month
-
HYD: నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు..కారణమిదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు -
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
5 నెలల్లో 3 పార్టీలు.. 48 గంటల్లో బీజేపీకి రాంరాం.. కాంగ్రెస్ గూటికి ఛలో!
దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు. ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి హెలికాప్టర్లో సబల్గఢ్కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు. -
ఖైదీలు నెలకు ఎన్ని లేఖలు రాయవచ్చు?
జైలు ప్రపంచం చాలా విచిత్రమైనది. చాలామంది జైళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎవరూ జైలుకు వెళ్లాలని కలలో కూడా అనుకోరు. ఎన్సీఆర్బీ అందించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020’ నివేదికలోని వివరాల ప్రకారం 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4.83 లక్షల భారతీయ పౌరులు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో 76 శాతానికి పైగా అండర్ ట్రయల్ నిందితులు కాగా, 23 శాతం మంది దోషులుగా తేలిన వారున్నారు. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, శిక్ష పడిన వారిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఉన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య ఏటా పెరుగుతోంది. కాగా జైలులోని ఖైదీలు తమ కుటుంబాలకు నెలకు ఎన్ని ఉత్తరాలు రాయవచ్చనేది చాలామందిలో ఉండే సందేహం. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రతి 15 రోజులకోసారి లేఖ రాయవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జైలు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి ఖైదీ నెలకు రెండుసార్లు లేఖ రాయవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే లేఖలు రాయవచ్చు. దీనికి సంబంధించిన రికార్డును జైల్లో భద్రపరుస్తారు. కాగా జైలులోని ఖైదీలు లేఖలు రాసేటప్పుడు అవి జైలుకు, అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ లేఖ రాస్తే ఆ లేఖను జైలు అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. -
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్‌లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్‌లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్‌లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చేలా బుధవారం ఉత్తర్వులిచ్చింది. రుణగ్రహీత రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను తొలగించాలని, అన్ని స్థిరాస్తి, చర ఆస్థి ఒరిజినల్ పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాదు జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయిని ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రతిరోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. డిసెంబరు 1, 2023 తర్వాత చరాస్తులు/ స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.(గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆర్బీఐ తాజా ఆదేశాలిచ్చింది. అలాగే చరాస్తులు/స్థిర ఆస్తి ఒరిజినల్ పత్రాల నష్టం/నష్టానికి సంబంధించి,ఆయా సంస్థలు, అటువంటి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో రుణ గ్రహీతకు సాయపడతాయని,, పరిహారం చెల్లించడంతో పాటు సంబంధిత ఖర్చులను భరిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సందర్బాల్లో ఈ విధానాన్ని పూర్తి చేయడానికి RE లకు 30 రోజుల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది (అంటే, మొత్తం 60 రోజుల వ్యవధి తర్వాత) లెక్కించబడుతుందని కూడా తెలిపింది. -
గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఉదంతం విజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చరణ్‌సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్‌ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది. పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్‌లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం! -
మాస్కోకు నార్త్ కొరియా కిమ్, రహస్య భేటీ?
సియోల్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుగా ఉన్నారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మిత్ర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారు. యుద్ధసామాగ్రి సరఫరా అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ త్వరలో భేటీ కానున్నారు. కొత్త ఆయుధ సామగ్రితో మరింత విధ్వంసానికి ప్రణాళికలు చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు అందించడంపై చర్చించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారని అమెరికా తెలిపింది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కిమ్‌తో రష్యా రహస్యంగా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ గత వారం హెచ్చరించింది. ఆ తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. కిమ్ సాధారణంగా ఉత్తర కొరియా దాటి బయటికి వెళ్లరు. కానీ పుతిన్‌తో ఈ నెలాఖరున రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వెళ్లి పుతిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. మాస్కోకు కూడా కిమ్ పర్యటించే అవకాశం ఉందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గతేడాది రష్యాకు ఉత్తరకొరియా రాకెట్లను, మిస్సైల్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆయుధ సరఫరా ఒప్పందంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించారని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. రష్యాతో ఆయుధ ఒప్పందాలు రద్దు చేసుకుని, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉత్తరకొరియాను కోరారు. ఉత్తర కొరియా, రష్యా మధ్య ఆయుధ ఒప్పందాలు భద్రతా మండలి నిర్ణయాలకు వ్యతిరేకమని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్‌లు గత వారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇదీ చదవండి: రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ -
వానలు మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నెల కిందట ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా వానలు.. రాత్రయితే చలిపెట్టేలా గాలులు.. వారం పదిరోజులు కొనసాగిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నెల రోజులుగా వానల జాడే లేకుండా పోయింది. ఇదేమైనా ఎండా కాలమా అన్నట్టుగా ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. నిజానికి ఏటా నైరుతి రుతుపవనాల సీజన్లో సంతృప్తికరంగా వానలు పడేది ఆగస్టు నెలలోనే. అలాంటిది ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు, తేలికపాటి జల్లులు కురిసినా.. ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. నెలంతా పొడి వాతావరణంతోనే గడిచింది. ఇదే సమయంలో ఈ నెలలో సగటున 29.5 డిగ్రీలకుపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యధిక వేడి ఆగస్టుగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల కారణంగా.. ఇలా వానలు ఆగిపోవడం, ఒక్కసారిగా భారీగా కురవడం వంటివి జరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆగస్టులో 63.34శాతం లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి నైరుతి సీజన్ తీరును పరిశీలిస్తే.. ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకుగాను.. రెండు నెలల్లో అత్యంత లోటు వర్షపాతమే నమోదైంది. నైరుతి రుతుపవనాల రాక జాప్యం, వచ్చినా సరిగా వానలు పడక జూన్ నెలలో తక్కువగా వర్షపాతం నమోదైంది. జూలై నెల రెండో వారం నుంచి వానలు ఊపందుకుని, నెలాఖరులో కుండపోత వర్షాలు పడ్డాయి. ఆ నెలలో ఏకంగా రెండింతలు అధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత ఆగస్టు నెలకు వచ్చేసరికి వానలు జాడే లేకుండా పోయాయి. రుతు పవనాల్లో కదలిక మందగించడంతో నెలంతా పొడి వాతావరణమే ఏర్పడింది. సాధారణంగా ఆగస్టులో సగటున 21.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. కేవలం 7.97 సెంటీమీటర్లే పడింది. అంటే ఏకంగా 63.34శాతం లోటు వర్షపాతం కావడం గమనార్హం. 1901 సంవత్సరం తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువగా వానలు పడినట్టు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఈ నెలలో గరిష్టంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 30డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రణాళిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి. సీజన్ సగటు మాత్రం అధికమే.. మొత్తంగా నైరుతి రుతపవనాల సీజన్ పరిస్థితిని పరిశీలిస్తే.. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వరకు సాధారణంగా 56.69 సెంటీమీటర్ల వర్షం కురవాలి. ఈసారి అంతకన్నా 13శాతం ఎక్కువగా 64.22 సెంటీమీటర్లు కురిసింది. ఇందులో జూన్‌లో తీవ్ర లోటు ఉండగా.. జూలై చివరినాటికి ఏకంగా 57శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వానలు కురవకపోవడంతో అధిక వర్షపాతం 13 శాతానికి పడిపోయింది. నైరుతి సీజన్లో కురవాల్సిన, కురిసిన వర్షపాతం తీరు ఇదీ.. (సెం.మీ.లలో) నెల కురవాల్సింది కురిసినది శాతం జూన్ 12.94 7.26 56.15 జూలై 22.91 48.99 213.86 ఆగస్టు 21.74 7.97 36.66 మండలాల వారీగా వర్షపాతం తీరు.. కేటగిరీ మండలాలు అత్యధికం (60% కంటే ఎక్కువ) 26 అధికం (20–59% ఎక్కువ) 236 సాధారణం (–19% నుంచి +19% వరకు) 293 లోటు (–20% నుంచి –59%) 57 జిల్లాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే... ప్రస్తుత సీజన్లో 14 జిల్లాల్లో అధికంగా, 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడినట్టు అధికారులు చెప్తున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే 26 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 236 మండలాల్లో అధిక వర్షపాతం, 293 మండలాల్లో సాధారణ వర్షపాతం, 27 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు వారాలు వానల్లేక రాష్ట్రంలో డ్రైస్పెల్ నమోదైంది. జూలై తొలి రెండు వారాలు కూడా చాలాచోట్ల పొడి వాతావరణమే ఉంది. ఆగస్టు మొదటి వారం నుంచి మూడో వారం వరకు వరుసగా పొడి వాతావరణంతో డ్రైస్పెల్ నమోదైంది. చివరి వారంలో మాత్రం పలుచోట్ల తేలికపాటి వానలు పడ్డాయి. కొన్నిచోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. -
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, 30రోజులు వాలిడిటీతో
సాక్షి,ముంబై: దేశీయ టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ యూజర్లకు సరికొత్త ప్లాన్‌ను అందిస్తోంది. 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎందుకంటే 30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే రోజుకు 100 మెసేజ్‌లకు పరిమితం. ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. -
Russia-Ukraine war: కలకలానికి నెల!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్ దాడులకు ఆదేశించారు. రష్యా దురాక్రమణకు నిరసనగా అమెరికా, యూరప్‌దేశాలు ఆంక్షల కత్తి ఝళింపించాయి. ఆంక్షల ఫలితంగా రష్యా వద్ద ఉన్న విదేశీ నిల్వల్లో దాదాపు సగం వాడుకునే వీలు లేకుండా పోయింది. రష్యా ఇంధన దిగుమతులను నిలిపివేయాలన్న డిమాండ్‌కు కూడా యూరప్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రష్యా చర్చలకు వస్తే నాటోలో చేరే డిమాండ్‌ను వదులుకుంటామని జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు ఎదురు దెబ్బలు కీవ్ వరకు వేగంగా వచ్చిన రష్యా దళాలకు అక్కడినుంచి భీకర ప్రతిఘటన ఎదురైంది. పాశ్చాత్య దేశాలందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్లను ఎక్కడికక్కడ నిరోధించాయి. దీంతో పలు చోట్ల రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా చెప్పినా, ఇప్పటికీ ఉక్రెయిన్ నింగిపై రష్యాకు పట్టు చిక్కలేదు. మారియోపోల్ వంటి నగరాలను రష్యన్లు స్వాధీనం చేసుకోగలిగినా ఇంకా కీలక నగరాలు రష్యాకు చిక్కలేదు. నాటో అంచనా ప్రకారం యుద్ధంలో దాదాపు 15వేల మంది రష్యన్లు మరణించారు. కాగా, అణు, జీవ, రసాయన ఆయుధాలు రష్యా ప్రయోగించే ప్రమాదముందని భయాలు పెరిగాయి. తర్వాతేంటి? ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అయినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో పుతిన్‌పై అభిమానం తగ్గడం లేదు. ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నిస్సైనికీకరణకు అంగీకరించాలని, క్రిమియాపై రష్యా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని, తూర్పు రిపబ్లిక్ల స్వయం ప్రతిపత్తిని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. సెక్యూరిటీ గ్యారెంటీలిస్తే తటస్థ స్థితిపై చర్చిస్తామని, నాటోలో చేరమని జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. అయితే క్రిమియా, తూర్పు రిపబ్లిక్ అంశాలపై కాల్పుల విరమణ, రష్యన్ బలగాల ఉపసంహరణ తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై మరింత పట్టు సాధించిన అనంతరం పుతిన్ మెట్టుదిగివస్తాడని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ను వీడిన శరణార్థులు: 35 లక్షలు నిరాశ్రయులైనవారు: కోటిమంది. ఉక్రెయిన్ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉక్రెయిన్ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం) రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్ రక్షణశాఖ గణాంకాలు). -
ఒక్క నెలలోనే యస్ బ్యాంకు రికార్డు లాభం
సాక్షి, ముంబై : వరుస వివాదాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంకు రికార్డు స్తాయి లాభాలతో దూసుకుపోతోంది. రుణాల సేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి రానుండటంతో పాటు, రాకేష్ ఝన్‌ఝన్ వాలా షేర్ల కొనుగోలు పరిణామాల నేపథ్యంలో యస్ బ్యాంక్ షేర్లు ఒక నెలలో 78 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీంతో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎక్కువ విలువైన కంపెనీల వరుసలో చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లాభంగా నిలవడం విశేషం. గత ఏడాదిలో 68 శాతం కోల్పోగా, ఈ సంవత్సరం ప్రారంభంనుంచి 61శాతం పడిపోయి, సెప్టెంబర్ 2019 చివరలో, వ్యవస్థాపకుడు రానా కపూర్, ఇతర ప్రమోటర్ల వాటాల విక్రయంతో 2019లో అతిచెత్త ప్రదర్శన కనబర్చిన కంపెనీగా దిగజారిపోయింది. అయితే ఇటీవల నిధుల సేకరణకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నాలుముమ్మరంలో చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు ప్రముఖ పెట్టుబడిదారుడు నవంబరు 5వ తేదీన రాకేష్ ఝన్ ఝన్‌వాలా రూ. 87కోట్ల విలువైన 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం మరింత సానుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్లుగా లాభపడుతూ వచ్చిన యస్ బ్యాంకు షేరు సోమవారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం ఎగిసి రూ.72.90వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 71.35 గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 1 న, యస్ బ్యాంక్ షేర్ ధర 23 శాతానికి పైగా పడిపోయి రూ. 29 వద్ద 52 వారాల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
ఆందోళనకరంగా టోకు ధరల సూచి
సాక్షి, ముంబై: ఆగస్ట్ నెల ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకరస్థాయిలో రికార్డయింది. గురువారం వెల్లడైన గణాంకాలు ప్రకారం ఆగస్టు నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)3. 24 శాతం నమోదైంది. జూలైతో పోల్చితే భారీగా పెరిగి 3.24 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం 5.75గా నమోదైంది. మరోవైపు టోకుధరల సూచి (డబ్ల్యుపీఐ) గణాంకాలు, చమురు ద్రవ్యోల్బణం.. ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు నిరుత్సాహకరంగా వెలువడటంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభాలతో జోష్‌గా ఉన్న మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 32,218 దగ్గర ఉండగా.. నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 10076 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడవుతోంది. -
నెల బిడ్డను విక్రయింవబోయిన తల్లి
-
జియోకి షాక్: నెలకి రూ.20ల కే డేటా సేవలు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏ ప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్‌పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్ చేంజర్‌గా నిలవనుంది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది. బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్ లను అందిస్తున్న డేటా విండ్ భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటరింగ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. డేటావిండ్ వ్యాపారం ఒకనెలలో ప్రాంరభకానున్నాయినే దీమాను వ్యక్తం చేశారు సీఈవో సింగ్తులి. ప్రధానంగా డేటా సేవలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. జియో రూ. 300 ప్లాన్ రూ.1,000-1,500 ఖర్చు చేసేవారికి మాత్రమే భరించగలరన్నారు. టాప్ 300 మిలియన్ ప్రజలే ఇందులే ఉంటారనీ,మిగిలిన ప్రజలు నెలకు సుమారు రూ. 90 భరించడం కష్టమని , అందుకేతాము చౌక ప్లాన్లపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. నెలకి రూ.20 లేదా సం.రానికి రూ.200 లకుమించకుండా ఉండేలా యోచిస్తున్నట్టు చెప్పారు. -
నెల ఖర్చుల కోసం సామాన్యుల కష్టాలు
-
సామాన్యుల్లో ఒకటో తారీఖు టెన్షన్..టెన్షన్..
-
చరిత్రలో అరుదైన ‘అక్టోబరు’
ఈ నెలలోనే ఐదేసి ఆది, సోమ, శనివారాలు ఒకే నెలలో ఆదివారం రోజునే అమావాస్య, పౌర్ణమి కూడా రాయవరం : కాలం తనతో పాటు ఎన్నో వింతలు, విశేషాలను కూడా తీసుకు వస్తుంది. కాలం చేసే వింతలు, విశేషాలు చరిత్రలో గుర్తులుగా మిగిలి పోతుంటాయి. అలాగే 2016 అక్టోబరు నెల తనతో పాటు కొన్ని విశేషాలను తనతోపాటు తీసుకుని వస్తుంది. సాధారణంగా ఒక నెలలో నాలుగేసి వారాలు రావడం సహజం. కాని వచ్చే అక్టోబరు నెలలో ఆది, సోమ, శనివారాలు ఐదేసి రావడం విశేషం. 2, 9, 16, 23, 30 తేదీలు ఆదివారాలుగా వస్తే, 3, 10, 17, 24, 31 తేదీలు సోమవారాలుగా, 1, 8, 15, 22, 29 తేదీలు శనివారాలుగా వచ్చాయి. కాగా ఒకే క్యాలండర్ నెలలో పౌర్ణమి, అమావాస్య రావడం అరుదుగా జరుగుతుంది. ఈ నెలలో 16న ఆదివారం పౌర్ణమి వస్తే, 30న ఆదివారం అమావాస్య రావడం మరొక విశేషంగా చెప్పవచ్చు. అదే నెలలోనే 11న దసరా, 12న మొహర్రం, 30న దీపావళి పర్వదినాలు వచ్చాయి. ఇటువంటి నెల 863 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
ప్రతి నెలా మొదటి శనివారం వెటర్నరీ డే
అనంతపురం అగ్రికల్చర్: ఇక నుంచి ప్రతి నెలా మొదటి శనివారం వెటర్నరీ డేగా పాటించాలని డైరెక్టరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ మొదటి వెటర్నరీ దినోత్సవంతో ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని డివిజన్, పశువైద్యశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెటర్నరీ డే నిర్వహించాల్సి ఉందన్నారు. -
నెలంతా పండుగే..
రాయవరం : ఆగస్టు.. ఈ నెలంతా పండుగ వాతావరణమే. నాలుగైదు పండుగలతో పాటు శ్రావణమాసం కలుస్తుండడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించినా మేలు జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. 7న నాగపంచమితో ప్రారంభం.. ఆదివారం నాగుల పంచమి. నాగపంచమి రోజున సంతానం లేని వాళ్లు, వివాహం కావల్సిన వారు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. నాగేంద్రుడిని దర్శించుకుంటారు. పాముల పుట్టలు, నాగదేవత ఆలయాల్లో పాలు పోస్తారు. ఇలా చేస్తే నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 9న మంగళగౌరీ వ్రతం.. శ్రావణమాసంలో మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం, నోము నోయడం జిల్లాలో అనాదిగా వస్తోంది. 12న వరలక్ష్మీ వ్రతం.. శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తుంటారు. రెండో శుక్రవారం మహిళలు ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వ్రతం ఆచరిస్తే అషై్టశ్వర్యాలు సమకూరడంతో పాటు మాంగళ్య బంధం బలపడుతుందని నమ్ముతారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ రోజు ఆగస్టు 15. సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వారి చీకటి పాలనకు తెరపడిన రోజు. ఈ రోజున జిల్లాలో ఉన్న 52 లక్షల మందికి పండుగే అని చెప్పవచ్చు. 18న రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలా మంది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల ఇంటికి చేరుతారు. 24న కృష్ణాష్టమి.. కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగ నిర్వహిస్తుంటారు. చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి, వారి లేత పాదాలకు రంగులు అద్ది, ఇంట్లో బుడి బుడి అడుగులు వేయిస్తుంటారు. వారి పాదముద్రలను చూసి మురిసిపోతుంటారు. కృష్ణాష్టమినాడే ఉట్టి కొడితే పుణ్యం లభిస్తుందని యువకులు ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. ఉట్టిలోని నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. -
వచ్చేనెల 10న సీపీఎం భారీ ప్రదర్శన
హాజరుకానున్న బందాకారత్ ఖమ్మం సిటీ : జిల్లాలో పోడు రైతులపై ఫారెస్టు, పోలీసుల నిర్బంధాన్ని నిలిపివేయాలని, 2005 ముందు నుంచి సాగు చేస్తున్న గిరిజన పోడు రైతులందరికీ హక్కు పత్రాలివ్వాలని, బ్యాంకు రుణాలు అందించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆగస్లు 10న ఖమ్మంలో భారీ ప్రదర్శన, మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని స్థానిక సందరయ్య భవన్లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు రైతులను సమీకరించి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బందాకారత్ ముఖ్య అతిథిగా హాజరువుతారని వివరించారు. జిల్లాలో శ్రీరామ, శ్రీరాంసాగర్, భక్తరామదాసు, సింగరేణి, ఓపెన్‌కాస్టు, కొవ్వూరు రైల్వే లైన్, విమానాశ్రయం తదితర ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయే రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇవ్వాలని ఒప్పందం జరిగిందో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దారపాడు గ్రామంలో పంటలను ధ్వంసం చేసిన సింగరేణి పీఓ, జీఎంలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు కాసాని ఐలయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, యర్రా శ్రీకాంత్, బండి రమేష్, యర్ర శ్రీనివాసరావు, మాచర్ల భారతి, జ్యోతి, రేణుక పాల్గొన్నారు.