దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.
సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు.
ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి హెలికాప్టర్‌లో సబల్‌గఢ్‌కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది.
అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment