ్రమాన్ని సంచుల్లో నింపాలి. ప్రతి 100 కిలోల మట్టి మిశ్రమానికి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌ను కలపాలి. అదే విధంగా ప్రతి 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, కిలో ట్రైకోడెర్మా విరిడె జీవ శిలీంద్ర పొడి కలిపి వారం రోజుల పాటు నీడలో అభివృద్ధి చేయాలి. దానిని మట్టి మిశ్రమంలో కలిపితే నారు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు సోకవు. సంచుల్లో నీరు నిల్వ ఉండకుండా రోజ్‌క్యాన్‌తో పలచగా చల్లాలి.
 
 తోటలో తెగులు లక్షణాలు కన్పించగానే 1% బోర్డో మిశ్రమాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. లేకుంటే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత తోటలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వర్షాలు ఎక్కువగా పడి తోటలో నీరు నిలిస్తే చెట్ల వరుసల మధ్య గాడి తీసి నీటిని వెంటనే బయటికి పంపాలి. బిందుసేద్య పద్ధతిలో మొదలు చుట్టూ, బోదె వెలుపల చెట్లకు నీరు అందిస్తే తెగులు సోకడం, వ్యాప్తి చెందడం పెద్దగా జరగదు.
 
 తోటలో సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. తెగులు సోకిన, చనిపోయిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పైన తెలిపినట్లుగా బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేసుకొని చెట్ల మొదళ్లలో తేమ ఉన్నప్పుడు పోయాలి.
 - డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త
 ఉద్యాన పరిశోధనా స్థానం
 విజయరాయి, పశ్చిమ గోదావరి జిల్లా

 
 పత్తిలో ఏం చేయాలి?
 పత్తి విత్తడం ఆలస్యమైతే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన వెంటనే ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేసుకుంటే తొలి దశలో వచ్చే కలుపు మొక్కలను నివారించవచ్చు. పైరు 20-25 రోజుల దశలో ఉన్నప్పుడు అంతరకృషి చేయాలి.
 
 వర్షాలు బాగా కురుస్తుంటే విత్తిన 12-15 రోజుల మధ్య 200 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల పైరిథయోబాక్ సోడియం+400 మిల్లీలీటర్ల క్వెజలాపాప్ ఇథైల్ కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20, 40, 60, 80 రోజులప్పుడు ఎకరానికి 80 కిలోల యూరియా, 15 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ చొప్పున వేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు విత్తనాలు వేసిన 30, 45 రోజులప్పుడు మోనోక్రొటోఫాస్+నీటిని 1:4 నిష్పత్తిలో, 60 రోజులప్పుడు ఇమిడాక్లోప్రిడ్+నీటిని 1:20 నిష్పత్తిలో కలిపి ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో కాండానికి పూయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement